శ్రీలంకలో ఆర్థిక సంక్షోభం.. ఏపీ తీర ప్రాంతాల్లో హెచ్చరికలు.. ఎందుకంటే..?-alert to ap coast areas to to prevent entry of srilankans over economic crisis ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  శ్రీలంకలో ఆర్థిక సంక్షోభం.. ఏపీ తీర ప్రాంతాల్లో హెచ్చరికలు.. ఎందుకంటే..?

శ్రీలంకలో ఆర్థిక సంక్షోభం.. ఏపీ తీర ప్రాంతాల్లో హెచ్చరికలు.. ఎందుకంటే..?

HT Telugu Desk HT Telugu
Apr 10, 2022 07:33 AM IST

శ్రీలంకలో ఆర్థిక సంక్షోభం నేపథ్యంలో ఏపీలోని తీర ప్రాంతాల్లో హెచ్చరికలు జారీ అయ్యాయి. అక్కడి ప్రజలు సముద్ర మార్గంలో భారతదేశంలోకి ప్రవేశిస్తున్నారన్న కేంద్ర హోంశాఖ హెచ్చరికల నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు.

తీర ప్రాంత ప్రజలకు అలర్ట్
తీర ప్రాంత ప్రజలకు అలర్ట్

srilanka economic crisis: శ్రీలంకలో నెలకొన్న పరిణామాలతో అక్కడి ప్రజలు సముద్ర మార్గంలో భారతదేశంలోకి ప్రవేశిస్తున్నారని., తీర ప్రాంత గ్రామాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కేంద్ర హోంశాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఈ మేరకు ఏపీ పోలీసు శాఖకు కేంద్ర నిఘా వర్గాలు అప్రమత్తం చేశాయి. శ్రీలంకలో ఆర్థిక సంక్షోభంతో నిత్యావసరాలు కూడా కొనలేని స్థితిలో ఉన్న ప్రజలు బోట్ల ద్వారా భారత్‌లోకి ప్రవేశించేందకు ప్రయత్నిస్తున్నారని, ఎలాంటి అనుమతులు లేకుండా వచ్చిన లంక పౌరులను ఇప్పటికే తమిళనాడు పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు గుర్తించారు. 

తమిళనాడు తీర ప్రాంతంలో భద్రత కట్టుదిట్టం చేయడంతో బోట్లలో అక్రమంగా ప్రయాణించేవారు రాష్ట్రం వైపు వచ్చే అవకాశాలున్నాయని కేంద్ర నిఘావర్గాలు అనుమానిస్తున్నాయి. మత్స్యకారుల బోట్లలో ఎక్కి సుదీర్ఘ తీరప్రాంతం ఉన్న ఏపీ వైపు రాత్రివేళల్లో వచ్చే అవకాశం ఉందని గుర్తించారు. దీంతో ఏపీ మెరైన్‌ పోలీసులతో పాటు తీరప్రాంత జిల్లాల ఎస్పీలకు డీజీపీ కార్యాలయం కీలక ఆదేశాలు జారీ చేసింది. తడ నుంచి ఇచ్ఛాపురం వరకూ 974కి.మీ. సముద్ర తీరం వెంబడి అనుమానాస్పద కదలికలపై నిఘా ఉంచాలని సూచించింది. ఈ తీరంలో చిన్న గ్రామాలతో కలిపి తీరంలో 555 వరకు మత్స్యకార అవాసాలుఉన్నాయి. ఆయా ప్రాంతాల్లో నివసించే పేదలు ఎక్కువగా సముద్రంపై వేట సాగించి జీవించే పల్లెకారులు కావడంతో వారిని సైతం పోలీసులు హెచ్చరిస్తున్నారు. అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచిస్తున్నారు.

సముద్రంలోకి వెళ్లేవారికి కొత్త బోట్లు కనిపించినా తక్షణమే చెప్పాలని పోలీసు శాఖ సెల్‌ నంబర్లు ప్రచారం చేస్తున్నారు. ఈ పరిస్థితుల్ని అనుకూలంగా మార్చుకుని పాకిస్థాన్‌, బంగ్లాదేశ్‌ నుంచీ ఉగ్రవాదులు దేశంలోకి చొరబడే అవకాశం ఉందని ఐబీ అనుమానిస్తోంది. విశాఖ కోస్ట్‌ గార్డ్స్‌ను స్పీడ్‌బోట్లలో తరచూ సముద్ర జలాల్లోకి పంపుతోంది. ఏపీ మెరైన్‌ పోలీసులు, తీరప్రాంత జిల్లాల సివిల్‌ పోలీసులు సమన్వయం తోగ్రామాల్లో ప్రచారం నిర్వహిస్తున్నారు. పొరపాట్లకు అవకాశం ఇవ్వకుండా అప్రమత్తంగా ఉండాలంటూ డీజీపీ కార్యాలయం ఆదేశించింది. తీరప్రాంతాల్లో భద్రతపై ప్రత్యేకంగా జాతీయ భద్రతా వ్యవహారాల్లో అనుభవమున్న అధికారులకు బాధ్యతలు అప్పగించారు.

IPL_Entry_Point

టాపిక్