తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Pvr Q1 Results: పీవీఆర్ క్యూ1 నికర లాభం రూ.53 కోట్లు

PVR Q1 Results: పీవీఆర్ క్యూ1 నికర లాభం రూ.53 కోట్లు

HT Telugu Desk HT Telugu

21 July 2022, 17:11 IST

google News
  • PVR Q1 Results: జూన్‌తో ముగిసిన మొదటి త్రైమాసికంలో పీవీఆర్ లిమిటెడ్ రూ. 53 కోట్ల నికర లాభం సాధించింది.

ఇటీవల న్యూఢిల్లీలోని పీవీఆర్ ప్రియా థియేటర్‌లో ప్రమోషన్లలో పాల్గొన్న కంగనా రనౌత్, అర్జున్ రాంపాల్
ఇటీవల న్యూఢిల్లీలోని పీవీఆర్ ప్రియా థియేటర్‌లో ప్రమోషన్లలో పాల్గొన్న కంగనా రనౌత్, అర్జున్ రాంపాల్ (PTI)

ఇటీవల న్యూఢిల్లీలోని పీవీఆర్ ప్రియా థియేటర్‌లో ప్రమోషన్లలో పాల్గొన్న కంగనా రనౌత్, అర్జున్ రాంపాల్

న్యూ ఢిల్లీ, జూలై 21: అతి పెద్ద మల్టీప్లెక్స్ నెట్‌వర్క్ కలిగిన పీవీఆర్ లిమిటెడ్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో రూ. 53.38 కోట్ల నికర లాభం ఆర్జించింది.

గత ఏడాది మొదటి త్రైమాసికంలో పీవీఆర్ లిమిడెట్ రూ. 219.44 కోట్ల మేర నష్టాలను చూపింది. ఆ త్రైమాసికంలో కరోనా వైరస్ సెకెండ్ వేవ్ నేపథ్యంలో ఆంక్షల ఫలితంగా థియేటర్లు మూతపడడంతో ఆదాయం కేవలం రూ. 59.39 కోట్లు మాత్రమే ఉంది. ప్రస్తుతం జూన్‌తో ముగిసిన త్రైమాసికంలో రూ. 981.40 కోట్ల ఆదాయం వచ్చింది.

కాగా మార్చితో ముగిసిన త్రైమాసికంతో పోలిస్తే ఆదాయం 82.70 శాతం పెరిగింది. 2021-22 చివరి త్రైమాసికంలో కూడా కొన్ని థియేటర్లపై ఆంక్షలు ఉండడంతో అప్పుడు కూడా పీవీఆర్ ఆదాయం దెబ్బతింది.

ప్రస్తుతం జూన్‌తో ముగిసిన త్రైమాసికంలో వ్యయం రూ. 917.19 కోట్ల మేర ఉంది. అంతకుముందు ఏడాది ఇదే త్రైమాసికంలో వ్యయాలు రూ. 417.06 కోట్లుగా ఉంది.

ఈ జూన్‌తో ముగిసిన క్వార్టర్‌లో మూవీ ఎగ్జిబిషన్ ద్వారా రూ. 984.04 కోట్లు రాగా, మూవీ ప్రొడక్షన్, డిస్ట్రిబ్యూషన్, గేమింగ్ నుంచి రూ. 25.34 కోట్ల ఆదాయం లభించింది.

పీవీఆర్ లిమిటెడ్ ఇప్పుడు దేశవ్యాప్తంగా 75 నగరాల్లో 854 స్క్రీన్లు కలిగి ఉంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మరో 125 స్క్రీన్లు ఓపెన్ చేసే దిశగా పనిచేస్తున్నట్టు తెలిపింది.

‘ఈ ఆర్థిక సంవత్సరం మూడు లొకేషన్లలో 14 స్క్రీన్లు ప్రారంభించాం.. మరో 82 స్క్రీన్లు ఓపెన్ చేసేందుకు పనిచేస్తున్నాం.. 9 కొత్త నగరాల్లోకి ఎంటరవుతున్నాం..’ అని పీవీఆర్ తన ఇన్వెస్టర్ ప్రజెంటేషన్‌లో వెల్లడించింది. వీటిలో ఎక్కువ భాగం మూడు, నాలుగో త్రైమాసికాల్లో ఓపెనవుతాయని తెలిపింది.

కాగా గురువారం పీవీఆర్ లిమిటెడ్ షేర్ 1.41 శాతం పెరిగి రూ. 1,911.60 వద్ద ముగిసింది.

తదుపరి వ్యాసం