Pakistan crisis : పెట్రోల్ ధర ఒకేసారి రూ. 35 పెంపు.. ప్రజలకు షాకిచ్చిన ప్రభుత్వం!
Pakistan economic crisis : పాకిస్థాన్ ప్రజలకు అక్కడి ప్రభుత్వం మరో షాక్ ఇచ్చింది. పెట్రోల్, డీజిల్ ధరలను ఒకేసారి భారీగా పెంచింది.
Pakistan petrol price today : ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న పాకిస్థాన్‌లో పరిస్థితులు రోజురోజుకు దిగజారిపోతున్నాయి! ఓవైపు రూపాయి విలువ కనిష్ఠ స్తాయికి పడిపోతుంటే.. మరోవైపు ప్రజలపై ప్రభుత్వం 'ధరల' భారం మోపుతోంది. తాజాగా.. పాకిస్థాన్‌లో పెట్రోల్, డీజిల్ ధరలను భారీగా పెంచింది ప్రభుత్వం.
'ఏం పర్లేదు.. తక్కువే పెంచాము..'
పెట్రోల్, డీజిల్‌పై లీటరుకు రూ. 35ను పెంచింది పాకిస్థాన్ ప్రభుత్వం. కిరోసిన్ ఆయిల్, లైట్ డీజిల్ ఆయిల్‌పై లీటరుకు రూ. 18 పెంచింది. ఈ విషయాన్ని పాకిస్థాన్ ఆర్థికశాఖ మంత్రి ఇషక్ దాస్ ఆదివారం ప్రకటించారు. పెంచిన ధరలు ఆదివారమే అమల్లోకి వచ్చాయి.
Pakistan economic crisis : "పెట్రోల్ ఉత్పత్తుల ధరలను ప్రభుత్వం పెంచింది. ఇవి 2023 జనవరి 29 ఉదయం 11 గంటలకే అమల్లోకి వచ్చాయి. హై స్పీడ్ డీజిల్ ధర.. లీటరుకు రూ. 262.80కి చేరింది. లీటరు ఎంఎస్ పెట్రోల్ ధర రూ. 249.80ని తాకింది. కిరోసిన్ ఆయిల్ ధర లీటరుకు 189.83కి పెరిగింది. లీటరు లైట్ డీజిల్ ఆయిల్ ధర రూ. 187కి చేరింది," అని పాకిస్థాన్ ఆర్థికమంత్రి ట్వీట్ చేశారు.
పెట్రోలియం ధరలను చాలా తక్కువగానే పెంచినట్టు వ్యాఖ్యానించారు ఇషక్ దాస్. "అంతర్జాతీయంగా ధరలు పెరుగుతున్నాయి. పాకిస్థాన్ రూపీ పడిపోతోంది. అయినప్పటికీ.. ప్రధాని షెహ్బాజ్ షరీఫ్ ఆదేశాలతో పెట్రోలియం ధరలను చాలా తక్కువగానే పెంచాము," అని అన్నారు. గత నాలుగు నెలల్లో పెట్రోల్, డీజిల్ ధరలను పెంచలేదని గుర్తుచేశారు. ఆయా ధరలు తగ్గాయని వివరించారు.
Pakistan petrol and diesel price today : గత గురువారం నుంచి పాకిస్థానీ రూపీ అత్యంత దారుణ ప్రదర్శన చేస్తోంది. డాలరుతో పోల్చితే 34 రూపాయలు పతనమైంది. 1999లో ఎక్స్ఛేంజ్ రేట్ సిస్టెమ్‌ను ప్రవేశపెట్టినప్పటి నుంచి ఈ స్థాయిలో రూపాయి పడిపోవడం ఇదే తొలిసారి.
పాకిస్థాన్‌ను ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కించేందుకు తమ సాయశక్తులా ప్రయత్నిస్తామని ప్రధాని షెహ్బాజ్ షరీఫ్ తెలిపారు. రాజకీయంగా సమస్యలు ఎదురైనప్పటికీ.. ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని పలు కీలక నిర్ణయాలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
Pakistan latest news : ఆర్థిక సంక్షోభం నేపథ్యంలో.. ఐఎంఎఫ్ (అంతర్జాతీయ ద్రవ్య నిధి) నిధులపై భారీ ఆశలు పెట్టుకుంది పాకిస్థాన్. ఈ క్రమంలోనే ఐఎంఎఫ్ ఆశిస్తున్నట్టుగా.. పెట్రోల్, డీజిల్ ధరలను పెంచుతోంది. మరోవైపు పన్నులను కూడా భారిగా పెంచుతోంది. ఈ నేపథ్యంలో.. ఆ దేశంలో ద్రవ్యోల్బణం మరింత పెరిగే అవకాశం లేకపోలేదు.
సంబంధిత కథనం