India-Israel relations: ఇండియా ఎందుకు ఇజ్రాయెల్ కు సపోర్ట్ చేస్తోంది?.. రెండు దేశాల సంబంధాల టైమ్ లైన్ ఇదీ..
01 November 2023, 13:23 IST
India-Israel relations: అక్టోబర్ లో ప్రారంభమైన ఇజ్రాయెల్ - హమాస్ యుద్ధం మరోసారి ప్రపంచ దేశాలను రెండు శిబిరాలుగా మార్చాయి. ఒకప్పుడు పాలస్తీనాకు గట్టి మద్ధతుదారుగా ఉన్న భారత్ కాలక్రమేణా ఇజ్రాయెల్ కు విశ్వసనీయ మిత్ర దేశంగా మారింది.
భారత ప్రధాని మోదీతో ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతాన్యాహూ
India-Israel relations: హమాస్ మిలిటెంట్లు ఇజ్రాయెల్ పై అక్టోబర్ 7 న చేసిన దాడిని మొదట ఖండించిన దేశాల్లో భారత్ ఒకటి. హమాస్ దాడిని ఉగ్రదాడిగా పేర్కొంటూ.. ఈ కష్టకాలంలో ఇజ్రాయెల్ కు తోడుగా ఉంటామని ప్రధాని మోదీ ట్వీట్ చేశారు.
ఐరాస తీర్మానానికి దూరం..
ఆ తరువాత, ఇటీవల గాజాపై ఇజ్రాయెల్ దాడికి సంబంధించి, మానవతా దృక్పథంతో కాల్పుల విరమణ చేపట్టాలని ఐక్య రాజ్య సమితి జనరల్ అసెంబ్లీ చేపట్టిన తీర్మానం ఓటింగ్ లో భారత్ పాల్గొనలేదు. ఓటింగ్ కు దూరంగా ఉంది. అయితే, జోర్డాన్ ప్రవేశపెట్టిన ఆ తీర్మానం 120 దేశాల మద్దతు ఇవ్వడంతో విజయం సాధించింది. ఆ తీర్మానానికి భారత్ సహకరించకపోవడం స్వదేశంలోనూ విమర్శలకు కారణమైంది.
మొదట పాలస్తీనా కు సపోర్ట్
చరిత్ర ను పరిశీలిస్తే, భారత్ - పాలస్తీనా, భారత్ - ఇజ్రాయెల్ సంబంధాల్లో నాటకీయ పరిణామాలు కనిపిస్తాయి. ఇజ్రాయెల్ దేశం ఏర్పాటును మహాత్మా గాంధీ, భారత తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ వ్యతిరేకించారు. పాలస్తీనియన్లకు ఇజ్రాయెల్ ముప్పుగా పరిణమిస్తుందని వారు ఆందోళన వ్యక్తం చేశారు. నాటి ఐరాస తీర్మానంలో కూడా ఇజ్రాయెల్ కు వ్యతిరేకంగా భారత్ ఓటు వేసింది. పాలస్తీనా ను స్వతంత్ర దేశంగా గుర్తించిన నాన్ - అరబ్ దేశాల్లో మొదటి దేశంగా భారత్ నిలిచింది.
1977 లో పాలస్తీనా స్టాంప్
1977 లో ప్రధాని మొరార్జీ దేశాయి నాయకత్వంలోని నాటి జనతాదళ్ ప్రభుత్వం పాలస్తీనాకు అనుకూలంగా ఒక పోస్టల్ స్టాంప్ ను కూడా జారీ చేసింది. ఆ స్టాంప్ లో పాలస్తీనా జెండాను, మ్యాప్ ను పొందుపర్చింది. ఈ సందర్భంగా భారత్ పాలస్తీనా లిబరేషన్ ఆర్గనైజేషన్ కు (Palestine Liberation Organisation PLO) సంపూర్ణ మద్ధతు ప్రకటించింది. అయితే, అప్పటికే, అంతకుముందున్న కాంగ్రెస్ ప్రభుత్వాలు క్రమంగా ఇజ్రాయెల్ - అమెరికా అనుకూల విధానాన్ని అవలంబించాయి. మొరార్జీ దేశాయి ప్రభుత్వం కూడా ఆ ధోరణి నుంచి పూర్తిగా వైదొలగలేదు. పాలస్తీనాతో పాటు ఇజ్రాయెల్ తో కూడా సంబంధాలను కొనసాగించింది. పీఎల్ఓ ఇజ్రాయెల్ మధ్య చర్చలు ప్రారంభమైన తరువాత, 1992 లో ఇజ్రాయెల్ తో పూర్తి స్థాయి దౌత్య సంబంధాలను భారత్ ఏర్పర్చుకుంది.
1999 నుంచి మారిన తీరు
భారత్, ఇజ్రాయెల్ సంబంధాల్లో 1999 నుంచి గణనీయ మార్పు ప్రారంభమైంది. ఇజ్రాయెల్ భారత్ కు అత్యంత విశ్వసనీయ, మిత్ర దేశంగా మారింది. 1999 లో పాకిస్తాన్ తో జరిగిన యుద్ధం అందుకు కారణమైంది. ఆ యుద్ధం సమయంలో భారత్ కు ఇజ్రాయెల్ భారీగా ఆయుధ సహకారం అందించింది. నాటి నుంచి ఇజ్రాయెల్ తో భారత్ రక్షణ సంబంధాలు మరింత లోతుగా మారసాగాయి. ఇప్పుడు భారత్ ప్రతీ సంవత్సరం ఇజ్రాయెల్ నుంచి 2 బిలియన్ డాలర్ల విలువైన ఆయుధాలను కొనుగోలు చేస్తుంది. రష్యా తరువాత భారత్ కు అత్యధిక ఆయుధ సరఫరాదారుగా ఇజ్రాయెల్ ఉంది.
మోదీ - నెతాన్యాహూ మైత్రి
2017 లో ప్రధాని హోదాలో నరేంద్ర మోదీ ఇజ్రాయెల్ లో పర్యటించారు. ఇజ్రాయెల్ లో పర్యటించిన తొలి భారత ప్రధానిగా మోదీ రికార్డు సృష్టించారు. ఆ తరువాత, కొన్ని నెలలకు ఇజ్రాయెల్ ప్రధాని నెతాన్యాహూ భారత్ కు వచ్చారు. గత ప్రభుత్వాల మాదిరిగా కాకుండా.. మోదీ ప్రభుత్వం ఇజ్రాయెల్ తో సంబంధాల విషయంలో ఎలాంటి రహస్యాలను మెయింటైన్ చేయకుండా, బహిరంగంగానే ఉంటూ వస్తోంది.