తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Hindi Controversy | ‘హిందీ భాష.. తమిళులను శూద్రులుగా మార్చేస్తుంది’

Hindi controversy | ‘హిందీ భాష.. తమిళులను శూద్రులుగా మార్చేస్తుంది’

Sharath Chitturi HT Telugu

06 June 2022, 18:53 IST

google News
  • Hindi controversy | తమిళనాడులో హిందీ భాషపై మరోమారు వివాదాస్పద వ్యాఖ్యలు బయటకొచ్చాయి. హిందీ మాట్లాడితే.. తమిళులు శూద్రుల స్థాయికి చేరుతారని వ్యాఖ్యానించారు డీఎంకే నేత ఇలంగోవన్​.

టీకేఎస్​ ఇలంగోవన్​
టీకేఎస్​ ఇలంగోవన్​ (Twitter)

టీకేఎస్​ ఇలంగోవన్​

Hindi controversy | దేశంలో హిందీ భాషపై వివాదం కొనసాగుతోంది. ముఖ్యంగా తమిళనాడులో 'హిందీ' వేడి తీవ్రంగా ఉంది. తాజాగా.. హిందీ భాషపై అత్యంత వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు డీఎంకే ఎంపీ టీకేఎస్​ ఇలంగోవన్. అభివృద్ధే లేని రాష్ట్రాలు మాత్రమే హిందీ మాట్లాడుకుంటాయని ఆరోపించారు. అంతేకాకుండా.. హిందీ మాట్లాడితే తమిళులు.. శూద్రుల స్థాయికి పడిపోతారని విమర్శించారు.

హిందీ భాషకు వ్యతిరేకంగా నిర్వహించిన సభలో ఇలంగోవన్​ ఈ వ్యాఖ్యలు చేశారు.

"హిందీతో మనకు ఎలాంటి లాభం లేదు. పశ్చిమ్​ బెంగాల్​, మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్​, తమిళనాడు, కేరళ వంటి అభివృద్ధి చెందిన రాష్ట్రాల్లో హిందీ అనేది మాతృభాష కాదు. ఉత్తర్​ ప్రదేశ్​, మధ్యప్రదేశ్​, బిహార్​, రాజస్థాన్​ వంటి అభివృద్ధి చెందాల్సిన రాష్ట్రాలతో పాటు కొత్తగా ఆవిర్భవించిన ప్రాంతాల్లో మాత్రమే హిందీని మాతృభాషగా పరిగణిస్తారు. అలాంటప్పుడు.. మనం ఎందుకు హిందీ నేర్చుకోవాలి? మనం ఎందుకు హిందీలో మాట్లాడాలి?," అని ప్రశ్నించారు డీఎంకే నేత.

ఈ క్రమంలోనే 'శూద్రులు' అన్న పదాన్ని వినియోగించారు ఇలంగోవన్​. శూద్రులను.. సమాజంలో తక్కువ జాతిగా భావిస్తుంటారు.

"హిందీ అనేది జాతీయ భాష అని, దానికి అంతర్జాతీయ గుర్తింపును తీసుకొస్తామని కేంద్రమంత్రి అమిత్​ షా అంటున్నారు. కానీ భిన్నత్వంలో ఏకత్వం అనేది భారత దేశానికి ఉన్న గుర్తింపు. అసలు అమిత్​ షా.. ఒక భారతీయుడేనా? నాకు అనుమానాలు ఉన్నాయి. తమిళనాడు కల్చర్​ని నాశనం చేసేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారు. హిందీ ద్వారా మనుధర్మను రుద్దాలని చూస్తున్నారు. ఇదే జరిగితే.. మనం అందరం శూద్రులులాగా.. సేవకులుగా మారిపోతాము," అని వ్యాఖ్యానించారు డీఎంకే ఎంపీ.

ఇలంగోవన్​ వ్యాఖ్యలపై బీజేపీ మండిపడింది. రాష్ట్రాలను విడగొట్టి, భాషలపై ఉన్న వివాదాన్ని తీవ్రతరం చేసేందుకు డీఎంకే ప్రయత్నిస్తోందని ఆరోపించింది.

పానీపూరి అమ్ముకోవాలా?

హిందీపై తమిళనాడు నేతలు వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం ఇది కొత్త విషయమేమీ కాదు. 'పానీపూరీలు అమ్ముకునేందుకు హిందీ నేర్చుకోవాలా?' అన్నట్టుగా తమిళనాడు విద్యాశాఖ మంత్రి కే పొన్ముడి వ్యాఖ్యలు చేశారు.

"హిందీ నేర్చుకుంటే ఉద్యోగాలు వస్తాయని ఎవరో అన్నారు. మీకు ఉద్యోగాలు వస్తున్నాయా మరి? మన కోయంబత్తూర్​లో చూడండి.. హిందీ మాట్లాడే వాళ్లు పానీపూరీలు అమ్ముకుంటున్నారు. పానీపూరీ దుకాణాల పెట్టుకుంటున్నారు. తమిళనాడులో మనకంటూ ఒక వ్యవస్థ ఉండాలి. రాష్ట్రంలో తమిళం అనేది ప్రాంతీయ భాష. అంతర్జాతీయ భాష ఇంగ్లీష్​ కూడా ఉంది. హిందీని పొరపాటున జాతీయ భాషగా అని ఉంటారు. అంతే!" అని పొన్ముడి అన్నారు.

K Ponmudi | పొన్ముడి వ్యాఖ్యలపై తీవ్ర దుమారం చెలరేగింది. ఆయనపై విమర్శలు వెల్లువెత్తాయి. ఆ తర్వాత.. తన వ్యాఖ్యలపై ఆయన వివరణ ఇచ్చారు.

"తమిళనాడు నుంచి చాలా మంది ఉద్యోగాల కోసం ఉత్తర భారతానికి వెళుతూ ఉంటారు. అలాగే ఉత్తర భారతం నుంచి కూడా ఇక్కడికి వస్తూ ఉంటారు. అక్కడ ఉద్యోగాలు లేకే ఇక్కడికి వస్తున్నారు అన్నది నా ఉద్దేశం," అని స్పష్టతనిచ్చారు పొన్ముడి.

వాస్తవానికి.. దేశంలోని ఏ భాషకి కూడా రాజ్యంగం.. 'జాతీయ భాష' అనే గుర్తింపును ఇవ్వలేదు. రాజ్యంగంలోని 8వ షెడ్యూల్​ ప్రకారం.. దేశంలో 22 'అధికార భాషలు' ఉన్నాయి. అధికారిక కార్యకలాపాల కోసం ఇంగ్లీష్​, హిందీని ఉపయోగించుకోవాలని మాత్రమే 1963 అధికారిక భాషల చట్టం చెబుతోంది.

టాపిక్

తదుపరి వ్యాసం