NEET, JEE into CUET | సీయూఈటీలోకి నీట్, జేఈఈ!
12 August 2022, 22:17 IST
NEET, JEE లను కూడా సీయూఈటీ(Common University Entrance Test - CUET) పరిధిలోకి తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది. దేశవ్యాప్తంగా ఇంజినీరింగ్, మెడికల్ విద్యలో ప్రవేశాల కోసం JEE, NEET పరీక్షలను నిర్వహిస్తారనే విషయం తెలిసిందే.
ప్రతీకాత్మక చిత్రం
NEET, JEE into CUET | నూతన జాతీయ విద్యా విధానం(National Education Policy - NEP)లో `ఒకే దేశం ఒకే ప్రవేశ పరీక్ష` అనే విధానాన్ని అనుసరించాలని సూచించారు. అందులో భాగంగానే NEET, JEE లను CUET పరిధిలోకి తీసుకురావాలని కేంద్రం భావిస్తోందని యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్(UGC) చైర్మన్ జగదీశ్ కుమార్ శుక్రవారం వెల్లడించారు.
NEET, JEE into CUET | విద్యార్థులపై భారం తగ్గించడం లక్ష్యం
ఈ నిర్ణయం వెనుక ప్రధాన లక్ష్యం విద్యార్థులపై అనవసర భారాన్ని తగ్గించడమేనని కుమార్ తెలిపారు. ఒకటికి మించి ప్రవేశ పరీక్షలు రాయడం వల్ల విద్యార్థిపై ఒత్తిడి పెరుగుతుందన్నారు. ``ప్రస్తుతం మన దగ్గర మూడు ప్రధాన ప్రవేశ పరీక్షలు ఉన్నాయి. అవి నీట్, జేఈఈ, సీయూఈటీ. ఈ పరీక్షలకు పెద్ద ఎత్తున విద్యార్థులు హాజరు అవుతుంటారు. ఈ పరీక్షలు అన్నింటినీ కూడా నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (National Testing Agency - NTA) నిర్వహిస్తుంది. అందువల్ల ఈ పరీక్షలన్నింటినీ కూడా ఒకే గొడుగు కిందకు తీసుకురావాలని ఆలోచిస్తున్నాం`` అని యూజీసీ చైర్మన్ వెల్లడించారు. ఈ ప్రతిపాదనపై అన్ని సంబంధిత వర్గాల నుంచి సలహాలు, సూచనలు స్వీకరిస్తున్నామన్నారు. అందుకోసం ముందుగా నిపుణునలతో ఒక కమిటీని ఏర్పాటు చేస్తామన్నారు. ఒకవేళ ఈ ప్రతిపాదన కార్యరూపం దాలిస్తే.. వచ్చే సంవత్సరమే ఇది అమల్లోకి వస్తుందని వెల్లడించారు.
NEET, JEE into CUET | నీట్, జేఈఈ..
ఎంబీబీఎస్, బీడీఎస్ తదితర కోర్సుల్లో ప్రవేశానికి నీట్ పరీక్షను, ఎన్ఐటీ, ఐఐఐటీ, ఇతర కేంద్రీయ సంస్థల్లో ఇంజినీరింగ్ కోర్సుల్లో ప్రవేశానికి జేఈఈ(మెయిన్), ఐఐటీల్లో ప్రవేశానికి జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్షను నిర్వహిస్తారు. వివిధ అండర్ డిగ్రీ కోర్సుల్లో ప్రవేశానికి సీయూఈటీని నిర్వహిస్తారు. నీట్‌లో ప్రధానంగా బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ సబ్జెక్టులుంటాయి. జేఈఈలో మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఉంటాయి. ఇవన్నీ కూడా సీయూఈటీలో ఉంటాయి.