ఆదిలాబాద్‌లో ఉగ్రవాదుల సంచారం..! పోలీసుల ముమ్మర తనిఖీలు
06 May 2022, 11:08 IST
దేశవ్యాప్తంగా కలకలం సృష్టించిన హరియాణా ఉగ్రకుట్ర భగ్నం ఘటనపై దర్యాప్తు వేగంగా సాగుతోంది. కేసును ఛేదించేందుకు పోలీసులు కృషి చేస్తున్నారు. కాగా తెలంగాణలోని ఆదిలాబాద్‌లో కొంతమంది అనుమానిత ఉగ్రవాదులు సంచిస్తున్నట్టు సమాచారం అందడంతో రాష్ట్ర పోలీసులు అప్రమత్తమయ్యారు. తనిఖీలు చేపట్టారు.
హరియాణాలో ఉగ్ర కుట్ర భగ్నం ఘటనపై దర్యాప్తు ముమ్మరం
Terror suspects held in Karnal | హరియాణాలో 'ఉగ్ర కుట్ర భగ్నం' ఘటనలో దర్యాప్తును ముమ్మరం చేశారు పోలీసులు. తాజాగా.. కేసును ఛేదించేందుకు కర్నల్ పోలీసులకు సహకరించేందుకు అంబాలా పోలీసులు సైతం రంగంలోకి దిగారు.
"నలుగురు అనుమానితులను కర్నల్ పోలీసులు అరెస్ట్ చేసినట్టు సమాచారం అందింది. కొన్ని నెలల క్రితమే.. అంబాలాలో ఓ ఐఈడీని స్వాధీనం చేసుకున్నాము. ఈ ఘటనకు, నిందితులకు ఏదైనా సంబంధం ఉందా? అన్న కోణంలో విచారణ జరపాల్సి ఉంది. అందుకే కర్నల్ పోలీసులతో కలిసి దర్యాప్తు చేసేందుకు సిద్ధపడ్డాము," అని అంబాలా ఎస్పీ జహన్దీప్ వెల్లడించారు.
పంజాబ్ నుంచి తెలంగాణలోని ఆదిలాబాద్‌కు చేరవేసేందుకు పేలుడు పదార్ధాలతో వెళ్తున్న కారును హరియాణా పోలీసులు గురువారం అడ్డుకున్నారు. ఫలితంగా దేశంలో భారీ ఉగ్ర కుట్రను భగ్నం చేశారు. నలుగురు నిందితులు.. పంజాబ్‌కు చెందినవారేనని తెలుస్తోంది. నిందితుల పేర్లు గుర్ప్రీత్, అమన్‌దీప్, పర్మిందర్, భూపేందర్ అని సమాచారం. వీరికి పాకిస్థాన్ ఉగ్రవాదులతో సంబంధం ఉన్నట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కాగా వీరి నుంచి మూడు ఐఈడీలు, 31 బుల్లెట్లు, పిస్టోల్, ఆరు ఫోన్లు, రూ. 1.3లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు.
నాందేడ్ నుంచి మరో పోలీసు బృందం..
నలుగురు నిందితులను ప్రశ్నించేందుకు మహారాష్ట్రలోని నాందేడ్ పోలీసుల బృందం.. హరియాణాకు వెళ్లింది. హరియాణా నుంచి నిందితులు నాందేడ్‌కు సమీప ప్రాంతానికి వెళ్లాలని భావించినట్టు ఓ పోలీసు అధికారి చెప్పడం ఇందుకు కారణం.
"కర్నల్‌కు మా పోలీసు బృందాన్ని పంపించాము. నలుగురు నిందితులను ఆ బృందం విచారిస్తుంది. ఆ తర్వాత తగిన చర్యలు తీసుకుంటాము," అని నాందేడ్ ఎస్పీ ప్రమోద్‌కుమార్ స్పష్టం చేశారు.
తెలంగాణలో తనిఖీలు..
ఆదిలాబాద్‌కు మందుగుండు సామాగ్రి, ఆయుధాలను తరలించేందుకు నిందితులు ప్రణాళికలు వేశారన్న వార్తలో తెలంగాణ పోలీసులు అప్రమత్తమయ్యారు. తెలంగాణ కౌంటర్ ఇంటిలిజెన్స్ పోలీసులు ఆదిలాబాద్ చేరుకున్నారు. ఆదిలాబాద్‌లోని పలు ప్రాంతాలు, డాబాల వద్ద అనుమానిత ఉగ్రవాదులు సంచరించినట్టు సమాచారంతో ముమ్మర తనిఖీలు చేపట్టారు.