G20 Summit 2023: బైడెన్, ట్రూడోలతో సహా వరుస ద్వైపాక్షిక భేటీలతో ప్రధాని మోదీ బిజీ బిజీ..
G20 Summit 2023: జీ 20 సదస్సు సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ క్షణం తీరిక లేకుండా గడపనున్నారు. సదస్సులో పాల్గొనడానికి వచ్చిన వివిధ దేశాల అధినేతలతో ద్వైపాక్షిక సమావేశాల్లో పాల్గొననున్నారు.
G20 Summit 2023: భారత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న జీ 20 సదస్సుకు వివిధ దేశాల అధినేతలు హాజరవుతున్నారు. వారితో ద్వైపాక్షి భేటీలతో ప్రధాన నరేంద్ర మోదీ బిజీ బిజీగా ఉండనున్నారు. శుక్రవారం ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తో ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. మోదీ తన నివాసంలో జో బైడెన్ ప్రత్యేకంగా విందు ఇవ్వనున్నారు. అదే సమయంలో వారి మధ్య ద్వైపాక్షిక భేటీ జరగనుంది. అలాగే, శుక్రవారమే ప్రధాని మోదీ బంగ్లాదేశ్ ప్రైమ్ మినిస్టర్ షేక్ హసీనాతోను, మారిషస్ ప్రధాని ప్రవింద్ కుమార్ జగన్నాథ్ తోను వేరువేరుగా ద్వైపాక్షిక సమావేశాలు నిర్వహించనున్నారు. ‘వివిధ దేశాలతో భారత ద్వైపాక్షిక సంబంధాలను సమీక్షించుకోవడానికి ఇది ఒక మంచి అవకాశం’ అని మోదీ ట్విట్టర్లో వ్యాఖ్యానించారు.
15 ద్వైపాక్షిక భేటీలు..
G20 సదస్సు సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ దాదాపు 15 మంది దేశాలనేతలతో వేరువేరుగా ద్వైపాక్షిక సమావేశాలు నిర్వహిస్తున్నారు. బ్రిటన్, జపాన్, ఇటలీ, జర్మనీ, ఫ్రాన్స్, కెనడా, క్యామెరాస్, టర్కీ, దక్షిణ కొరియా, యూఏఈ, నైజీరియా, బ్రెజిల్, యూరోపియన్ యూనియన్, యూరోపియన్ కౌన్సిల్ నాయకులతో ప్రధాని మోదీ వేర్వేరుగా సమావేశం కానున్నారు. ఈ 15 బైపాక్షిక సమావేశాలు శుక్రవారం నుంచి ఆదివారం వరకు వేరువేరు సమయాల్లో జరగనున్నాయి.
శనివారం..
శనివారం మధ్యాహ్నం ప్రధాని మోదీ బ్రిటన్ ప్రధాని రిషి సునక్ తోను, జపాన్ ప్రధాని ఫ్యుమియొ కిషిదా తోనూ వేరువేరుగా సమావేశం కానున్నారు. అలాగే అదే రోజు ఇటలీ ప్రధాని జర్జియా మెలోనీతో కూడా ప్రధాని మోదీ సమావేశం అవుతారు. జర్మన్ ఛాన్సలర్ ఒలాఫ్ షోల్జ్ తో కూడా ప్రధాని శనివారమే ప్రత్యేకంగా భేటీ అవుతారు.
ఆదివారం..
ఆదివారం ప్రధాని మోదీ ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మానుయేల్ మేక్రాన్ తో వర్కింగ్ లంచ్ లో పాల్గొంటారు. అలాగే కెనడా ప్రధాని జస్టి న్ ట్రూ డో తో కూడా ప్రత్యేకంగా సమావేశం అవుతారు. జీ 20 సదస్సులో పాల్గొనడం కోసం వివిధ దేశాల నుంచి అధినేతల రాక ప్రారంభమైంది. జీ 20 ని 1999లో ఏర్పాటు చేశారు. నాటి నుంచి భారత్ జీ 20 కి అధ్యక్షత వహించడం ఇదే తొలిసారి. అధ్యక్ష హోదాలో జీ 20 సదస్సును ఇప్పుడు భారత్ ఢిల్లీలో నిర్వహిస్తోంది. దేశవ్యాప్తంగా 60 నగరాల్లో జీ 20 సంబంధించిన సమావేశాలను భారత్ ఇప్పటికే నిర్వహించింది.