Indore temple tragedy: ఇండోర్ లో మెట్లబావి పై కప్పు కూలిన ఘటనలో 35 మంది దుర్మరణం
08 January 2024, 19:10 IST
Indore temple tragedy: శ్రీరామ నవమి వేడుకలు మధ్య ప్రదేశ్ లో తీరని విషాదం నింపాయి. ఇండోర్ లోని ఒక ఆలయంలో నవమి వేడుకల్లో పాల్గొంటున్న 35 మంది భక్తులు, అక్కడి మెట్ల బావి పై కప్పు కుప్పకూలడంతో ప్రాణాలు కోల్పోయారు.
ఇండోర్ లోని మహాదేవ్ ఆలయంలో మెట్లబావి పై కప్పు కూలిన ప్రమాద దృశ్యం
Indore temple tragedy: మధ్య ప్రదేశ్ లోని ఇండోర్ (Indore) లో గురువారం శ్రీరామ నవమి వేడుకల సందర్భంగా చోటు చేసుకున్న ప్రమాదంలో 35 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇండోర్ లోని బేలేశ్వర్ మహాదేవ్ ఝులేలాల్ (Beleshwar Mahadev Jhulelal) ఆలయంలో ఈ ప్రమాదం జరిగింది.
Indore temple tragedy: మెట్ల బావి పై కప్పు
ఇండోర్ లో ఉన్న పురాతన ఆలయాల్లో బేలేశ్వర్ మహాదేవ్ ఝులేలాల్ (Beleshwar Mahadev Jhulelal) ఆలయం ఒకటి. ఆలయ ప్రాంగణంలోని మెట్ల బావి (stepwell) పైన రూఫ్ వేసిన ఆలయ నిర్వాహకులు దాన్ని ఒక గదిగా వాడుకుంటున్నారు. శ్రీరామనవమి వేడుకల సందర్భంగా ఆలయానికి భక్తులు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. ఆ మెట్ల బావిపై కప్పుపైకి కూడా భక్తులు భారీగా చేరడంతో ఆ కప్పు ఒక్క సారిగా కుప్ప కూలింది. దాంతో పై కప్పుపై నిల్చున్నవారే కాకుండా, ఆ మెట్ల బావిలో ఉన్నవారు కూడా ఆ కూలిన కప్పు కింద పడిపోయారు. ప్రతీ సంవత్సరం ఆలయం వెలుపల శ్రీరామ నవమి ఉత్సవాలను నిర్వహించేవాళ్లమని, ఈ ఏడాది గుడి లోపల ఈ ఉత్సవాలు చేయడంతో ఆ ప్రమాదం జరిగిందని ఆలయ ప్రధాన పూజారి లక్ష్మి నారాయణ శర్మ తెలిపారు.
Indore temple tragedy: సహాయ చర్యలు..
సమచారం తెలియగానే ఎస్డీఆర్ఎఫ్ బృందాలు, స్థానిక పోలీసులు, స్థానిక అధికారులు అక్కడికి చేరుకుని సహాయ చర్యలు ప్రారంభించారు. సహాయ చర్యల్లో పాలు పంచుకోవడానికి 70 మంది ఆర్మీ సిబ్బంది కూడా అక్కడికి చేరుకున్నారు. ప్రమాదంలో గాయపడిన వారిని సహాయ సిబ్బంది ఆసుపత్రులకు తరలించారు. గురువారం 12 మృతదేహాలను వెలికితీశారు. మరో ఇద్దరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. మరో 21 మృతదేహాలను శుక్రవారం వెలికితీశారు. ఈ ప్రమాదంలో మొత్తం 35 మంది ప్రాణాలు కోల్పోయారని అధికారులు తెలిపారు. మెట్ల బావిపై ఉన్నది రాతి కప్పు కావడంతో, మరణాల సంఖ్య ఎక్కువగా ఉందని వెల్లడించారు. ఆ బావిలో కూడా 10 అడుగుల లోతు వరకు నీరు ఉందని, అలాగే, భారీగా బురద ఉందని తెలిపారు. బావిలోని నీటిని తోడేస్తున్నామని, అయినా, ఎప్పటికప్పుడు నీరు ఊరుతూనే ఉందన్నారు.
Indore temple tragedy: రూ. 5 లక్షల పరిహారం
ఈ ప్రమాదంలో గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిని ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ పరామర్శించారు. మృతుల కుటుంబాలకు రూ. 5 లక్షల చొప్పున పరిహారం ఇవ్వనున్నట్లు ప్రకటించారు. ఇవి కాకుండా, ప్రధానమంత్రి రిలీఫ్ ఫండ్ నుంచి రూ. 2 లక్షల చొప్పున పరిహారం లభిస్తుంది.
టాపిక్