TS Governor vs Government : గవర్నర్ పై సుప్రీంకోర్టుకు తెలంగాణ సర్కార్.. విషయం ఇదే
Governor vs Telangana State Government : గవర్నర్ తమిళిసై వ్యవహారంపై సుప్రీంకోర్టును ఆశ్రయించింది తెలంగాణ సర్కార్. అసెంబ్లీ ఆమోదముద్ర వేసిన కీలక బిల్లులకు ఆమోదం తెలపకపోవటంపై రిట్ పిటిషన్ వేసింది.
ts govt file writ petition in supreme court against governor: గత కొద్దిరోజులుగా తెలంగాణ గవర్నర్ వర్సెస్ ప్రభుత్వం అన్నట్లు వ్యవహారం సాగుతున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా మరో అంశం తెరపైకి వచ్చింది. గవర్నర్ తమిళిసై అనుసరిస్తున్న వ్యవహారంపై అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టును ఆశ్రయించింది రాష్ట్ర ప్రభుత్వం. గతేడాది శాసనసభ ఆమోదించిందిన 10 బిల్లులకు గవర్నర్ ఆమోదం తెలపకపోవడంపై న్యాయపోరాటానికి సిద్ధమైంది. ఈ మేరకు సుప్రీంకోర్టులో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి రిట్ పిటిషన్ వేశారు. ఈ రిట్ పిటీషన్ లో ప్రతివాదిగా గవర్నర్ పేరును చేర్చారు. ఈ వ్యాజ్యం రేపు విచారణకు వచ్చే అవకాశం ఉంది. సెప్టెంబర్ నుంచి 7 బిల్లులు, గత నెల నుంచి 3 బిల్లులు పెండింగ్‌లో ఉన్నట్లు పిటిషన్ లో తెలంగాణ సర్కార్ పేర్కొంది.
బిల్లులేంటి..?
గతేడాది జరిగిన తెలంగాణ శాసనసభ, మండలి సమావేశాల్లో పలు బిల్లులు ఆమోదం పొందాయి. వర్శిటీల్లో నియామకాలు చేపట్టేందుకు ఉమ్మడి బోర్డు ఏర్పాటు, సిద్దిపేట జిల్లా ములుగులోని అటవీ కళాశాల, పరిశోధన సంస్థ తెలంగాణ అటవీ విశ్వవిద్యాలయంగా మార్పు, ప్రైవేట్ విశ్వవిద్యాలయాలకు అనుమతిచ్చేలా.. ప్రైవేట్ విశ్వవిద్యాలయాల చట్ట సవరణ, జీహెచ్‌ఎంసీ, పురపాలక చట్టాలకు సవరణ, పబ్లిక్ ఎంప్లాయ్‌మెంట్ చట్టం, అజామాబాద్ పారిశ్రామిక ప్రాంత చట్టం, జీఎస్టీ చట్టాలను సవరిస్తూ బిల్లులను ప్రభుత్వం తీసుకొచ్చింది. వాటి ఆమోదం అనంతరం మరుసటి రోజున నిబంధనల మేరకు రాజ్‌భవన్‌కు పంపించారు. గవర్నర్ వాటిని పరిశీలించి ఆమోదించాక.. గెజిట్ నోటిఫికేషన్‌లో ప్రచురించాల్సి ఉంటుంది. అప్పుడు అవి చట్టరూపం పొంది అమల్లోకి వస్తాయి. సాధారణంగా వారం, పది రోజుల్లో ఆ ప్రక్రియ పూర్తవుతుంది. అయితే ఒక్క జీఎస్టీ చట్ట సవరణ బిల్లుకు మాత్రమే గవర్నర్ ఆమోదం లభించింది. మిగిలిన బిల్లులకు ఆమె నుంచి ఆమోదం రావాల్సి ఉంది. ఈ ఫైల్స్ అన్ని ప్రస్తుతం రాజ్ భవన్ పెండింగ్ లోనే ఉన్నాయి.
రాజ్‌భవన్‌లో పెండింగులో ఉన్న బిల్లుల్లో కీలకమైనది వర్శిటీల్లో నియమాకాలకు సంబంధించనది. 80 వేలకు పైగా ఉద్యోగాల భర్తీ ప్రక్రియను చేపట్టిన రాష్ట్ర ప్రభుత్వం.. ఉమ్మడి నియామక బోర్డు ద్వారా విశ్వవిద్యాలయాల్లో నియామకాలు చేపట్టాలని నిర్ణయించింది. ఈ నేపథ్యంలో గవర్నర్ ఆమోదముద్ర వేస్తే... సంబంధిత ప్రక్రియ వేగవంతం అయ్యే అవకాశం ఉంటుంది. అయితే అనూహ్యంగా గవర్నర్ ఈ బిల్లుకు ఆమోదముద్ర వేయలేదు. పైగా ఈ బిల్లుకు సంబంధించి పలు అనుమానాలు ఉన్నాయని... క్లారిటీ ఇవ్వాలంటూ రాష్ట్ర విద్యాశాఖమంత్రికి లేఖ రాశారు. ఈ పరిణామాలపై అధికార బీఆర్ఎస్ తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తోంది. కీలకమైన నియమాకాలకు సంబంధించిన బిల్లును ఆపడమేంటని ప్రశ్నిస్తోంది. కావాలనే గవర్నర్ ఇలా చేస్తున్నారని ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. అయితే వీటిపై గవర్నర్ కూడా స్పందించారు. బిల్లుల్ని తానే ఆపానని తప్పుగా ప్రచారం చేస్తున్నారని అన్నారు. ఒక్కో బిల్లును కూలంకషంగా పరిశీలిస్తున్నానని చెప్పుకొచ్చారు. అయితే ఇవాళ్టికి ఆ బిల్లుల సంగతి అలాగే ఉంది. ఈ విషయంలో గవర్నర్ వ్యవహారిస్తున్న తీరుపై ప్రభుత్వం గుర్రుగా ఉంది. ఈ నేపథ్యంలోనే న్యాయపోరాటానికి సిద్ధమైనట్లు తెలుస్తోంది.
పాతవి 7 బిల్లులు కాగా... గత నెల నుంచి 3 బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయని సుప్రీంలో దాఖలు చేసిన రిట్ పిటిషన్ లో సర్కార్ పేర్కొంది. అయితే ఈ విషయంలో ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించిన నేపథ్యంలో… గవర్నర్ ఎలా స్పందిస్తారనేది ఆసక్తికరంగా మారింది.
సంబంధిత కథనం