తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Idbi Bank Q1 Results: ఐడీబీఐ బ్యాంక్ నెట్ ప్రాఫిట్‌లో 25 శాతం పెరుగుదల

IDBI Bank Q1 Results: ఐడీబీఐ బ్యాంక్ నెట్ ప్రాఫిట్‌లో 25 శాతం పెరుగుదల

HT Telugu Desk HT Telugu

22 July 2022, 9:45 IST

google News
  • IDBI Bank Q1 Results: ఐడీబీఐ బ్యాంక్ క్యూ1 నెట్ ప్రాఫిట్ 25 శాతం పెరిగింది. 

ఐడీబీఐ బ్యాంక్‌ నికర లాభంలో పెరుగుదల నమోదు
ఐడీబీఐ బ్యాంక్‌ నికర లాభంలో పెరుగుదల నమోదు (REUTERS)

ఐడీబీఐ బ్యాంక్‌ నికర లాభంలో పెరుగుదల నమోదు

IDBI Bank Q1 Results: ఐడీబీఐ బ్యాంక్ క్యూ 1 రిజల్ట్స్ గురువారం వెల్లడయ్యాయి. జూన్‌తో ముగిసిన తొలి క్వార్టర్‌లో నికర లాభంలో 25 శాతం పెరుగుదల ఉన్నట్టుగా రిజల్ట్స్ నివేదించాయి. స్టాండలోన్ ప్రాఫిట్ ఆఫ్టర్ టాక్స్ (పీఏటీ) రూ. 756 కోట్లుగా నివేదించింది. అసెట్ క్వాలిటీలో వృద్ధి, రుణాల రికవరీ మెరుగుపడడం వల్ల పీఏటీ మెరుగుపడింది.

స్టాండలోన్ ప్రాతిపదికన ఐడీబీఐ బ్యాంక్ గత ఏడాది క్యూ 1లో రూ. 603 కోట్ల నికర లాభాన్ని చూపింది.

బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్ సీఈవో రాకేష్ శర్మ మాట్లాడుతూ బ్యాంక్ పనితీరులో టర్న్‌అరౌండ్ మొదలైందని చెప్పారు.

‘సుదీర్ఘంగా నాలుగైదేళ్ల గ్యాప్ తరువాత జూన్‌తో ముగిసిన క్వార్టర్‌లో రుణాల్లో 12 శాతం వృద్ధి కనిపించింది..’ అని వివరించారు.

జూన్ 2021లో బ్యాంక్ రూ. 1,600 కోట్ల నిరర్థక ఆస్తులు (నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్-ఎన్‌పీఏ) రికవరీ చేయగలిగింది. వీటిలో కింగ్‌ఫిషర్ ఎయిర్ లైన్స్, వీడియో కాన్ కంపెనీల నుంచి రాబట్టిన రూ. 868 కోట్లు ఉన్నాయి. ఇది నాటి క్వార్టర్-1లో అత్యధిక ఆపరేటింగ్ ప్రాఫిట్‌కు కారణమైందని రాకేష్ శర్మ వివరిచారు.

ఈ ఏడాది తొలి క్వార్టర్‌లో రూ. 1,136 కోట్ల మేర ఎన్‌పీఏ రికవరీ అయ్యిందని, అయితే అది ప్రొవిజన్స్ రివర్సల్‌లోకి వెళ్లిందని వివరించారు. అందువల్ల నెట్ ఇంటరెస్ట్ ఇన్‌కమ్ (ఎన్ఐఐ), ఆపరేటింగ్ ప్రాఫిట్ వంటి నెంబర్లు స్వల్పంగా తగ్గాయని వివరించారు. అయినప్పటికీ మార్చితో ముగిసిన క్వార్టర్‌తో పోల్చి చూస్తే వృద్ధి కనిపించిందని తెలిపారు.

ఈ త్రైమాసికంలో లాభం పెరగడానికి మెరుగైన రికవరీలు, ఇతర ఆదాయం, స్థిరమైన నిర్వహణ ఖర్చులు ఎన్ఐఐ వృద్ధికి కారణమని ఐడీబీఐ బ్యాంక్ సీఎఫ్‌ఓ చెప్పారు.

