Israel: హమాస్ - ఇజ్రాయెల్ యుద్ధ విరమణ తీర్మానంపై ఐరాస లో జరిగిన ఓటింగ్ కు భారత్ దూరం; సిగ్గు చేటని ప్రియాంక గాంధీ ఆగ్రహం
Israel-Hamas war: ఇజ్రాయెల్ -హమాస్ యుద్ధం (Israel-Hamas war) పై ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ (UNGA)లో ప్రవేశపెట్టిన తీర్మానం ఆమోదం పొందింది. అయితే ఆ తీర్మానంపై జరిగిన ఓటింగ్ లో భారత్ పాల్గొనకపోవడం వివాదాస్పదమైంది.
Israel-Hamas war: మానవీయతతో తక్షణమే యుద్ధ విరమణ చేపట్టి, గాజా (Gaza)కు నిత్యావసర సహాయం అందించేందుకు వీలు కల్పించాలని కోరుతూ ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ (UNGA)లో ఒక తీర్మానం ఆమోదం పొందింది. ఆ తీర్మానాన్ని జోర్డాన్ ప్రవేశపెట్టగా, 120 దేశాలు ఆ తీర్మానానికి అనుకూలంగా ఓటేశాయి. 12 దేశాలు వ్యతిరేకించాయి. 45 దేశాలు ఓటింగ్ లో పాల్గొనలేదు. ఓటింగ్ లో పాల్గొనని దేశాల్లో భారత్, యూకే, జర్మనీ, ఆస్ట్రేలియా, జపాన్, గ్రీస్, కెనడా, ఉక్రెయిన్ తదితర దేశాలున్నాయి. భారత్ తీరుపై స్వదేశంలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
సిగ్గు చేటు: ప్రియాంక గాంధీ
ఇజ్రాయెల్ -హమాస్ యుద్ధం (Israel-Hamas)పై ఐరాసలో ప్రవేశపెట్టిన తీర్మానంపై ఓటింగ్ కు భారత్ దూరంగా ఉండడంపై కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ (Priyanka Gandhi) మండిపడ్డారు. ఐరాసలో భారత్ తీరుపై షాక్ కు గురయ్యానని, సిగ్గుతో తలదించుకునే పరిస్థితి ఏర్పడిందని ఆమె మండిపడ్డారు. సత్యాహింసల పునాదులపై ఏర్పడిన దేశం అంతర్జాతీయ వేదికపై ఇలా స్పందిస్తుందని ఊహించలేదన్నారు. ‘కంటికి కన్ను’ భారతదేశ విధానం కాదన్న విషయం ఆమె గుర్తు చేశారు. ఇజ్రాయెల్ - హమాస్ తక్షణమే మానవీయ కోణంలో యుద్ధ విరమణ చేయాలన్న ఐరాస ప్రతిపాదనకు భారత్ ఆమోదం తెలపకపోవడం బాధాకరమన్నారు. ఈ మేరకు ప్రియాంక గాంధీ ట్వీటర్ లో ఒక పోస్ట్ పెట్టారు.
భారత్ ఎందుకు ఓటింగ్ లో పాల్గొనలేదు..
తీర్మానంలో హమాస్ పేరును ప్రస్తావించకపోవడం, అక్టోబర్ 7న ఇజ్రాయెల్ పై హమాస్ దాడిని ఆ తీర్మానంలో ఖండించకపోవడం.. తదితర కారణాల వల్ల భారత్ ఆ తీర్మానానికి మద్ధతు ప్రకటించలేదని తెలుస్తోంది. హమాస్ దాడిని ఖండించే వ్యాఖ్యలను ఆ తీర్మానంలో చేర్చాలని కెనడా చేసిన సవరణకు భారత్ మద్ధతు తెలిపింది. కానీ ఆ సవరణకు మెజారిటీ దేశాలు మద్ధతివ్వలేదు. ‘‘యుద్ధంలో అమాయకులు ప్రాణాలు కోల్పోవడంపై భారత్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తుంది. ఆ సంక్షోభాన్ని ఇరు వర్గాలు చర్చల ద్వారా పరిష్కరించుకోవాలన్నది భారత్ ఉద్దేశం. ఉగ్రవాదానికి సరిహద్దులు లేవు. మతం, వర్గం, జాతి బేధాలు లేవు. ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా భారత్ దాన్ని ఖండిస్తుంది’’ అని ఐరాస చర్చ సందర్భంగా భారత్ స్పష్టం చేసింది.