Supreme court on divorce issue : దంపతులు కోరుకుంటే.. వెంటనే విడాకులు- సుప్రీం సంచలన తీర్పు!
05 May 2023, 15:18 IST
Supreme court on divorce issue : భార్యాభర్తల విడాకులకు సంబంధించి సంచలన తీర్పును వెలువరించింది సుప్రీంకోర్టు. వారి మధ్య బంధం విచ్చిన్నమైపోయి, సమస్యలు పరిష్కరించుకోలేది దశలో ఉంటే.. విడాకులకు ప్రస్తుతం ఉన్న 6 నెలల నిరీక్షన నిబంధన అవసరం లేదని పేర్కొంది.
దంపతులు కోరుకుంటే.. వెంటనే విడాకులు- సుప్రీం సంచలన తీర్పు!
Supreme court on divorce issue : దంపతుల విడాకులకు సంబంధించి సుప్రీంకోర్టు సోమవారం సంచలన తీర్పును వెలువరించింది. భార్యాభర్తలిద్దరు విడాకులు తీసుకోవాలని కోరుకుంటే.. ప్రస్తుతం ఉన్న 6 నెలల నిరీక్షణ నిబంధన అవసరం లేదని స్పష్టం చేసింది. వివాహ బంధంలో ఉండలేమని భావించే దంపతులకు తక్షణమే విడాకులు ఇవ్వొచ్చని జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్‌తో కూడిన ఐదుగురు సభ్యుల ధర్మాసనం వెల్లడించింది. ఈ విధమైన తీర్పును ఇచ్చేందుకు తమకు రాజ్యాంగం ఇచ్చిన విశిష్టాధికారులు ఉన్నట్టు సర్వోన్నత న్యాయస్థానం గుర్తుచేసింది.
Supreme court latest news : ఆర్టికల్ 142ను ఉపయోగించి.. దంపతుల విడాకులకు సంబంధించి హిందూ వివాహ చట్టంలోని సెక్షన్ 13లో ఉన్న 6 నెలల వెయిటింగ్ పీరియడ్‌ను ఎత్తివేసే అధికారం తమకు ఉందా? అన్న అంశంపై విచారణ చేపట్టింది కోర్టు. ఫ్యామిలీ కోర్టులకు రిఫర్ చేయకుండా.. నేరుగా సుప్రీంకోర్టే విడాకులు మంజురు చేసే అంశంపై పలు వ్యాజ్యాలు దాఖలయ్యాయి. పరస్పర అంగీకారం ఉండి, ఆ వివాహ బంధం.. కోలుకోలేని స్థితి, విచ్ఛిన్నమైపోయి, సమస్యలు పరిష్కారం కానీ పరిస్థితిలో ఉంటే.. 6 నెలల నిరీక్షణ నిబంధన అవసరం లేదని తీర్పునిచ్చింది. అదే సమయంలో భరణం, ఇల్లు, పిల్లల హక్కుతో పాటు ఇతర నిర్వహణలకు సంబంధించి ఈక్విటీలను ఎలా బ్యాలెన్స్ చేయాలి? అన్న విషయాన్ని కూడా వివరించింది ధర్మాసనం.
వాస్తవానికి ఈ విడాకుల వ్యవహారం ఇప్పటిది కాదు. జస్టిస్ కీర్తి సింగ్, జస్టిస్ ఆర్ భానుమతి (ఇద్దరు ఇప్పుడు రిటైర్ అయ్యారు)తో కూడిన డివిజన్ బెంచీ.. ఏడేళ్ల క్రితం ఐదుగురు సభ్యుల ధర్మాసనానికి దీనిని సిఫార్సు చేసింది. ఇంత కాలం ఈ అంశంపై విచారణ జరిగింది. 2022 సెప్టెంబర్ 29న తుది తీర్పును రిజర్వ్‌లో పెట్టింది సుప్రీంకోర్టు ధర్మాసనం. తాజాగా తీర్పును వెలువరించింది.