Farmers protest in Delhi : రైతుల నిరసనల మధ్య దిల్లీలో గందరగోళం.. భారీ ట్రాఫిక్ జామ్‌లు!
13 February 2024, 11:19 IST
- Farmers protest in Delhi : రైతుల 'దిల్లీ ఛలో' నిరసనలు మొదలయ్యాయి. వారిని అడ్డుకునేందుకు దిల్లీ పోలీసులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ పరిణామాల మధ్య సామాన్యులు నలిగిపోతున్నారు.
రైతుల నిరసనతో దిల్లీలో గందరగోళం.. భారీ ట్రాఫిక్ జామ్‌లు
Farmers protest in Delhi : వందలాది ట్రాక్టర్లతో పంజాబ్ రైతులు దిల్లీవైపు మార్చ్‌ని మొదలుపెట్టారు. తమ డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ.. దేశ రాజధానిలో నిరసనలు చేపట్టేందుకు "దిల్లీ ఛలో"కి పిలుపునిచ్చారు రైతన్నలు. వారిని అడ్డుకోవడానికి పోలీసు అధికారులు తీవ్రస్థాయిలో భద్రతా ఏర్పాట్లను చేశారు. దిల్లీ సరిహద్దులు భద్రతా వలయంలోకి జారుకున్నాయి. రైతులు, పోలీసుల మధ్య.. సామాన్య ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. కఠిన ఆంక్షల మధ్య ట్రాఫిక్ స్తంభించిపోవడంతో ప్రజలు తీవ్ర సమస్యలను ఎదుర్కొంటున్నారు.
రైతుల నిరసనలకు కారణం ఏంటంటే..
రైతుల ఆందోళనల్లో ప్రముఖంగా 6 డిమాండ్లు కనిపిస్తున్నాయి. అవి.. పంటకు కనీస మద్దతు ధరకు చట్టం, రైతు రుణ మాఫీ, స్వామినాథన్ కమిషన్ సిఫార్సుల అమలు, 2020 విద్యుత్ చట్టం ఉపసంహరణ, లఖింపుర్ ఖేరీ ఘటనలో మరణించిన రైతు కుటుంబాలకు పరిహారం, గతంలో చేపట్టిన నిరసనల నేపథ్యంలో.. రైతులపై వేసిన కేసులను రద్దు చేయడం.
Chalo Delhi march : తమ డిమాండ్లను పరిష్కరించకపోతే.. దిల్లీలో తీవ్రస్థాయిలో నిరసనలు చేస్తామని రైతు సంఘాలు అల్టిమేటం జారీ చేశాయి. ఈ విషయంపై సోమవారం అర్థరాత్రి వరకు.. రైతు సంఘాలు- కేంద్ర మంత్రుల మధ్య ఛండిగఢ్లో చర్చలు జరిగాయి. కానీ అవి ఆశించిన మేర ఫలితాల్ని ఇవ్వలేదు. చర్చల్లో భాగంగా.. డిమాండ్లలో మూడింటికి మంత్రులు అంగీకారం చెప్పినట్టు సమాచారం. కానీ.. పంటకు కనీస మద్దతు ధరపై చర్చ వంటి అతి ముఖ్యమైన అంశాలపై చర్చలు ఓ కొలిక్కి రాకపోవడంతో.. రైతు సంఘాలు.. తమ ఛలో దిల్లీ కార్యక్రమాన్ని యథావిథిగా కొనసాగిస్తామని ప్రకటించారు.
రైతు నిరసనలను కట్టడి చేసేందుకు పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. అనేక రోడ్లను మూసివేసారు. బ్యారికేడ్లను ఏర్పాటు చేశారు. దిల్లీ సరిహద్దుల్లో ట్రాక్టర్లని అడ్డుకోవడానికి రోడ్లపై ముళ్ల కంచెలను పెట్టారు. ఇలా.. చాలా చోట్ల, చాలా చర్యలు తీసుకున్నారు. వీటి కారణంగా.. సింఘు, టిక్రి, ఘాజీపుర్ సరిహద్దుల్లో ఉద్రిక్త వాతావరణం నెలకొన్నట్టు కనిపిస్తోంది. దిల్లీ సరిహద్దుల్లో కఠిన ఆంక్షలు కూడా అమల్లోకి వచ్చాయి. ప్రజలు భారీ సంఖ్యలో గుమిగూడవద్దని ఆదేశాలు జారీ అయ్యాయి.
Farmers march live updates : రైతు నిరసనలను అడ్డుకోవడానికి హరియాణా, పంజాబ్ రాష్ట్రాలు కూడా అనేక చర్యలు చేపట్టాయి. అంబాల, జింద్, ఫతేహ్బాద్, కురుక్షేత్ర, సిర్సా వంటి సరిహద్దు ప్రాంతాల్లో బ్యారికేడ్లు ఏర్పాటు చశాయి. పలు కఠిన ఆంక్షలను విధించాయి.
వీటన్నింటి మధ్య సామాన్య ప్రజలు నలిగిపోతున్నారు! ట్రాఫిక్ జామ్‌లతో దిల్లీ స్తంభించిపోయింది. కొన్ని కొన్ని ప్రాంతాల్లో.. వాహనాలు గంటకు ఒక కిలోమీటరు మాత్రమే వెళ్లగలుగుతున్నాయంటే.. అక్కడి పరిస్థితులు ఎంత ఘోరంగా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. కొన్ని చోట్ల రోడ్లను బ్లాక్ చేయడంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. అదే సమయంలో.. ఇంకొన్ని చోట్ల ట్రాఫిక్ని దారి మళ్లించడంతో సమస్యలు మరింత పెరిగాయి.
2020 నాటి పరిస్థితులు..!
కిసాన్ మజ్దూర్ మోర్చాలో 250 రైతు సంఘాలు ఉన్నాయి. సంయుక్త కిసాన్ మోర్చాలో 150 రైతు సంఘాలు ఉన్నాయి. ఈ రెండు కలిసి.. కేంద్ర ప్రభుత్వంపై ఇప్పుడు నిరసనలకు దిగాయి.
తాజా పరిణామాలు.. 2020లో జరిగిన సంఘటనలు గుర్తు చేస్తున్నాయి! నాడు.. మూడు రైతు చట్టాలను కేంద్రం అమలు చేసింది. వాటికి వ్యతిరేకంగా.. రైతులు దిల్లీ సరిహద్దుల్లో సుదీర్ఘ పోరాటం చేశారు. ఎన్ని కష్టాలొచ్చినా, చలికి తట్టుకుని రోడ్ల మీద ఆందోళనలు చేపట్టారు. చివరికి.. ప్రభుత్వం దిగొచ్చి.. రైతు చట్టాలను ఉపసంహరించుకుంది.