తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Indian Consulate Vandalised : అమెరికాలో ఇండియన్​ కాన్సులేట్​పై ఖలిస్థానీ మద్దతుదారులు దాడి!

Indian Consulate Vandalised : అమెరికాలో ఇండియన్​ కాన్సులేట్​పై ఖలిస్థానీ మద్దతుదారులు దాడి!

Sharath Chitturi HT Telugu

04 July 2023, 10:08 IST

google News
    • Indian Consulate Vandalised : పలువురు ఖలిస్థానీ మద్దతురులు.. అమెరికా సాన్​ ఫ్రాన్సిస్కోలోని ఇండియన్​ కాన్సులేట్​పై దాడి చేశారు. ఫలితంగా కార్యాలయానికి మంటలు అంటుకున్నాయి.
అమెరికాలో ఇండియన్​ కాన్సులేట్​ను ధ్వంసం చేసిన ఖలిస్థాన్​ మద్దతుదారులు!
అమెరికాలో ఇండియన్​ కాన్సులేట్​ను ధ్వంసం చేసిన ఖలిస్థాన్​ మద్దతుదారులు!

అమెరికాలో ఇండియన్​ కాన్సులేట్​ను ధ్వంసం చేసిన ఖలిస్థాన్​ మద్దతుదారులు!

Indian Consulate Vandalised : ఖలిస్థానీ మద్దతుదారులు మరోమారు రెచ్చిపోయారు! అమెరికా సాన్​ ఫ్రాన్సిస్కోలోని ఇండియన్​ కాన్సులేట్​ను కొందరు ధ్వంసం చేశారు. ఈ ఘటనను అమెరికా ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది.

ఇదీ జరిగింది..

స్థానిక కాలమానం ప్రకారం శనివారం ఈ ఘటన జరిగింది. తాజా ఘటనలో ఇండియన్​ కాన్సులేట్​ కార్యాలయానికి మంటలు అంటుకున్నాయి. సరైన సమయంలో స్పందించిన అగ్నిమాపక సిబ్బంది.. మంటలను అదుపులోకి తీసుకొచ్చింది. కార్యాలయానికి పెద్దగా ప్రమాదం జరగలేదని స్థానిక, రాష్ట్ర, ఫెడరల్​ అధికారులు ధ్రువీకరించారు.

మరోవైపు సాన్​ ఫ్రాన్సిస్కోలో దాడికి గురైన కార్యాలయం గోడలపై 'హింసతో హింస పుడుతుంది,' అన్న పదాలు రాసి ఉండటాన్ని అధికారులు గుర్తించారు. అదే సమయంలో ప్రో ఖలిస్థాన్​ బృందం "ఖలిస్థాన్​ టైగర్​ ఫోర్స్​"కు చెందిన ఉగ్రవాది హర్దీప్​ సింగ్​ నిజ్జార్​ మరణ వార్తకు సంబంధించిన న్యూస్​ పేపర్​ ఒకటి ఘటనాస్థలంలో దొరికింది. ఈ హర్దీప్​ సింగ్​ను కెనడాలో గత నెలలో కాల్చి చంపేశారు. అతను కెనేడియన్​ ఆర్మ్​ ఆఫ్​ సిక్స్​ ఫర్​ జస్టీస్​ అనే బృందాన్ని కూడా నడిపేవాడు.

46ఏళ్ల నిజ్జార్​ స్వస్థలం జలంధర్​. కాగా.. కెనడాలో ఎన్నో ఏళ్లుగా కార్యకలాపాలు సాగిస్తున్న బాబర్​ ఖల్సా ఇంటర్నేషనల్​ ఉగ్ర ముఠాకు అతను ఆర్థిక సాయం చేసేవాడని ఆరోపణలు ఉన్నాయి. నిజ్జార్​ మరణంతో ఖలిస్థానీ మద్దతుదారులు.. ఇండియన్​ కాన్సులేట్​పై దాడి చేసినట్టు తెలుస్తోంది.

ఖండించిన అమెరికా ప్రభుత్వం..

తాజా ఘటనను అమెరికా హోంశాఖ తీవ్రంగా ఖండించింది.

"సాన్​ ఫ్రాన్సిస్కోలోని ఇండియన్​ కాన్సులేట్​పై జరిగిన దాడిని అమెరికా తీవ్రంగా ఖండిస్తోంది. దౌత్య కార్యాలయాలు, విదేశీ దౌత్య కార్యాలయాలపై దాడిని అమెరికా సహించదు. ఇదొక క్రిమినల్​ అఫెన్స్​," అని యూఎస్​ హోంశాఖ ప్రతినిధి మాథ్యూ మిల్లర్​ ట్వీట్​ చేశారు.

పెరుగుతున్న దాడులు..!

ఖలిస్థానీ మద్దతుదారుల హింసాత్మక చర్యలు ఇటీవలి కాలంలో పెరుగుతున్నాయి. సాన్​ ఫ్రాన్సిస్కోలోనే.. కొన్ని నెలల క్రితం, ఇండియన్​ కాన్సులేట్​లోకి దూసుకెళ్లారు. రెండు ఖలిస్థానీ జండాలను అక్కడ ఎగురవేశారు. లండన్​, కెనడాల్లోనూ ఈ తరహా ఘటనలు వెలుగులోకి వచ్చాయి.

మరోవైపు కెనడాలో ప్రో ఖలిస్థానీ మద్దతుదారులు భారీ ర్యాలీని చేపట్టారు. ఈ 'ఫ్రీడం ర్యాలీ'తో టోరంటో, ఒట్టావాలోని భారతీయ రాయబార కార్యాలయాలకు ముప్పు పొంచి ఉందని తెలుస్తోంది.

తదుపరి వ్యాసం