Janmashtami 2022 holiday: ఈరోజు సెలవేనా?
19 August 2022, 10:07 IST
Janmashtami 2022 holiday: 2022 జన్మాష్టమి ఏ రోజు అనే విషయంలో చాలా గందరగోళం నెలకొంది. వేద పంచాంగం ప్రకారం.. అష్టమి తిథి సమయం రెండు రోజులకు విస్తరించడంతో ఈ పండుగను ఆగస్టు 18, 19 తేదీలలో జరుపుకుంటున్నారు. అయితే సెలవుల విషయంలో మరింత గందరగోళం ఉంది.
జన్మాష్టమి 2022: విభిన్న రాష్ట్రాల్లో విభిన్న రోజుల్లో సెలవులు
జన్మాష్టమి అనేది విష్ణుమూర్తి ఎనిమిదో అవతారమైన కృష్ణుడి పుట్టిన రోజుకు గుర్తుగా ప్రతి సంవత్సరం జరుపుకునే హిందూ పండుగ. భారతీయ సంస్కృతిలో అంతర్భాగమైన జన్మాష్టమిని వివిధ రాష్ట్రాలలో విభిన్న రీతుల్లో జరుపుకుంటారు. కృష్ణుడు పుట్టి, బాల్యం గడిపినట్లు విశ్వసించే మధుర, బృందావన్లలో అతిపెద్ద వేడుక జరుగుతుంది.
జన్మాష్టమి నాడు భక్తులు శ్రీకృష్ణునికి అంకితమైన దేవాలయాలలో వేడుకలు జరుపుకుంటారు. ప్రార్థనలలో పాల్గొంటారు. ఈ రోజు అర్ధరాత్రి వరకు ఉపవాసం ఉంటారు.
ఈ సంవత్సరం వేద పంచాంగం ప్రకారం అష్టమి తిథి అతివ్యాప్తి సమయం కారణంగా ఆగస్టు 18, 19 తేదీలలో పండుగ జరుపుకుంటారు. జన్మాష్టమికి కేంద్ర ప్రభుత్వం గెజిటెడ్ సెలవుదినం కానప్పటికీ, అనేక రాష్ట్రాల్లో పాఠశాలలు, కళాశాలలు, వ్యాపారాలకు ఇది ప్రభుత్వ సెలవు.
జన్మాష్టమి నాడు ఏ రాష్ట్రాలు సెలవులు ప్రకటించాయి?
బీహార్, చండీగడ్, ఛత్తీస్‌గఢ్, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, జమ్మూ కాశ్మీర్, జార్ఖండ్, మిజోరం, మధ్యప్రదేశ్, నాగాలాండ్, ఒరిస్సా, పంజాబ్, రాజస్థాన్, సిక్కిం, తెలంగాణ, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్‌లలో జన్మాష్టమి గెజిటెడ్ సెలవు దినం. తమిళనాడులో దీనిని శ్రీకృష్ణ జయంతి అంటారు.
అయితే ఈ ఏడాది పండుగ తేదీ విషయంలో గందరగోళం నెలకొనడంతో కొన్ని రాష్ట్రాలు ఆగస్టు 18న సెలవు ఇవ్వగా, కొన్ని రాష్ట్రాలు ఆగస్టు 19న సెలవు పెట్టాయి.
ఆగస్టు 19వ తేదీని జన్మాష్టమిగా పాటిస్తూ ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థలకు సెలవు ఉంటుందని హర్యానా ప్రభుత్వం ప్రకటించింది. ఆగస్టు 18వ తేదీని గతంలో సెలవు దినంగా ప్రకటించిన ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం దానిని ఆగస్టు 19కి మార్చింది. ఇక తెలంగాణ మాత్రం ఆగస్టు 20న జన్మాష్టమిని ప్రకటించింది.
జన్మాష్టమి నాడు బ్యాంకులు తెరుస్తాయా?
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సెలవు షెడ్యూల్ ప్రకారం, పండుగ కారణంగా కొన్ని రాష్ట్రాలలో వాణిజ్య, ప్రభుత్వ రంగ బ్యాంకులు ఆగస్టు 18, 19, 20 తేదీలలో మూసిఉంటాయి.
- ఒరిస్సా, ఉత్తరాఖండ్, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్‌లో ఆగస్టు 18 (గురువారం) జన్మాష్టమి సందర్భంగా బ్యాంకులు మూతపడ్డాయి.
- గుజరాత్, మధ్యప్రదేశ్, చండీగఢ్, తమిళనాడు, సిక్కిం, రాజస్థాన్, జమ్మూ, బీహార్, ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్, మేఘాలయ, హిమాచల్ ప్రదేశ్, శ్రీనగర్‌లలో జన్మాష్టమి సందర్భంగా ఆగస్టు 19న బ్యాంకులు మూసి ఉంటాయి.
- తెలంగాణలో శ్రీకృష్ణాష్టమి సందర్భంగా ఆగస్టు 20న బ్యాంకులు మూతపడనున్నాయి.
అదే సమయంలో ఈ రోజుల్లో అన్ని ఇతర రాష్ట్రాల్లో బ్యాంకులు తెరిచి ఉంటాయి.
టాపిక్