Parliament special session : ‘నెహ్రూ మాటలు స్ఫూర్తిదాయకం'- మోదీ
18 September 2023, 12:53 IST
Parliament special session : పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల ప్రారంభోత్సవం నేపథ్యంలో కీలక ప్రసంగం చేశారు ప్రధాని మోదీ. పాత భవనంలో తనకి ఉన్న జ్ఞాపకాలతో పాటు పలు ఇతర విషయాలను ప్రస్తావించారు.
పార్లమెంట్లో ప్రధాని మోదీ..
Parliament special session : భారతీయుల్లో శాసన వ్యవస్థపై నమ్మకాన్ని నింపడమే.. భారత దేశ పార్లమెంట్ ప్రస్థానంలో అతి గొప్ప ఘనత అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. తాను తొలిసారిగా పార్లమెంట్లో అడుగుపెట్టిన (2014) క్షణాలను ఎన్నటికీ మర్చిపోలేనని భావోద్వేగానికి గురయ్యారు. పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల ప్రారంభం నేపథ్యంలో ఈ మేరకు వ్యాఖ్యానించారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.
"నేను తొలిసారి పార్లమెంట్లో అడుగుపెట్టినప్పుడు.. ఈ ప్రజాస్వామ్య ఆలయం ఎదుట నమస్కారం చేశాను. నాకు అది భావోద్వేగ సంఘటన. రైల్వే స్టేషన్లో పనులు చేస్తూ జీవితాన్ని గడిపే ఓ నిరుపేద కుటుంబం నుంచి వచ్చిన ఓ వ్యక్తి, పార్లమెంట్లో అడుగుపెట్టగలిగాడు అంటే.. అది కచ్చితంగా ప్రజాస్వామ్య శక్తి వల్లే! ఈ దేశంలో నా మీద ఇంత గౌరవం, ప్రేమ ఇస్తుందని నేను ఎప్పుడు అనుకోలేదు," అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు.
Modi speech in Parliament special session : పార్లమెంట్ పాత భవనంలో ఇదే చివరి సెషన్. ఐదు రోజుల పాటు జరిగే ఈ సమావేశంలోనే.. పార్లమెంట్ కొత్త భవనానికి ఎంపీలు చేరుకుంటారని సమాచారం. ఈ నేపథ్యంలో.. పార్లమెంట్ పాత భవనాన్ని ఉద్ధేశించి కీలక వ్యాఖ్యలు చేశారు ప్రధాని. మాజీ ప్రధాని నెహ్రూ, పార్లమెంట్‌పై దాడి ఘటన వంటి వాటిని ప్రస్తావించారు.
"స్వాతంత్ర్యం సందర్భంలో.. నాటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ చేసిన 'అట్ ది స్ట్రోక్ ఆఫ్ మిడ్నైట్' ప్రసంగం.. ఈ పార్లమెంట్లో ఇంకా వినిపిస్తూనే ఉంది. అది అందరిలోనూ స్ఫూర్తిని నింపే ప్రసంగం. 'ప్రభుత్వాలు వస్తూ ఉంటాయి, వెళుతూ ఉంటాయి. పార్టీలు ఏర్పడతాయి, విడిపోతాయి. కానీ దేశం నిలబడాల్సిందే,' అని ఇదే పార్లమెంట్లో ప్రసంగించారు మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి," అని మోదీ గుర్తుచేసుకున్నారు.
PM Modi latest news : "పార్లమెంట్‌పై ఉగ్రదాడి జరిగింది. అది కేవలం ఒక భవనంపై జరిగిన దాడి కాదు. ప్రజాస్వామ్య తల్లిపై జరిగిన దాడి. ఆ ఘనను దేశం ఎన్నటికి మర్చిపోదు. పార్లమెంట్, పార్లమెంట్ సభ్యులను రక్షించేందుకు పోరాడిన వారందరికి నేను శిరస్సు వంచి ధన్యవాదాలు తెలుపుతున్నాను," అని మోదీ అన్నారు.
"ఈ భవనానికి వీడ్కోలు పలకడం అనేది భావోద్వేగ విషయం. ఎన్నో జ్ఞాపకాలు ఉన్నాయి. విభేదాలు, వివాదాలను చూశాను. అదే సమయంలో.. కలిసి మెలిసి ఉన్నాము. చాలా గర్వంగా ఉంది," అని మోదీ పేర్కొన్నారు.
దిల్లీలో ఇటీవలే జరిగిన జీ20 సమావేశాలను కూడా తన ప్రసంగంలో ప్రస్తావించారు ప్రధాని.
"జీ20 సదస్సు సాధించిన విజయం.. 140 కోట్ల మంది భారతీయుల విజయం. ఇది భారత్ విజయం. ఇది వ్యక్తిగతం లేదా ఒక రాజకీయ పార్టీ విజయం కాదు. చాలా మందికి భారత్‌పై అనుమానాలు ఉండేవి. స్వాతంత్ర్యం నుంచి ఈ అనుమానాలు ఉన్నాయి. ఈసారి కూడా జీ20 సదస్సులో ఎలాంటి డిక్లరేషన్ ఉండదని అనుకున్నారు. కానీ భారత దేశ శక్తి వల్లే విజయం సాధ్యమైంది," అని మోదీ అన్నారు.
సోమవారం ఉదయం ప్రారంభమైన పార్లమెంట్ స్పెషల్ సెషన్.. ఈ నెల 22 వరకు జరుగనుంది. ఈ సమావేశాల అజెండాపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. 75ఏళ్ల స్వాతంత్ర్య భారత దేశం సాధించిన ఘనతలను ప్రస్తావించేందుకు ఈ సమావేశాలు నిర్వహిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి.