తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Israel - Hamas War: ‘‘హమాస్ కు మద్దతుగా యుద్ధ బరిలో దిగడానికి సిద్ధంగా ఉన్నాం’’ - హెజ్బొల్లా

Israel - Hamas war: ‘‘హమాస్ కు మద్దతుగా యుద్ధ బరిలో దిగడానికి సిద్ధంగా ఉన్నాం’’ - హెజ్బొల్లా

HT Telugu Desk HT Telugu

14 October 2023, 13:45 IST

google News
  • Israel - Hamas war: ఇజ్రాయెల్ తో యుద్ధంలో తలమునకలుగా ఉన్న హమాస్ కు మరో తీవ్రవాద సంస్థ హెజ్బొల్లా నుంచి బహిరంగ మద్ధతు లభించింది. ఇజ్రాయెల్ కు వ్యతిరేకంగా హమాస్ చేస్తున్న యుద్ధంలో హమాస్ కు మద్దతుగా యుద్ధ క్షేత్రంలో దిగడానికి సిద్ధంగా ఉన్నామని లెబనాన్ లోని హెజ్బొల్లా సంస్థ ప్రతినిధి ప్రకటించారు.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం (REUTERS)

ప్రతీకాత్మక చిత్రం

Israel - Hamas war: ఇజ్రాయెల్ పై పోరాటంలో హమాస్ కు మద్దతుగా యుద్ధంలో దిగడానికి సిద్ధంగా ఉన్నామని లెబనాన్ లోని ఇరాన్ అనుకూల తీవ్రవాద సంస్థ హెజ్బొల్లా (Hezbollah) ప్రకటించింది.

సరైన సమయం..

సరైన సమయం రాగానే హమాస్ కు మద్ధతుగా యుద్ధంలో దిగడానికి సర్వ సన్నద్ధంగా ఉన్నామని హెజ్బొల్లా డెప్యూటీ చీఫ్ నయీమ్ ఓసెమ్ ప్రకటించారు. లెబనాన్ లోని బీరుట్ లో హమాస్ కు మద్ధతుగా జరిగిన ఒక ర్యాలీని ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. హమాస్ కు మద్ధతు ఇవ్వవద్దని, యుద్ధంలో ఇజ్రాయెల్ కు వ్యతిరేకంగా పోరాడకూడదని తమపై అంతర్జాతీయంగా ఒత్తిడి పెరుగుతోందని వెల్లడించారు. ఆ ఒత్తిడులకు తలొగ్గబోమని, సరైన సమయం రాగానే పాలస్తీనాకు చెందిన సోదర సంస్థ హహాస్ కు మద్ధతుగా యుద్ధ రంగంలోకి దిగుతామని ఆయన స్పష్టం చేశారు. ‘‘అగ్ర దేశాలు, అరబ్ దేశాలు, ఐక్య రాజ్య సమితి ప్రతినిధులు మనల్ని ఈ యుద్ధంలో హమాస్ మద్దతుగా పోరాడవద్దని ప్రత్యక్షంగా, పరోక్షంగా ఒత్తిడి చేస్తున్నాయి. ఆ ఒత్తిడులను పట్టించుకోబోం. సరైన సమయం రాగానే యుద్ధంలోకి దిగుతాం’’ అని తేల్చి చెప్పారు. హెజ్బొల్లా సంస్థను అమెరికా ఉగ్రవాద సంస్థగా ప్రకటించింది.

ఏడవ రోజు..

ఇజ్రాయెల్ పై హమాస్ ప్రత్యక్ష దాడులను ప్రారంభించి నేటితో 8 రోజులు. సరిహద్దుల్లోని విద్యుత్ కంచెను ధ్వంసం చేసి వందల సంఖ్యలో ఇజ్రాయెల్ లోకి చొరబడిన హమాస్ మిలిటెంట్లు ఇజ్రాయెల్ లో మారణ హోమం సృష్టించారు. ఇళ్లల్లోకి చొరబడి పౌరులను దారుణంగా చంపేశారు. గాజా నుంచి ఒక్కరోజే 5 వేలకు పైగా రాకెట్ల ను ప్రయోగించి దాదాపు 1000 మంది వరకు ప్రాణాలు తీశారు. ఆలస్యంగా తేరుకున్న ఇజ్రాయెల్ హమాస్ పై యుద్ధం ప్రకటించింది. దాదాపు గత వారం రోజులుగా హమాస్ ఆధిపత్య ప్రాంతాలపై వైమానిక దాడులతో విరుచుకుపడుతోంది. ఇజ్రాయెల్ దాడుల్లో గాజాలో దాదాపు 500 మంది చిన్నారులు సహా 2 వేల మంది వరకు ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది.

ప్రత్యక్ష యుద్ధం

మరోవైపు, ఇజ్రాయెల్ ప్రత్యక్ష యుద్ధానికి సిద్ధమవుతోంది. వేల సంఖ్యలో సైనికులు, యుద్ధ ట్యాంకులను సరిహద్దుల్లో మోహరిస్తోంది. నేరుగా గాజాలోకి చొరబడి హమాస్ ను అంతమొందించాలని కృత నిశ్చయంతో ఉంది. ఇప్పటికే 24 గంటల్లో గాజా ను వదిలి వెళ్లాలని అక్కడి పౌరులకు అల్టిమేటం జారీ చేసింది. దాంతో, వందల సంఖ్యలో గాజా పౌరులు సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్తున్నారు. గత శనివారం నాటి హమాస్ దాడిలో ఇజ్రాయెల్ పౌరులు వందల సంఖ్యలో చనిపోవడంతో.. ఇక హమాస్ తో చావో, రేవో తేల్చుకోవాలని ఇజ్రాయెల్ నిర్ణయించుకుంది.

తదుపరి వ్యాసం