Pakistan Mosque Blast: మసీదుపై బాంబు దాడి ఘటనలో 90 దాటిన మృతుల సంఖ్య.. ఉగ్రవాది తల లభ్యం!
31 January 2023, 15:43 IST
- Pakistan Peshawar Mosque Blast: పెషావర్ మసీదుపై ఆత్మాహుతి దాడి ఘటనలో మృతుల సంఖ్య 90 దాటింది. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు బయటికి వచ్చాయి.
Pakistan Mosque Blast: మసీదుపై బాంబు దాడి ఘటనలో 90 దాటిన మృతుల సంఖ్య
Pakistan Mosque Blast: పాకిస్థాన్‍లోని పెషావర్(Peshawar) లో ఎటుచూసినా విషాదమే కనిపిస్తోంది. పెషావర్‌లోని ఓ మసీదులో సోమవారం జరిగిన ఆత్మాహుతి దాడి (Peshawar Mosque Suicide bomb Blast) ఘటనలో మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ఇప్పటి మృతుల సంఖ్య 93కు చేరింది. 221 మంది గాయపడ్డారు. మృతుల్లో ఎక్కువ మంది పోలీసులే ఉన్నారని సమాచారం. పెషావర్ హైసెక్యూరిటీ జోన్ పరిధిలో ఉన్న ఓ మసీదులో వందలాది మంది మధ్యాహ్నం ప్రార్థనలు చేస్తుండగా.. ఈ ఆత్మాహుతి బాంబు దాడి జరిగింది. వివరాలివే..
పోలీసులే లక్ష్యంగా..
Pakistan Mosque Blast: పోలీసులు, భద్రతా దళాలను లక్ష్యంగా చేసుకొనే ఓ ఉగ్రవాది ఈ ఆత్మాహుతి దాడికి పాల్పడ్డాడు. పోలీసు, ఆర్మీ సిబ్బందితో పాటు సాధారణ ప్రజలు వందలాది మంది ప్రార్థనలు చేస్తుండగా.. ఈ దాడికి తెగబడ్డాడు. ప్రార్థన చేస్తున్న వారి ముందు వరుసలోకి బాంబులతో వచ్చి తనను తాను పేల్చుకున్నాడు. ఈ విషయాలను పెషావర్ అధికారులు వెల్లడించారు. పోలీసు అధికారులు, ఆర్మీ సిబ్బంది నివాసాలకు ఈ మసీదు సమీపంలోనే ఉంది.
దురాగతుడి తల లభ్యం!
Pakistan Mosque Blast: పెషావర్ మసీదులో జరిగింది ఆత్మాహుతి దాడేనని క్యాపిటల్ సిటీ పోలీస్ ఆఫీసర్ (CCPO) మహమ్మద్ ఐజాజ్ ఖాన్.. పాకిస్థాన్ ఛానెల్ జియో టీవీ (Geo TV) కి తెలిపారు. దాడికి పాల్పడిన దుండగుడి తెగిన తల కనుగొన్నామని వెల్లడించారు. “పోలీస్ లైన్స్‌లోకి దాడికి పాల్పడిన వ్యక్తి ముందుగానే వచ్చి ఉంటాడు. మసీదులో ప్రవేశించేందుకు అతడు అధికారిక వాహనాన్నే వినియోగించి ఉండొచ్చు” అని జియో టీవీతో ఆయన అన్నారు.
Pakistan Mosque Blast: బాంబు దాడితో మసీదులోని చాలా భాగం కుప్పకూలిపోయింది. ఇంకా సహాయక చర్యలు సాగుతున్నాయి. శిథిలాల తొలగింపు ఇంకా సాగుతోంది. దీంతో మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని అక్కడి సీనియర్ అధికారి ఒకరు వెల్లడించారు.
ఈ దాడికి తామే పాల్పడ్డామని తెహ్రెక్-ఈ-తాలిబన్ (TTP)కి చెందిన కమాండర్ ఉమర్ ఖాలిద్ వెల్లడించారు. అయితే తమకు సంబంధం లేదని ఆ ఉగ్రవాద సంస్థకు చెందిన మరో వర్గం ప్రకటన విడుదల చేసింది.
Pakistan Bomb Blast: 2014లో పాకిస్థాన్ తాలిబన్ ఉగ్రవాద సంస్థే పెషావర్‌లోని ఆర్మీ పబ్లిక్ స్కూల్‍పై దాడులకు పాల్పడింది. ఈ దాడిలో మొత్తంగా 150 మంది చనిపోయారు. ఇందులో అమాయకులైన 131 మంది విద్యార్థులు ప్రాణాలను కోల్పోయారు. ఈ దాడి పట్ల ప్రపంచమంతా దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది.