Independence Day 2023: జెండా వందనం సమయంలో ఈ తప్పులు చేయకండి..
12 August 2023, 18:28 IST
Independence Day 2023: 77వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు భారత్ సిద్ధమవుతుంది. దేశవ్యాప్తంగా వాడవాడలా జండా వందనానికి దేశ ప్రజలు ఆనందోత్సాహాలతో సిద్ధమవుతున్నారు. జండా వందనం సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, చేయకూడని తప్పులు.. మొదలైన వివరాలు తెలుసుకుందాం..
భారత జాతీయ జెండా
Independence Day 2023: 77వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు భారత్ సిద్ధమవుతుంది. దేశవ్యాప్తంగా వాడవాడలా జండా వందనానికి దేశ ప్రజలు ఆనందోత్సాహాలతో సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో జండా వందనం సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, చేయకూడని తప్పులు.. మొదలైన వివరాలు తెలుసుకుందాం..
జెండా పండుగ విశేషాలు
ఆగస్ట్ 15న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఢిల్లీలోని ఎర్రకోటలో జాతీయ జెండాను ఎగురవేసి, జాతిని ఉద్దేశించి ప్రసంగిస్తారు. అలాగే, దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులు జాతీయ జెండాలను ఎగురవేస్తారు. దాంతో పాటు అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, విద్యా సంస్థలు, పబ్లిక్ ప్లేసెస్ లో జెండా వందనం చేస్తారు. సాధారణంగా, ఉదయమే జెండా వందనం చేసి, మిఠాయిలు పంచుతారు. దేశ ఐక్యత, సమగ్రతకు నిదర్శనంగా జెండా పండుగ నిలుస్తుంది.
జెండా వందనం నిబంధనలు
జెండా వందనం సమయంలో పాటించాల్సిన కొన్ని నిబంధనలు ఉంటాయి. జెండా పొడవు, వెడల్పుల విషయంలో కూడా కొన్ని నిబంధనలను కచ్చితంగా పాటించాల్సి ఉంటుంది. మన జాతీయ జెండాలోని మూడు రంగుల్లో పైన ఉన్న కాషాయం శక్తికి, సామర్ధ్యానికి, ధైర్యానికి ప్రతీక అయితే, మధ్యలో ఉన్న శ్వేత వర్ణం శాంతి, సమృద్ధికి ప్రతీక. కింది భాగంలో ఉండే ఆకుపచ్చ రంగు త్యాగం, శాంతి, సౌభ్రాతృత్వాలకు తార్కాణం. మధ్యలో ఉన్న అశోక చక్రం ధర్మానికి నిదర్శనంగా నిలుస్తుంది.
పాటించాల్సిన జాగ్రత్తలు..
- జాతీయ జెండాకు ఇవ్వాల్సిన గౌరవానికి సంబంధించి ఫ్లాగ్ కోడ్ ఆఫ్ ఇండియా (Flag Code of India) ఉంటుంది.
- జాతీయ జెండాకు పూర్తి గౌరవం ఇవ్వాలి. అగౌరవ పర్చకూడదు.
- జాతీయ జెండాను నేలకు తాకించకూడదు. నీటిలో వేయకూడదు. చిరిగిన, పాడైపోయిన జెండాను వాడకూడదు.
- గౌరవ ప్రదమైన తీరులో ఎవరైనా జాతీయ జెండాను ఎగురవేయవచ్చు.
- జాతీయ జెండాను గౌరవించేలా అన్ని విద్యాసంస్థలు, స్పోర్ట్స్ క్యాంప్స్, స్కౌట్ క్యాంప్స్ లో సముచిత రీతిలో ఎగురవేయాలి.
- జెండాను అవనతం చేసిన తరువాత జాగ్రత్తగా ముక్కోణాకారంలో మడతపెట్టి, సరైన ప్రదేశంలో దాచిపెట్టాలి.
- జెండాను ఎగురవేస్తున్నప్పుడు, అవనతం చేస్తున్నప్పుడు కచ్చితంగా సెల్యూట్ చేయాలి.
- జెండాను వేగంగా ఎగురవేయాలి. నెమ్మదిగా అవనతం చేయాలి.
- జెండాను ఎగురవేసే ప్రదేశం శుభ్రంగా, ఆ ప్రాంతంలో ప్రముఖమైనదిగా ఉండాలి.
- జెండాను ఎగురవేసేవారు శుభ్రమైన, మర్యాదకరమైన దుస్తులు ధరించాలి. ఫార్మల్ దుస్తులు ధరించడం మంచిది.
ఈ తప్పులు చేయవద్దు..
- జాతీయ జెండాను మతపరమైన ప్రయోజనాల కోసం వినియోగించకూడదు. డెకొరేషన్ కోసం జాతీయ జెండాను ఉపయోగించకూడదు. టేబుల్ క్లాత్ గా, హ్యాండ్ కర్చిఫ్ గా, డిస్పోజబుల్ ఐటమ్ గా జాతీయ జెండాను వాడకూడదు.
- సాధ్యమైనంత వరకు సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు ఎగురవేయాలి.
- జాతీయ జెండాను అవమానించడం కానీ, అగౌరవపర్చడం కానీ చేయకూడదు.
- జాతీయ జెండాను నేలపై వేయకూడదు. కాలి కింద వేయకూడదు. వేరే ఏ అవమానకర విధానాల్లో వాడకూడదు.
- జాతీయ జెండా కన్నా ఎత్తులో వేరే ఏ జెండా ఉండకూడదు.
- జెండాపై పూలు, బొకేలు, ఇతర వస్తువుల వంటివి పెట్టకూడదు. జెండాపై ఏమీ రాయకూడదు.
- పాడైపోయిన, చిరిగిపోయిన జెండాను ఎగురవేయకూడదు.