Government employees strike : ప్రభుత్వ ఉద్యోగుల సమ్మె బాట.. ఎన్నికల ముంగిట సీఎంకు తలనొప్పి!
28 February 2023, 14:46 IST
Karnataka government employees strike : మార్చ్ 1 నుంచి నిరవధిక సమ్మె చేపట్టాలని కర్ణాటక ప్రభుత్వ ఉద్యోగులు నిర్ణయించుకున్నారు. తమ డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు ప్రకటించారు.
నిరవధిక సమ్మెకు పిలుపునిచ్చిన కర్ణాటక ప్రభుత్వ ఉద్యోగులు
Karnataka government employees strike : ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో కర్ణాటక ప్రభుత్వంపై భారీ పిడుగు పడింది! గత కొంతకాలంగా ప్రభుత్వంపై అసంతృప్తితో ఉన్న ఉద్యోగులు.. మార్చ్ 1, అంటే బుధవారం నుంచి నిరవధిక సమ్మె చేపట్టనున్నారు. తాజా పరిణామాలు.. కర్ణాటక సీఎం బసవరాజ్ బొమ్మైకు తలనొప్పిగా మారినట్టు కనిపిస్తోంది.
3 కీలక డిమాండ్లు..
ప్రభుత్వం ముందు మూడు కీలక డిమాండ్లను పెట్టారు ఉద్యోగులు. అవి.. 7వ పే కమిషన్ నివేదిక అమలు, పాత పింఛను పథకం అమలు, ఫిట్మెంట్ వెసులుబాటులో కనీసం 40శాతం అమలు. వీటిని పరిష్కరించకపోవడంతో నిరవధిక సమ్మెలోకి వెళ్లనున్నట్టు ప్రకటించారు. పలు రవాణా, అత్యవసర సేవలు మినహా.. దాదాపు అన్ని అంశాలపైనా ప్రభుత్వ ఉద్యోగుల నిరవధిక సమ్మె ప్రభావం పడనుందని తెలుస్తోంది.
Karnataka employees strike news : రాష్ట్రవ్యాప్తంగా రవాణా, అత్యవసర సేవలపైనా తమ నిరవధిక సమ్మె ప్రభావం ఉంటుందని కర్ణాటక స్టేట్ గవర్న్మెంట్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ప్రెసిడెంట్ సీఎస్ సదాక్షరి తెలిపారు. వీటితో పాటు మహానగర పాలిక, పుర సభ, పౌరకార్మిక సేవలు కూడా దెబ్బ తినే అవకాశం ఉంది. రెవెన్యూ కలెక్షన్లు, స్కూళ్లు, ప్రీ- వర్సిటీ పరీక్షలపైనా ప్రభావం పడనుంది.
"ఇది మేము ఇప్పటికిప్పుడు తీసుకున్న నిర్ణయం కాదు. మా డిమాండ్ల పరిష్కారానికి 8 నెలల ఆలస్యమైంది. ఇంక మేము ఎదురుచూడలేము. త్వరలో ఎన్నికలు ఉన్నాయి. కొత్త ప్రభుత్వం వస్తే.. ఏం జరుగుతుందో ఎవరూ చెప్పలేరు. అందుకే.. ఉద్యోగులు స్వచ్ఛందంగా స్ట్రైక్‌లోకి వెళ్లాలని నిర్ణయించుకున్నారు," అని సదాక్షరి తెలిపారు.
ప్రభుత్వ ఉద్యోగులతో చర్చలు ఫలిచేనా?
Karnataka employees strike : ఈ వ్యవహారాన్ని సీఎం బసవరాజ్ బొమ్మై తీవ్రంగా పరిగణిస్తున్నట్టు సమాచారం. దిద్దుబాటు చర్యల్లో భాగంగా.. ప్రభుత్వ ఉద్యోగులతో అధికారులు చర్చలు జరుపుతున్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే.. 7వ పే కమిషన్ మధ్యంతర నివేదికను పూర్తి చేసి, దానిని అమలు చేసేందుకు సిద్ధంగా ఉన్నట్టు ఉద్యోగులకు బొమ్మై సంకేతాలు పంపించినట్టు సంబంధిత వర్గాలు వెల్లడించాయి.
Karnataka Government latest news : "ప్రభుత్వ ఉద్యోగుల సంఘాలతో మా సీనియర్ అధికారులు చర్చలు జరుపుతున్నారు. 7వ పే కమిషన్‌ను నియమించింది మేమే. 2023-24లోనే దానిని అమలు చేస్తామని అసెంబ్లీ వేదికగా నేను స్పష్టం చేశాను. అందుకు తగ్గట్టుగానే ఈ దఫా బడ్జెట్లో నిధులను కూడా కేటాయించాము," అని మీడియాతో చెప్పారు బసవరాజ్ బొమ్మై. 7వ పే కమిషన్ మధ్యంతర నివేదికను తీసుకుని, అమలు చేయాలన్ని ఉద్యోగుల డిమాండ్‌కు తాను అంగీకరించినట్టు ప్రకటించారు.