Meta layoffs: ‘కెనడా వెళ్లిన రెండు రోజులకే జాబ్ పోయింది..’
10 November 2022, 20:53 IST
Meta layoffs: సంస్థలు తీసుకునే అనూహ్య, భారీ నిర్ణయాలతో ఉద్యోగులు ఎలాంటి దారుణమైన పరిస్థితుల్లో చిక్కుకుంటారో తెలిపే వార్త ఇది. ఫేస్ బుక్ మాతృ సంస్థ మెటా(Meta) ప్రకటించిన లే ఆఫ్ తో ఒక ఐఐటియన్ ఎదుర్కొన్న చేదు అనుభవం ఇది.
ప్రతీకాత్మక చిత్రం
Meta layoffs: ఫేస్ బుక్ మాతృ సంస్థ మెటా(Meta) ప్రకటించిన ఉద్యోగాల కోత వేల మంది ఉద్యోగులకు అశనిపాతమైంది. అకస్మాత్తుగా ఉద్యోగం కోల్పోవడంతో ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు.
Meta layoffs: మెటా(Meta) ప్రకటన
ప్రపంచవ్యాప్తంగా మొత్తం 11 వేల మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు మెటా బుధవారం ప్రకటించింది. ఇది ఆ సంస్థ మొత్తం ఉద్యోగుల్లో దాదాపు 13 శాతం. తప్పని సరి పరిస్థితుల్లో ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని, అందుకు క్షమించాలని ఫేస్ బుక్ చీఫ్ మార్క్ జుకర్ బర్గ్ ఒక ప్రకటన చేశారు. ఈ నిర్ణయానికి తనదే పూర్తి బాధ్యత అన్నారు.
Meta layoffs: రెండు రోజుల క్రితమే కెనడాకి…
ఫేస్ బుక్ లో ఉద్యోగం రావడంతో భారత్ కు చెందిన ఐఐటియన్ హిమాంశు రెండు రోజుల క్రితమే కెనడా వెళ్లాడు. అక్కడ కొత్త ఉద్యోగంలో కుదురుకునే లోపే జాబ్ నుంచి తొలగిస్తున్నట్లు మెయిల్ వచ్చింది. దాంతో షాక్ కు గురైన హిమాంశు తన బాధను లింక్డ్ ఇన్ లో షేర్ చేసుకున్నారు. ‘మెటాలో జాయిన్ కావడం కోసం 2 రోజుల క్రితమే కెనడా వచ్చాను. సామూహిక ఉద్యోగాల తొలగింపుతో మెటాతో నా జర్నీ రెండు రోజులకే ముగిసింది. ఇప్పుడేం చేయాలో అర్థం కావడం లేదు. కెనడాలో కానీ, ఇండియాలో కానీ సాఫ్ట్ వేర్ ఇంజినీర్ ఆఫర్స్ ఎక్కడైనా ఉంటే చెప్పండి’ అని హిమాంశు ఆ పోస్ట్ లో తన ఆవేదన వ్యక్తం చేశారు.
Meta layoffs: రెండు నెలల్లోపే..
జుకర్ బర్గ్ ప్రకటించిన ఈ మాస్ లే ఆఫ్స్ భారత్ సహా ప్రపంచ దేశాల ఫేస్ బుక్, ట్విటర్ ఉద్యోగులపై ప్రభావం చూపాయి. అమెరికాలో H1B వీసాపై ఉన్న భారత్ సహా పలు ఇతర దేశాల టెక్కీలు ఇప్పుడు 60 రోజుల్లోగా వేేరే ఉద్యోగంలో చేరడమో, లేదా స్వదేశానికి వెళ్లడమో చేయాల్సి ఉంటుంది. ఉద్యోగులకు అవసరమైన ఇమిగ్రేషన్ సపోర్ట్ అందిస్తామని మెటా ప్రకటించింది.