Weather Update : దక్షిణ భారతదేశంలో వానలు.. కేరళ కర్ణాటకలో భారీ వర్షాలు పడే అవకాశం
10 October 2024, 7:23 IST
- IMD Weather Update : ఈ వారం దక్షిణ, ఈశాన్య భారతదేశంలో అక్కడక్కడ తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. తమిళనాడు, కేరళ, కర్ణాటకలలో మాత్రం భారీ వర్షాలు కురిసే అవకాసం ఉందని ఐఎండీ తెలిపింది.
ఐఎండీ వెదర్ అలర్ట్
భారత వాతావరణ శాఖ (IMD) దేశంలోని దక్షిణ, ఈశాన్య ప్రాంతాలలో చెదురుమదురు వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. అయితే రాబోయే వారంలో మధ్య, వాయువ్య, తూర్పు ప్రాంతాలు చాలా వరకు పొడిగా ఉంటాయని పేర్కొంది. అదే సమయంలో ఈశాన్య రాష్ట్రాలు, ముఖ్యంగా అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, మేఘాలయలో తేలికపాటి వర్షాలు కురుస్తాయి.
దక్షిణ, ఈశాన్య భారతదేశంలోని కొన్ని ప్రాంతాలలో వర్షపాతం తీవ్రం అయ్యే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. అక్టోబర్ 10 నుంచి 14 మధ్య తమిళనాడు, కేరళలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. కర్ణాటక, లక్షద్వీప్ దీవులలోని కొన్ని ప్రాంతాలు కూడా అధిక వర్షపాతాన్ని చూస్తాయి.
దక్షిణ భారతదేశంలో వారం పొడవునా తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురుస్తాయని ఐఎండీ అంచనా వేసింది. ఏపీ, తెలంగాణలోనూ రాబోయే రోజుల్లో తేలికపాటి వానలు పడనున్నాయి. కేరళ, మహే, తమిళనాడు, పుదుచ్చేరి, కోస్టల్ కర్నాటక ప్రాంతాల్లో స్థిరమైన వర్షాలు కురవనున్నాయి. అక్టోబర్ 10న తమిళనాడులో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అక్టోబర్ 12 నుంచి 14 వరకు కూడా అతిగా వానలు పడే అవకాశం ఉంది. కేరళ, మహేలో కూడా అక్టోబర్ 12, 13 తేదీల్లో భారీ వర్షాలు కురుస్తాయని అంచనా. అక్టోబరు 10న లక్షద్వీప్‌లో భారీ వర్షాలు కురుస్తాయని, కోస్తా కర్ణాటకలో అక్టోబర్ 10, 13 తేదీల్లో ఇలాంటి పరిస్థితులు నెలకొంటాయని ఐఎండీ పేర్కొంది.
ఈశాన్య రాష్ట్రాల్లో రాబోయే ఐదు రోజులలో అక్కడక్కడా తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేసింది. అక్టోబర్ 10, 11 మధ్య అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, మేఘాలయలో భారీ వర్షాలు కురవనున్నాయి. నాగాలాండ్, మణిపూర్, మిజోరాం, త్రిపురలలో అక్టోబర్ 10న భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
కొంకణ్, గోవాలో వారం పొడవునా తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురుస్తాయి. అక్టోబరు 10 నుండి 12 వరకు కొంకణ్, గోవా, మధ్య మహారాష్ట్రలలో ఒంటరిగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
గుజరాత్, రాజస్థాన్‌తో సహా పశ్చిమ ప్రాంతంలోని ఇతర ప్రాంతాలు చాలా వరకు పొడిగా ఉంటాయని ఐఎండీ అంచనా. కొన్ని ప్రాంతాలలో మాత్రమే తేలికపాటి వర్షపాతం ఉంటుంది.
దేశంలోని మిగిలిన ప్రాంతాల్లో వాతావరణ మార్పులు పెద్దగా ఉండవని ఐఎండీ తెలిపింది. ఈ ప్రాంతాల్లో వర్షపాతం తక్కువగా ఉండొచ్చు. ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, బీహార్ వంటి రాష్ట్రాల్లో పొడి పరిస్థితులు ఉంటాయి. వారం మొత్తం ఇలానే ఉంటుందని వాతావరణ శాఖ పేర్కొంది.