Israel Gaza war : ఇజ్రాయెల్- గాజా మధ్య యుద్ధ మేఘాలు.. ఒకేసారి 5వేల రాకెట్ల ప్రయోగం!
09 October 2023, 16:06 IST
- Israel Gaza war : ఇజ్రాయెల్- గాజాలు యుద్ధం అంచున్న ఉన్నట్టు కనిపిస్తోంది. ఇజ్రాయెల్‌పై గాజా 5వేలకుపైగా రాకెట్లను ప్రయోగించింది.
ఇజ్రాయెల్ గాజా మధ్య యుద్ధ మేఘాలు..
Israel Gaza war : ఇజ్రాయెల్- గాజా మధ్య మరోమారు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఇంకా చెప్పాలంటే.. ఈ రెండు ప్రాంతాల మధ్య యుద్ధ మేఘాలు అలుముకున్నాయి. గాజా స్ట్రిప్ నుంచి హమాస్ మిలిటెంట్లు.. ఇజ్రాయెల్‌పై రాకెట్లతో విరుచుకుపడటమే ఇందుకు కారణం. హమాస్ చర్యలను ఇజ్రాయెల్ దళాలు ప్రతిఘటిస్తున్నాయి.
5వేల రాకెట్లతో హడలెత్తించిన గాజా..!
ఇజ్రాయెల్‌వైపు గాజా స్ట్రిప్ నుంచి కొన్ని గంటల వ్యవధిలో 5వేలకుపైగా రాకెట్లు దూసుకెళ్లడం.. అక్కడి పరిస్థితులు ఎంత తీవ్రంగా ఉన్నాయో చెబుతోంది. పవిత్రమైన జెరుసలేమ్తో పాటు అనేక ప్రాంతాల్లో అంబులెన్స్ సైరన్ మోత మోగిపోతోంది. తాజా ఘటనలో ఒక మహిళ మరణించినట్టు సమాచారం. పలువురు గాయపడినట్టు తెలుస్తోంది.
తాజా పరిస్థితులపై ఇజ్రాయెల్ భద్రతా దళాలు స్పందించాయి.
Israel Gaza conflict : "గాజా స్ట్రిప్ నుంచి అనేకమంది ఉగ్రవాదులు ఇజ్రాయెల్‌లోకి చొరబడ్డారు. గాజా స్ట్రిప్ పరిసర ప్రాంతాల్లోని ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రాకూడదని హెచ్చరికలు జారీ చేశాము. ప్రస్తుతం యుద్ధం మధ్యలో ఉన్నట్టు అనిపిస్తోంది," అని ఇజ్రాయెల్ భద్రతా దళాలు తెలిపాయి.
హమాస్ బృందం.. పక్కా ప్లాన్‌తో ఇజ్రాయెల్‌పై దాడి చేస్తున్నట్టు కనిపిస్తోంది. దీనికి ఆపరేషన్ అల్-అఖ్స ఫ్లడ్ అన్న పేరు పెట్టింది ఆ బృందం. 5వేలకుపైగా రాకెట్లను లాంచ్ చేసినట్టు ప్రకటించింది.
"ఇజ్రాయెల్ అరాచకాలకు ముగింపు పలకాలని నిర్ణయించుకున్నాము. పాలస్తీనావాసులు ఎక్కడున్నా సరే.. బయటకు వచ్చి పోరాడండి," అని హమాస్ బృందం వెల్లడించింది.
Gaza attacks Israel : ఇజ్రాయెల్‌పై గాజా ఆల్-ఔట్ అటాక్ ప్లాన్ చేసినట్టు కనిపిస్తోంది. గాజా నుంచి ఇజ్రాయెల్‌లోకి చొరబడిన అనంతరం కొందరు ఆయుధాలతో డెరూట్ ప్రాంతంలో విధ్వంసం సృష్టించినట్టు సమాచారం. రోడ్డు మీద వెళుతున్న వారిపై వీరు కాల్పులకు తెగబడినట్టు తెలుస్తోంది. వీధుల్లో గందరగోళం నెలకొంది.
మరో ప్రాంతంలో.. అనేక మంది ఇజ్రాయెల్ దేశస్థులను ఫైటర్లు బందీ చేసినట్టు సమాచారం. అక్కడి ఉద్రిక్త పరిస్థితులకు సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి.
Israel Gaza latest news : తాజా పరిణామాల మధ్య ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నేతన్యాహూ.. ఉన్నతాధికారులతో అత్యవసర భేటీని నిర్వహించాలని నిర్ణయించారు. తదుపరి చర్యలపై ప్రణాళికలు రచిస్తున్నట్టు తెలుస్తోంది.
2022 ఫిబ్రవరిలో మొదలైన రష్యా- ఉక్రెయిన్ యుద్ధం.. ఇప్పటికీ కొనసాగుతూ, ప్రపంచ ఆర్థిక వ్యవస్థను భయపెడుతోంది. ఈ తరుణంలో మరో యుద్ధం మొదలైతే.. పరిస్థితులు దారుణంగా ఉంటాయని సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది.