Pakistan economic crisis : లీటరు పాల ధర రూ. 210- కేజీ చికెన్ రూ. 780- పాకిస్థాన్ దుస్థితి ఇది!
14 February 2023, 8:40 IST
- Pakistan economic crisis : ఆర్థిక సంక్షోభంతో పాకిస్థాన్ ప్రజలు అల్లాడిపోతున్నారు. నిత్యావసర వస్తువుల ధరలు భగభగమంటున్నాయి. లీటరు పాల ధర రూ. 210కి చేరింది!
పాకిస్థాన్‌లో తీవ్రస్థాయిలో ఆర్థిక సంక్షోభం
Pakistan economic crisis : ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కడానికి పాకిస్థాన్ చేస్తున్న విశ్వప్రయత్నాలు విఫలమవుతున్న తరుణంలో.. ధరల భారంతో అక్కడి ప్రజలు అల్లాడిపోతున్నారు. అక్కడి పరిస్థితులు.. శ్రీలంక ఆర్థిక సంక్షోభం పరిణామాలను తలపిస్తున్నాయి. పాకిస్థాన్‌లో తాజాగా.. లీటరు పాల ధర రూ. 190 నుంచి రూ. 210కి చేరింది. ఇక బ్రాయిలర్ చికెన్ కేజీకి రూ. 30-40 పెరిగి రూ. 480-500 పలుకుతోంది. ధరలను చూసి ప్రజలు ఆయోమయ స్థితిలో పడ్డారు.
ప్రజలపై భారం..
సాధారణంగా కేజీ చికెన్ ధర కొన్ని రోజుల క్రితం వరకు రూ. 620- రూ. 650గా ఉండేది. కానీ ఇప్పుడు అది రూ. 700- రూ. 800కి చేరింది. బోన్‌లెస్ మీట్ ధర కేజీకి రూ. 1000 దాటిపోయింది. ఈ వివరాలను పాకిస్థాన్‌లోని ప్రముఖ వార్తాసంస్థ డాన్ ఓ నివేదికలో పేర్కొంది.
Pakistan crisis latest news : పాకిస్థాన్‌లో ద్రవ్యోల్బణం రికార్డు స్థాయిని తాకడం ఇందుకు కారణం. ముడిసరకు ధరలు భారీగా పెరిగిపోవడంతో.. ఆ భారాన్ని సంస్థలు ప్రజలపై వేయక తప్పడం లేదు. నిరుద్యోగంతో అలమటిస్తున్న ప్రజలు.. ధరల భారాన్ని మోయలేకపోతున్నారు.
"1000కిపైగా దుకాణదారులు.. ద్రవ్యోల్బణం రేటును లెక్కలోకి తీసుకుని పాల ధరలను పెంచేశాయి. ఈ దుకాణాలు హోల్‌సేల్స్, డైరీ ఫార్మర్లకు చెందినవి. మావి కాదు," అని కరాచీ మిల్క్ రీటైలర్స్ అసోసియేషన్ మీడియా కోఆర్డినేటర్ వహీద్ గద్ది తెలిపారు.
ఇంధన ధరలకు రెక్కలు..
Pakistan inflation rate : ద్రవ్యోల్బణం, ఆర్థిక సంక్షోభం కారణంగా పాకిస్థాన్‌లోని ఇంధన ధరలకు రెక్కలు వచ్చాయి. ప్రస్తుతం అవి రికార్డు స్థాయికి చేరాయి. అక్కడ.. లీటరు డీజిల్ ధర రూ. 262గా ఉందంటే.. పరిస్థితులు ఎంత దారుణంగా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. లీటరు పెట్రోల్ ధర రూ. 249.8గా ఉంది. కిరోసిన్ ధర లీటరుకు రూ. 189.83కి చేరింది. ధరలు భగభగమంటుండంతో.. ఇంధనానికి డిమాండ్ పడిపోతోంది. "గతంలో రోజుకు 15వేల లీటర్లు విక్రయించేవాళ్లము. కానీ ఇప్పుడు 13వేల లీటర్లను విక్రయిస్తాము. ముందు ముందు డిమాండ్ ఇంకా పడిపోతుందేమో!" అని కరాచీలోని ఓ పెట్రోల్ స్టేషన్ ఓనర్ ఆందోళన వ్యక్తం చేశాడు.
ఆర్థిక సంక్షోభంతో ఇతర వ్యాపారాలు కూడా డీలా పడ్డాయి. కరాచీలోని రెస్టారెంట్లు.. తమ వ్యాపారం 50శాతం మేర పడిపోయిందని చెబుతున్నాయి. నిత్యావసర వస్తువుల ధరలు అమాంత పెరిగిపోతుండటంతో.. ప్రజలు డబ్బును ఖర్చు చేసేందుకు ఒకటికి రెండు సార్లు ఆలోచిస్తున్నారు.
Pakistan petrol and diesel price today : ఒక్క పాకీస్థానీ రూపీ.. ఇండియా కరెన్సీతో పోల్చుకుంటే రూ. 3.26తో సమానం. అక్కడి రూపాయి రోజురోజుకు బలహీన పడుతుండటంతో దిగుమతులు తగ్గిపోతున్నాయి. ఫలితంగా దేశీయంగా ధరలు ఇంకా పెరిగిపోతున్నాయి. ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశాల్లో 5వ స్థానంలో ఉన్న పాక్.. ఇప్పుడు అప్పులు కట్టలేక చతికిలపడింది. అనేక బ్యాంకులు దివాళాకు అతి దగ్గర్లో ఉన్నాయి.
ఈ పరిస్థితుల నుంచి దేశాన్ని గట్టెక్కించేందుకు అక్కడి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు.. ఫలించడం లేదు. అంతర్జాతీయ ద్రవ్య నిధితో ఒప్పందం ఇంకా కుదరకపోవడంతో అధికారుల్లోనూ ఆందోళన పెరిగిపోతోందని తెలుస్తోంది.