G20 Summit 2023: ‘జీ 20 సదస్సు ఎజెండా ఇదే’..: ప్రధాని మోదీ ట్వీట్
08 September 2023, 18:09 IST
G20 Summit 2023: ఢిల్లీలో సెప్టెంబర్ 9, సెప్టెంబర్ 10 తేదీల్లో జీ 20 శిఖరాగ్ర సదస్సు జరగనుంది. జీ 20 అధ్యక్ష హోదాలో భారత్ ఈ సదస్సును నిర్వహిస్తోంది.
ప్రధాని నరేంద్ర మోదీ
G20 Summit 2023: జీ 20 సదస్సుకు భారత్ ఘనంగా ఏర్పాట్లు చేసింది. సదస్సులో పాల్గొనే దేశాధినేతల రాక ప్రారంభమైంది. ఈ సందర్భంగా జీ 20 సదస్సు లక్ష్యాన్ని ప్రధాని మోదీ వివరించారు. వివిధ దేశాల అధినేతలను ఆహ్వానించే అవకాశం లభించడంపై హర్షం వ్యక్తం చేశారు.
ఎజెండా ఇదే..
జీ 20 సదస్సు లక్ష్యాలను, సదస్సు ఉద్దేశ్యాన్ని ప్రధాని మోదీ వివరించారు. ‘‘మానవీయత కేంద్రంగా సమ్మిళిత అభివృద్ధి లక్ష్యంగా’’ ఈ సదస్సు నిర్వహిస్తున్నామని ప్రధాని మోదీ వెల్లడించారు. వివిధ దేశాల అధినేతలతో ద్వైపాక్షిక చర్చలు ఉపయుక్తంగా జరుగుతాయని ఆయన ఆకాంక్షించారు. 18వ జీ 20 సదస్సు కు ఆతిథ్యం ఇవ్వడం తమకు ఎంతో సంతోషంగా ఉందన్నారు. ఈ సందర్భంగా జీ 20 కి అధ్యక్షత చేపట్టిన సందర్భంగా.. భారత్ ప్రకటించిన జీ 20 థీమ్ అయిన ‘వసుదైక కుటుంబం’ భావనను ప్రధాని మోదీ మరోసారి గుర్తు చేశారు. ‘‘ఒకే భూమి.. ఒకే కుటుంబం.. ఒకే భవిష్యత్తు (One Earth, One Family, One Future)’’ అనే భావనను జీ 20 సదస్సు థీమ్ గా నిర్ధారించారు. భారత్ దృష్టిలో ప్రపంచమంటే ఇదేనన్నారు.
జీ 20 సదస్సులో..
G20 సదస్సులో ‘‘ఒకే భూమి.. ఒకే కుటుంబం.. ఒకే భవిష్యత్తు (One Earth, One Family, One Future)’’ సెషన్ కి ప్రధాని మోదీ అధ్యక్షత వహిస్తారు. ఈ సెషన్ లో ప్రపంచం ఎదుర్కొంటున్న అనేక సమస్యలకు పరిష్కారాలను వెతికే దిశగా చర్చ కొనసాగుతుంది. అలాగే బలమైన, సమ్మిళిత అభివృద్ధి లక్ష్యంగా చేపట్టాల్సిన చర్యలను చర్చిస్తారు. జీ 20 అధ్యక్షత పై ప్రధాన మోడీ స్పందిస్తూ.. ఇది నిర్ణయాత్మక, లక్ష్యపూరిత బాధ్యతగా అభివర్ణించారు. సమ్మిళిత అభివృద్ధి, బహుముఖియ అంతర్జాతీయ సంస్థలు 21వ శతాబ్దికి అవసరమని ప్రధాని మోదీ తెలిపారు. బహుముఖ అభివృద్ధికి టెక్నలజికల్ ట్రాన్స్ఫర్మేషన్, డిజిటల్ పబ్లిక్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ కీలకంగా మారనున్నాయన్నారు. లింగ సమానత్వం దిశగా, మహిళల సాధికారత దిశగా, ప్రపంచ శాంతి దిశగా కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు. మహాత్మా గాంధీ సమాజంలో అట్టడుగున ఉన్నవారికి సంక్షేమ, అభివృద్ధి పలాలు దక్కాలన్న మహాత్మా గాంధీ ఆలోచనల దిశగా కృషి సాగించాల్సి ఉందన్నారు. వివిధ దేశాల అధినేతలతో జరగనున్న ద్వైపాక్షిక సమావేశాలు ఫలవంతం అవుతాయన్న ఆశాభావం వ్యక్తం చేశారు.