చిన్న మొత్తాల పొదుపు పథకాల వడ్డీ రేట్లపై కీలక ప్రకటన
28 June 2024, 18:29 IST
చిన్న మొత్తాల పొదుపు పథకాలకు 2025 ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికానికి వడ్డీ రేట్లపై కీలక ప్రకటన వెలువడింది.
FILE PHOTO: చిన్న మొత్తాల పొదుపు పథకాల వడ్డీ రేట్లపై కేంద్రం ప్రకటన
న్యూఢిల్లీ, జూన్ 28: చిన్న మొత్తాల పొదుపు పథకాలపై వడ్డీ రేట్లను జూలై 1, 2024తో ప్రారంభమయ్యే త్రైమాసికానికి ప్రభుత్వం యథాతథంగా ఉంచింది.
2024-25 ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికానికి సంబంధించి వివిధ చిన్న మొత్తాల పొదుపు పథకాలపై వడ్డీ రేట్లు 2024-25 ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికానికి (మార్చి 1, 2024 నుంచి జూన్ 30, 2024 వరకు) నోటిఫై చేసినట్టుగానే యథాతథంగా కొనసాగుతాయని ఆర్థిక మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్లో పేర్కొంది.
నోటిఫికేషన్ ప్రకారం సుకన్య సమృద్ధి పథకం కింద డిపాజిట్లపై 8.2 శాతం వడ్డీ రేటు, మూడేళ్ల టర్మ్ డిపాజిట్పై వడ్డీ రేటు 7.1 శాతంగా ఉంటుంది.
పాపులర్ పీపీఎఫ్, పోస్టాఫీస్ సేవింగ్స్ డిపాజిట్ల స్కీమ్ వడ్డీ రేట్లు వరుసగా 7.1 శాతం, 4 శాతంగా ఉన్నాయి.
కిసాన్ వికాస్ పత్రంపై వడ్డీ రేటు 7.5 శాతం, అలాగే పెట్టుబడులు 115 నెలల్లో మెచ్యూరిటీ అవుతాయి.
నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్ (ఎన్ఎస్సి) పై వడ్డీ రేటు 2024 జూలై-సెప్టెంబర్ కాలానికి 7.7 శాతంగా ఉంటుంది.
ప్రస్తుత త్రైమాసికం మాదిరిగానే మంత్లీ ఇన్‌కమ్ స్కీమ్ ఇన్వెస్టర్లకు 7.4 శాతం రాబడిని ఇస్తుంది.
ప్రధానంగా పోస్టాఫీసులు, బ్యాంకులు నిర్వహించే చిన్న మొత్తాల పొదుపు పథకాలపై వడ్డీ రేట్లను ప్రభుత్వం ప్రతి త్రైమాసికానికి నోటిఫై చేస్తుంది.