నికర వడ్డీ ఆదాయం (ఎన్ఐఐ) అంతకు ముందు ఏడాది త్రైమాసికంలో రూ. 2,506 కోట్ల నుంచి స్వల్పంగా రూ.2,488 కోట్లకు పడిపోయింది.

నికర వడ్డీ మార్జిన్ (ఎన్ఐఎం) 2022 క్యూ1లో ఉన్న 4.06 శాతంతో పోలిస్తే 2023 క్యూ1లో 4.02 శాతం (ఐటీ వాపసుపై వడ్డీని మినహాయించి 3.73 శాతం) గా ఉంది.

జూన్ 30, 2021 నాటికి 22.71 శాతం ఉన్న స్థూల నిరర్థక ఆస్తులు (GNPAలు) జూన్ 30, 2022 నాటికి19.9 శాతానికి మెరుగుపడ్డాయి. నికర NPAలు 1.67 శాతంతో పోలిస్తే ఇప్పుడు 1.25 శాతంగా ఉన్నాయి.

మార్చి 2023 నాటికి జిఎన్‌పిఎలు 15 శాతం కంటే తక్కువగా ఉంటాయని, నికర ఎన్‌పిఎ 1.25 శాతం కంటే తక్కువగా ఉంటుందని ఐడీబీఐ బ్యాంక్ అంచనా వేస్తున్నట్లు శర్మ చెప్పారు.

మొత్తం కేటాయింపులు రూ. 2,265 కోట్లతో పోలిస్తే ఈ క్యూ1లో రూ. 1,295 కోట్లుగా ఉన్నాయి. ఐడీబీఐ బ్యాంక్ FY2023లో రూ. 4,000 కోట్ల రికవరీ లక్ష్యాన్ని పెట్టుకుంది.

11,000-12,000 కోట్ల మొండి బకాయిలను నేషనల్ అసెట్ రీకన్‌స్ట్రక్షన్ కంపెనీ లిమిటెడ్ (NARCL)కి బదిలీ చేయడానికి వీలుగా గుర్తించినట్టు శర్మ చెప్పారు.

అసెట్ రీకన్‌స్ట్రక్షన్ కంపెనీ (ఇండియా) లిమిటెడ్‌లోని తన మొత్తం వాటాను (19.18 శాతం) రూ. 2,361.48 కోట్లకు అవెన్యూ ఇండియా రీసర్జెన్స్ ప్రైవేట్ లిమిటెడ్‌కు విక్రయించింది. ఫలితంగా రూ. 141 కోట్ల లాభం వచ్చింది.

క్యాపిటల్ టు రిస్క్ (వెయిటెడ్) అసెట్స్ రేషియో (CRAR) జూన్ 30, 2021 నాటికి 16.23 శాతం నుండి 19.57 శాతానికి మెరుగుపడింది. బ్యాంక్ డిపాజిట్ల వృద్ధి రూ.2,22,367 కోట్ల నుంచి రూ.2,25,269 కోట్లకు పెరిగింది.

‘మా డిపాజిట్ల వ్యయాన్ని తగ్గించడానికి మేం మా బల్క్ డిపాజిట్లను నిరంతరం తగ్గిస్తూనే ఉన్నాం. కాసా ఖాతాలను 12 శాతానికి పైగా పెంచుతున్నాం. అడ్వాన్స్‌లను పెంచడం ప్రారంభించినప్పుడు, మేం కాసా డిపాజిట్లను పెంచుకోవడమే కాకుండా, అవసరాన్ని బట్టి బల్క్ డిపాజిట్లను కూడా పెంచుకోవచ్చు..’ అని శర్మ అన్నారు.

ఈ ఆర్థిక సంవత్సరంలో 10-12 శాతం డిపాజిట్ వృద్ధిని బ్యాంక్ అంచనా వేస్తున్నట్లు ఆయన తెలిపారు. బ్యాంక్ స్క్రిప్ బుధవారం బీఎస్‌ఈలో 1.66 శాతం పెరిగి రూ. 36.75 వద్ద ముగిసింది. గురువారం 0.68 శాతం లాభపడి రూ. 37.05 వద్ద ట్రేడవుతోంది.

తదుపరి వ్యాసం