ISIS : ఐసిస్ ఉగ్రవాదులు పిల్లల మాంసాన్ని తినిపించారు.. భయంకరమైన కథ
20 October 2024, 17:19 IST
- ISIS : ఐసిస్ ఉగ్రవాదులు చేసే పనుల గురించి ప్రపంచమంతా తెలుసు. తాజాగా ఓ మహిళ చెప్పిన విషయాలు చాలా భయంకరంగా ఉన్నాయి. పిల్లలను చంపి వారి మంసాన్ని కూర వండి పెట్టేవారట.
ఐసిస్ చెరలో ఉన్నప్పుడు తనకు జరిగిన ఘటనలు చెప్పిన మహిళ
ఐసిస్ ఉగ్రవాదులు పదేళ్ల కిందట అంటే 2014లో ఫౌజియా అమీన్ సిడో అనే మహిళను అపహరించారు. అప్పుడు ఆమె వయసు తొమ్మిదేళ్లు. తాజాగా సిడోను గాజాలో ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ గుర్తించి.. కుటుంబానికి అప్పగించింది. ఇటీవల ఆమె ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ..తనకు ఎదురైన భయానక పరిస్థితుల గురించి వివరించింది.
ఇజ్రాయెల్ దళాలు రక్షించిన యాజిదీ మహిళ ఫౌజియా అమీన్ సిడో. తనకు ఎదురైన భయానక అనుభవాన్ని వెల్లడించింది. రెండు వారాల క్రితం ఆమెను రక్షించారు. ఐసిస్ చెరలో ఉన్నప్పుడు తాను ఎదుర్కొన్న దారుణాలను ఓ ఇంటర్వ్యూలో గుర్తు చేసుకుంది. తొమ్మిదేళ్ల వయసులో తన సోదరులతో కలిసి ఐసిస్ ఉగ్రవాదులు తనను బందించారని సిడో చెప్పారు. కొన్ని రోజుల తర్వాత బందీలుగా ఉన్న వేలాది మందితో పాటు తాను కూడా సింజార్ నుండి తాల్ అఫార్ వరకు నడిచారు.
మూడు రోజుల పాటు ఆకలితో అలమటించిన తర్వాత ఉగ్రవాదులు బందీలకు తినడానికి మాంసం, అన్నం ఇచ్చారు, మాంసం రుచి వింతగా అనిపించింది. కానీ మూడు రోజులుగా ఆకలి వేయడంతో ఆ అన్నం, మాంసం తిన్నారు. కొంతమందికి కడుపు నొప్పులు ప్రారంభమయ్యాయి. తినడానికి ఇచ్చిన మాంసం యాజిదీ పిల్లలదేనని ఐసిస్ ఉగ్రవాదులు తర్వాత బందీలకు చెప్పారు. పిల్లల చిత్రాలను కూడా చూపించారు.
ఐసిస్ ఉగ్రవాదులు యాజిదీ బందీలకు మానవ మాంసాన్ని తినిపించడం మామూలే. గతంలో కూడా ఇలాంటి ఘటనలు జరిగాయి. ఉగ్రవాద సంస్థకు చెందినవారు తమకు మానవ మాంసాన్ని తినిపించారని చెప్పినప్పుడు, అక్కడ చాలా మంది షాక్ కు గురయ్యారని సిడో చెప్పారు. అందులో ఒకరు విషయం తెలిసి గుండెపోటుతో మరణించారని తెలిపారు.
మరో 200 మంది యాజిదీ అమ్మాయిలతో పాటు బేస్ మెంట్ జైలులో సిడోను కొన్ని నెలలు నిర్బంధించారు. అక్కడ పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే మురికి ఆహారం తిని, మంచినీళ్లు తాగి చాలా మంది బాలికలు చనిపోయారు. అండర్ గ్రౌండ్ జైలు నుంచి విడుదలైన తర్వాత తనను ఐదుసార్లు అమ్మేశారని సిడో చెప్పారు. కొన్ని రోజుల క్రితం ఇజ్రాయెల్ సైన్యం నేతృత్వంలోని సైనిక చర్యలో గాజా నుంచి ఆమెను రక్షించారు. దీంతో ఆమె తన కుటుంబం ఉన్న ఇరాక్‌కు తిరిగి రాగలిగింది.
తాను వారి చెరలో ఉన్నంత కాలం సబయా అనే పేరుతో జిహాదీలకు విక్రయించినట్టుగా సిడో చెప్పారు. సబయా అనేది అరబిక్ పదం.. అంటే లైంగిక దోపిడీ కోసం బందీగా ఉన్న మహిళ అని అర్థం. గాజాలో నరకంలా బతికానని, స్వస్థలమైన ఇరాక్ చేరుకున్నప్పుడు స్వేచ్ఛగా శ్వాస తీసుకోగలిగానని సిడో తన బాధను చెప్పుకొచ్చారు.