తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  జార్జియాలోని హోటల్‌లో విషవాయువు లీక్.. 12 మంది భారతీయులు మృతి!

జార్జియాలోని హోటల్‌లో విషవాయువు లీక్.. 12 మంది భారతీయులు మృతి!

Anand Sai HT Telugu

16 December 2024, 22:21 IST

google News
    • Georgia hotel Incident : జార్జియాలోని ఓ హోటల్‌లో విషవాయువు లీకైంది. ఈ ఘటనలో 12 మంది భారతీయులు మృతి చెందినట్టుగా తెలుస్తోంది.
ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

జార్జియాలోని గూడౌరి పర్వత రిసార్ట్‌లో 12 మంది భారతీయుల మృతదేహాలు లభ్యమయ్యాయి. హోటల్లో ప్రాథమిక దర్యాప్తులో విషవాయువు కార్బన్ మోనాక్సైడ్ లీకైనట్లు తేలిందని స్థానిక పోలీసులు తెలిపారు. వీరంతా రెండో అంతస్తులోని తమ గదుల్లో నిద్రిస్తుండగా ఈ ఘటన జరిగింది. ప్రాథమిక పరిశీలన ఆధారంగా మృతదేహాలపై ఎలాంటి గాయాలు, హింసాత్మక ఆనవాళ్లు లేవని గుర్తించామని జార్జియా అంతర్గత మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.

మరణించిన 12 మందిలో 11 మంది విదేశీయులు, ఒకరు జార్జియన్ జాతీయుడని జార్జియా అధికారులు తెలిపారు. అయితే మృతులంతా హోటల్లో పనిచేసే భారతీయులేనని టిబిలిసిలోని భారత రాయబార కార్యాలయం అధికారులు హిందుస్థాన్ టైమ్స్‌కు తెలిపారు.

మరణానికి గల కారణాలపై దర్యాప్తు జరుగుతోందని భారత రాయబార కార్యాలయం తెలిపింది. మృతులంతా రెండో అంతస్తులో నిద్రిస్తుండగా ఈ ఘటన జరిగింది. ఎవరికీ ఎలాంటి గాయాలు లేవు. మరణానికి కారణం కార్బన్ మోనాక్సైడ్ పీల్చడం అని చెబుతున్నారు. అయితే మరోవైపు ఈ ఘటన సామూహిక హత్యా అనే కోణంలోనూ దర్యాప్తు జరుగుతోంది. 'జార్జియాలోని గూడౌరి హోటల్‌లో 12 మంది భారతీయులు మరణించినట్టుగా మాకు సమాచారం అందింది. మరణించిన పౌరుల గురించి సమాచారం పొందేందుకు స్థానిక అధికారులతో సంప్రదిస్తున్నాం. మృతుల కుటుంబాలకు మా ప్రగాఢ సానుభూతి.' అని భారత రాయబార కార్యాలయం తెలిపింది.

జార్జియా అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ తన ప్రకటనలో మాత్రం మృతదేహాలు కనుగొన్న గదికి సమీపంలో జనరేటర్ ఉందని తెలిపింది. చిన్న మూసి ఉన్న గదిలో ఉన్న జనరేటర్ నుంచి వచ్చిన పొగ పీల్చడం కారణంగా మరణాలు సంభవించినట్టుగా అనుమానిస్తున్నట్టుగా పేర్కొన్నారు. కరెంట్ పోయినప్పుడు జనరేటర్ నడుస్తుందని తెలిపారు. ఈ ఘటనపై క్రిమినల్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టుగా అధికారులు వెల్లడించారు. మరణానికి కచ్చితమైన కారణం గుర్తించేందుకు ఫోరెన్సిక్ విచారణ జరుగుతుందన్నారు. అయితే 12 మందిలో ఒకరు జార్జియా పౌరుడని ఆ దేశ మంత్రిత్వ శాఖ అంటోంది. దీనిపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

తదుపరి వ్యాసం