Parliament session: ప్రధాని మోదీకి సోనియా గాంధీ లేఖ; పార్లమెంట్ ప్రత్యేక సెషన్ పై ప్రశ్నలు
06 September 2023, 15:58 IST
Parliament session: ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, పార్టీ మాజీ అధ్యక్షురాలు, కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చీఫ్ సోనియా గాంధీ బుధవారం ఒక లేఖ రాశారు. సెప్టెంబర్ 18 నుంచి జరగనున్న పార్లమెంటు ప్రత్యేక సమావేశాలపై పలు ప్రశ్నలను ఆమె ఆ లేఖలో లేవనెత్తారు.
కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చీఫ్ సోనియాగాంధీ (ఫైల్ ఫొటో)
Parliament session: సెప్టెంబర్ 18 నుంచి 22 వరకు, ఐదు రోజుల పాటు పార్లమెంటు ప్రత్యేక సమావేశాలను నిర్వహిస్తున్నారు. ఈ సమావేశాల్లో జమిలి ఎన్నికల నిర్వహణపై కేంద్రం రాజ్యాంగ సవరణ బిల్లును ప్రవేశపెట్టే అవకాశాలున్నాయన్న వార్తలు వస్తున్నాయి. మరోవైపు, ఈ సమావేశాల్లోనే దేశం పేరును భారత్ గా మార్చడానికి సంబంధించిన బిల్లును కూడా ప్రవేశపెట్టే అవకాశముంది. ఈ సమావేశాల్లో ప్రశ్నోత్తరాల సమయం కానీ, జీరో అవర్ కానీ ఉండబోవని ప్రభుత్వం స్పష్టం చేసింది. మరోవైపు, ఈ ప్రత్యేక సమావేశాలు పార్లమెంటు నూతన భవనంలో జరిగే అవకాశమున్నట్లు తెలుస్తోంది.
సోనియా లేఖ
ఈ నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, పార్టీ మాజీ అధ్యక్షురాలు, కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చీఫ్ సోనియా గాంధీ బుధవారం ఒక లేఖ రాశారు. విపక్షాలను సంప్రదించకుండానే ప్రత్యేక సమావేశాల తేదీలను నిర్ణయించారని ఆమె ఆ లేఖలో విమర్శించారు. సమావేశాల ఎజెండాను కూడా తెలియజేయలేదని మండిపడ్డారు. పార్లమెంటు సమావేశాల్లో పాల్గొనాలనే ఆసక్తితో ప్రతిపక్షాలు ఉన్నాయని, ప్రజా సమస్యలను లేవనెత్తే అవకాశాన్ని విపక్షాలు వదులుకోవని, అయితే, విపక్షాలకు సమావేశాల ఎజెండా తెలియజేయాల్సిన కనీస బాధ్యత ప్రభుత్వంపై ఉందని ఆమె వ్యాఖ్యానించారు.
ఈ అంశాలపై చర్చ జరగాలి..
ఈ సమావేశాల్లో దేశం ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలపై చర్చ జరగాలని ఆ లేఖలో సోనియాగాంధీ కోరారు. పార్లమెంటు ప్రత్యేక సమావేశాల్లో దేశ ప్రస్తుత ఆర్థిక పరిస్థితి, కుల గణన ఆవశ్యకత, అధిక ధరలు, నిరుద్యోగం, మణిపూర్ హింస, పెరుగుతున్న అసమానతలు, చిన్న, మధ్యతరహా పరిశ్రమల దుస్థితి, దేశవ్యాప్తంగా రైతాంగానికి గిట్టుబాటు ధర సహా పలు అంశాలపై ప్రభుత్వం ఇచ్చిన హామీల పరిస్థితి, ఆదానీ గ్రూప్ అవకతవకలపై జేపీసీ ఏర్పాటు, పలు రాష్ట్రాల్లో మతపరమైన ఉద్రిక్తతలు.. తదితర అంశాలపై చర్చ జరగాల్సి ఉందని ఆ లేఖలో సోనియా గాంధీ సూచించారు. ప్రత్యేక సమావేశాల సందర్భంగా ఈ 9 అంశాలపై చర్చ జరగాలన్నారు.