తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  India China Clash : ‘చైనా దుశ్చర్యను సైన్యం తిప్పికొట్టింది’- రాజ్​నాథ్​

India China clash : ‘చైనా దుశ్చర్యను సైన్యం తిప్పికొట్టింది’- రాజ్​నాథ్​

13 December 2022, 13:48 IST

google News
  • India China clash in Arunachal : అరుణాచల్​ప్రదేశ్​లో ఎల్​ఏసీ వద్ద యథాతథ స్థితిని మార్చేందుకు చైనా దళాలు ప్రయత్నించాయని రాజ్​నాథ్​ సింగ్​ అన్నారు. వారి దుశ్చర్యను భారత సైన్యం సమర్థవంతంగా తిప్పికొట్టిందని లోక్​సభకు తెలిపారు.

లోక్​సభలో రాజ్​నాథ్​ సింగ్​
లోక్​సభలో రాజ్​నాథ్​ సింగ్​ (PTI)

లోక్​సభలో రాజ్​నాథ్​ సింగ్​

India China border clash : గతవారం.. అరుణాచల్​ప్రదేశ్​ తవాంగ్​ వెంబడి ఉన్న ఎల్​ఏసీ(వాస్తవాధీన రేఖ)లో యథాతథ స్థితిని మార్చేందుకు చైనా దళాలు చేసిన ప్రయత్నాన్ని.. భారత సైన్యం సమర్థవంతంగా తిప్పికొట్టిందని రక్షణమంత్రి రాజ్​నాథ్​ సింగ్​ తెలిపారు. ఈ మేరకు లోక్​సభలో ప్రకటన చేశారు.

"భారత్​-చైనా సైనికుల మధ్య డిసెంబర్​ 9న తవాంగ్​ ఘర్షణ జరిగింది. ఈ ఘటనతో ఇరువైపులా పలువురు గాయపడ్డారు. భారత సైనికులెవ్వరికి తీవ్ర గాయాలు అవ్వలేదు. ఎవరు ప్రాణాలు కోల్పోలేదు.  భారత కమాండర్​లు తక్షణమే స్పందించడంతో చైనా సైన్యం వెనుదిరిగింది. సరిహద్దు వద్ద ఘర్షణ నేపథ్యంలో దౌత్య మార్గంలో చైనాతో కేంద్ర ప్రభుత్వం మాట్లాడింది. సరిహద్దు వెంబడి ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు మన సైన్యం సిద్ధంగా ఉంది," అని లోక్​సభలో రాజ్​నాథ్​ సింగ్​ స్పష్టం చేశారు.

India China clash in Arunachal Pradesh : "సరిహద్దుల రక్షణకు మన సైన్యం కట్టుబడి ఉందని నేను హామీనిస్తున్నా. ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు మేము సిద్ధంగా ఉన్నాము. యథాతథ స్థితిని మార్చేందుకు సాహసించకూడదని చైనాకు చెప్పాము. సరిహద్దు వెంబడి శాంతిని కొనసాగించాలని పిలుపునిచ్చాము," అని రాజ్​నాథ్​ సింగ్​ అన్నారు.

విపక్షాల అంసతృప్తి..

భారత్​- చైనా సరిహద్దు ఘర్షణపై లోక్​సభలో రాజ్​నాథ్​ సింగ్​ చేసిన ప్రకటనపై విపక్షాలు అంసతృప్తి వ్యక్తం చేశారు. ఆయన మాట్లాడుతుండగా.. పలు పార్టీల ఎంపీలు వాకౌట్​ చేశారు. 'ఇలాంటి ముఖ్యమైన ఘటనపై చర్చలు జరపకుండా, ప్రకటన చేసి వదిలేయడం అనేది ప్రభుత్వ వైఖరికి అద్దంపడుతోంది,' అని కాంగ్రెస్​ ఎంపీ శక్తిసిన్హ్​ గోహిల్​ మండిపడ్డారు.

అట్టుడికిన పార్లమెంట్​..!

Tawang clash India China : భారత్​- చైనా సైనికుల మధ్య అరుణాచల్​ప్రదేశ్​లో ఘర్షణ జరిగిందన్న వార్తలు సోమవారం దేశాన్ని కుదిపేసింది. పార్లమెంట్​ సమావేశాలు జరుగుతుండటంతో.. ఈ అంశం తీవ్రత మరింత పెరిగింది. ఈ నేపథ్యంలో.. మంగళవారం ఉదయం త్రిదళాధిపతులతో సమావేశం నిర్వహించారు రాజ్​నాథ్​ సింగ్​. డిసెంబర్​ 9న జరిగిన పరిణామాలను అడిగి తెలుసుకున్నారు. ఈ క్రమంలోనే రాజ్​నాథ్​ సింగ్​.. మధ్యాహ్నం 12 గంటలకు లోక్​సభలో, ఆ తర్వాత రాజ్యసభలో ప్రకటన చేస్తారని వార్తలు వచ్చాయి.

మరోవైపు.. ఉదయం 11 గంటలకు ప్రారంభమైన పార్లమెంట్​.. భారత్​- చైనా సరిహద్దు ఘర్షణ నేపథ్యంలో అట్టుడికింది. విపక్షానికి చెందిన అనేకమంది ఎంపీలు.. ఉభయసభల్లో నిరసనకు దిగారు. కేంద్రం వెంటనే స్పష్టతనివ్వాలని డిమాండ్​ చేశారు. ఈ నేపథ్యంలో సభలు ఓసారి వాయిదా పడ్డాయి.

విపక్షాల తీరుపై కేంద్ర హోంమంత్రి అమిత్​ షా ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజీవ్​ గాంధీ ఫౌండేషన్​పై ఆరోపణలు బయటకొచ్చినప్పటి నుంచీ.. ఉభయసభల కార్యకలాపాలను కాంగ్రెస్​ అడ్డుకుంటోందని మండిపడ్డారు.

అలజడుల సరిహద్దు..!

Tawang clash latest updates : భారత్​- చైనా మధ్య గత కొంతకాలంగా సత్సంబంధాలు లేవు.  2020 గల్వాన్​ ఘర్షణ నేపథ్యంలో సరిహద్దు వెంబడి ఉద్రిక్తత తారస్థాయికి చేరింది. దాదాపు రెండేళ్లకు.. అనేక దశల చర్చల తర్వాత ఇప్పుడిప్పుడే సరిహద్దు వెంబడి శాంతి నెలకొంటోంది. ఈ నేపథ్యంలో మళ్లీ ఇరువైపుల మధ్య ఘర్షణ తలెత్తడం సర్వత్రా ఆందోళనకు గురిచేసే విషయం.

తదుపరి వ్యాసం