Pakistan Crisis: పాకిస్థాన్‍లో పెట్రోల్, డీజిల్ దొరకడం కూడా కష్టం కానుందా! “పతనం అంచున” అంటూ..-pakistan oil industry in brink of collapse amid imf conditions implementation ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Pakistan Crisis: పాకిస్థాన్‍లో పెట్రోల్, డీజిల్ దొరకడం కూడా కష్టం కానుందా! “పతనం అంచున” అంటూ..

Pakistan Crisis: పాకిస్థాన్‍లో పెట్రోల్, డీజిల్ దొరకడం కూడా కష్టం కానుందా! “పతనం అంచున” అంటూ..

Chatakonda Krishna Prakash HT Telugu
Feb 05, 2023 11:28 AM IST

Pakistan Crisis: పతనం అంచున ఉన్నామంటూ పాకిస్థాన్‍ ఆయిల్ కంపెనీలు ఆ దేశ ప్రభుత్వానికి లేఖరాశాయి. దీంతో పాక్‍లో చమురు కష్టాలు మరింత తీవ్రం అయ్యాయని తెలుస్తోంది.

Pakistan Crisis: పాకిస్థాన్‍లో పెట్రోల్, డీజిల్ దొరకడం కూడా కష్టం కానుందా!
Pakistan Crisis: పాకిస్థాన్‍లో పెట్రోల్, డీజిల్ దొరకడం కూడా కష్టం కానుందా! (REUTERS)

Pakistan Crisis: పాకిస్థాన్ కష్టాలు నానాటికీ పెరిగిపోతూనే ఉన్నాయి. ఆ దేశ ఆర్థిక వ్యవస్థ (Pakistan Economy) క్షీణించిపోయింది. విదేశీ మారక ద్రవ్య నిల్వలు అత్యల్పానికి చేరుకున్నాయి. కావాల్సినంత విద్యుత్‍ను ఉత్పత్తి చేసేందుకు వనరులు కూడా లేని పరిస్థితి నెలకొంది. ఈ తరుణంలో ఆ దేశ చమురు కంపెనీలు (Pakistan Oil Companies) కూడా చేతులెత్తేసే పరిస్థితి వచ్చింది. ఆయిల్ ఇండస్ట్రీ పతనం అంచున ఉంది. ఈ విషయాన్ని పాకిస్థాన్ ఆయిల్ కంపెనీలే వెల్లడించాయి. ఈ మేరకు ఆ దేశ ప్రభుత్వానికి లేఖ రాశాయి. పూర్తి వివరాలివే..

పాకిస్థాన్ రూపాయి భారీ పతనం

Pakistan Crisis - IMF bailout: రుణం కోసం.. అంతర్జాతీయ మానిటరీ ఫండ్ (IMF)తో సమావేశాలను కొనసాగించేందుకు పాకిస్థాన్ ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగా డాలర్‌పై పరిమితి (Dollar Cap)ని ఆ దేశం తొలగించింది. దీంతో పాకిస్థాన్ రూపాయి (PKR) మారకం విలువ ఒక్కసారిగా పడిపోయింది. డాలర్‌తో పోలిస్తే పాకిస్థాన్ రూపాయి ప్రస్తుతం రూ.277.81 వద్ద ఉంది. ఈ విషయాన్ని పాక్ చానెల్ జియో న్యూస్ (Geo News) రిపోర్ట్ చేసింది.

దిగుమతులు కష్టమే!

Pakistan Crisis: సమావేశాలను కొనసాగించేందుకు, కరెన్సీ మారకం విలువ, ఆయిల్‍పై సబ్సిడీ ఎత్తివేయడం లాంటి నిబంధనలను పాకిస్థాన్‍కు ఐఎంఎఫ్ విధించింది. ఈ రెండింటిని పాకిస్థాన్ అమలు చేస్తుండడంతో చమురు కంపెనీలు కష్టాల్లో కూరుకున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ నుంచి క్రూడ్ ఆయిల్‍ను కూడా దిగుమతి చేసుకోవడం ఆ సంస్థలకు కష్టంగా మారింది. నగదు నిల్వలు కూడా తగ్గిపోయాయి. ఈ తరుణంలో చమురు సంస్థలు.. పాకిస్థాన్ ప్రభుత్వానికి లేఖ రాశాయి.

రూ.వందల కోట్ల నష్టం

Pakistan Crisis: డాలర్ పోలిస్తే పాక్ రూపాయి మారకం విలువ తీవ్రంగా పడిపోవడంతో తమకు రూ.వందల కోట్ల నష్టం వస్తోందని పాకిస్థాన్ ఆయిల్, గ్యాస్ నియంత్రణ, ఎనర్జీ మంత్రిత్వ శాఖకు ఆ దేశ కంపెనీలు లేఖరాశాయి. ఇప్పటికే చమురు సంబంధించి ప్రొడక్టులను అన్నీ అమ్ముడయ్యాయని, దీంతో నష్టం తీవ్రమవుతుందని పేర్కొన్నాయి. దేశంలో ఆయిల్ ఇండస్ట్రీ పతనం అంచున ఉందని తెలిపాయి. వెంటనే చర్యలు తీసుకోకపోతే తీవ్ర సంక్షోభం వస్తుందని అభిప్రాయపడ్డాయి.

Pakistan Crisis: ఒకవేళ ముడి చమురు దిగుమతిని పాకిస్థాన్ ఆయిల్ కంపెనీలు ఆపేస్తే.. ఇక ఆ దేశంలో పెట్రోల్, డీజిల్ దొరకడం కూడా కష్టమవుతుంది. ఇప్పటికే ఆ దేశంలో చమురు సంక్షోభం మొదలైన సంకేతాలు కనిపిస్తున్నాయి.

క్షీణించిన విదేశీ మారక నిల్వలు

Pakistan Crisis: జనవరి 27వ తేదీ నాటికి పాకిస్థాన్ వద్ద 3,086.2 మిలియన్ అమెరికన్ డాలర్ల నిల్వలు మాత్రమే ఉన్నాయి. ఇవి కేవలం 18 రోజులకు మాత్రమే సరిపోతాయని తెలుస్తోంది. విదేశీ మారక ద్రవ్యం నిల్వల కొరత, రూపాయి విలువలో భారీ పతనంతో ఇక పాకిస్థాన్‍లోని ఆయిల్ సంస్థలు.. ముడి చమురును అంతర్జాతీయ మార్కెట్ నుంచి దిగుమతి చేసుకోవడం కూడా కష్టంగా మారే అవకాశం ఉంది. దీంతో ఆ దేశంలో పెట్రోల్, డీజిల్‍కు కూడా రానున్న కాలంలో కష్టంగా మారుతుందనే అంచనాలు ఉన్నాయి.

మరోవైపు పాకిస్థాన్‍లో విద్యుత్ కష్టాలు కూడా పెరిగిపోతున్నాయి. రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్ధంతో నేచులర్ గ్యాస్ దిగుమతి ఖర్చు అమాంతం పెరగటం కూడా ఇందుకు ఓ కారణంగా ఉంది.

పెట్రోల్, డీజిల్‍పై ఇటీవల రూ.35 ధరను పెంచింది పాకిస్థాన్ ప్రభుత్వం. దీంతో ఆ దేశంలో లీటర్ పెట్రోల్ ధర రూ.249.80కు, లీటర్ డీజిల్ ధర రూ.262.60 ధరకు చేరింది.

Whats_app_banner