ఈవీ బ్యాటరీల్లో మంటలు.. మన ఉష్ణోగ్రతలు తట్టుకోలేకే కావొచ్చు..
09 May 2022, 16:27 IST
న్యూఢిల్లీ, మే 9: ఎలక్ట్రిక్ వాహనాల కోసం దిగుమతి చేసుకున్న బ్యాటరీ సెల్‌లు దేశ పరిస్థితులకు అనుకూలంగా ఉండకపోవచ్చని నీతి ఆయోగ్ సభ్యుడు, ప్రముఖ శాస్త్రవేత్త వీకే సారస్వత్ అన్నారు. ఎలక్ట్రిక్ వాహనాలకు మంటలు అంటుకున్న అనేక సంఘటనల నేపథ్యంలో ఆయన ఈ అంశంపై స్పందించారు.
బ్యాటరీ పేలుడుతో మంటలు (ప్రతీకాత్మక చిత్రం)
స్థానికంగా సెల్స్ తయారు చేయవలసిన అవసరం ఉందని వీకే సారస్వత్ అభిప్రాయపడ్డారు. ఆయా సంఘటనలపై అధికారులు విచారణ జరుపుతున్న నేపథ్యంలో, నిపుణుల ప్యానెల్ నివేదికను సమర్పించిన తర్వాత అన్ని లోపభూయిష్ట వాహనాలను రీకాల్ చేయడానికి ఆదేశించనున్నట్టు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఇటీవల పేర్కొన్న నేపథ్యంలో కూడా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
ఇటీవలి కాలంలో ఎలక్ట్రిక్ వాహనాలు (ఈవీలు) అగ్నికి ఆహుతైన సంఘటనలు అనేకం ఉన్నాయి. ఫలితంగా మరణాలతోపాటు తీవ్రంగా గాయపడిన సంఘటనలు నమోదయ్యాయి.
‘బ్యాటరీ టెక్నాలజీ అభివృద్ధి చెందుతున్న సాంకేతికత. ప్రస్తుతం భారతదేశం బ్యాటరీ సెల్‌లను తయారు చేయడం లేదు. మన స్వంత సెల్ తయారీ ప్లాంట్‌లను వీలైనంత త్వరగా నెలకొల్పాలి. మనం తయారు చేసే సెల్స్ అధిక ఉష్ణోగ్రతలను తట్టుకునేలా, భారతీయ పరిస్థితులకు అనుకూలంగా ఉండేలా చూసుకోవాలి’ అని వీకే సారస్వత్ పీటీఐతో చెప్పారు.
డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (డిఆర్‌డిఓ) మాజీ చీఫ్ కూడా అయిన సారస్వత్ మాట్లాడుతూ.. అధిక ఉష్ణోగ్రత, ఉష్ణమండల వాతావరణం కోసం రూపొందించని సెల్స్ నాణ్యత లేని కారణంగా మంటలు వచ్చి ఉండవచ్చునని అన్నారు.
‘భారతదేశం పొందుతున్న (బ్యాటరీ) సెల్‌లు భారతీయ పరిస్థితులకు తగినవి కాకపోవచ్చు. కాబట్టి మనం సెల్‌లను దిగుమతి చేసుకున్నప్పుడు, మన స్వంత స్క్రీనింగ్, కఠినమైన పరీక్షా విధానాన్ని రూపొందించుకోవాలి..’ అని అన్నారు.
అధిక ఉష్ణోగ్రతల వద్ద పనిచేసే సెల్స్ అభివృద్ధి చేసిన కొన్ని దేశాలు ఉన్నాయని కూడా ఆయన పేర్కొన్నారు.
ఈవీలలో అగ్రగామిగా మారడానికి భారతదేశం చేస్తున్న ప్రయత్నాలను అగ్నిప్రమాదాలు బలహీనపరుస్తాయా అనే అంశంపై సారస్వత్ మాట్లాడుతూ ‘జరుగుతున్న ప్రమాదాలు ఆటోమొబైల్ రంగంలోకి బ్యాటరీల వ్యాప్తిపై కొంత ప్రభావం చూపుతాయి’ అని అన్నారు.
ఇటీవల రోడ్డు రవాణా, రహదారుల మంత్రి నితిన్ గడ్కరీ ఓ సందర్భంలో మాట్లాడుతూ నిర్లక్ష్యంగా వ్యవహరించే కంపెనీలకు జరిమానా విధిస్తామని హెచ్చరించారు. నిపుణుల ప్యానెల్ తన నివేదికను సమర్పించిన తర్వాత అన్ని లోపభూయిష్ట వాహనాలను రీకాల్ చేయడానికి ఆదేశించనున్నట్టు చెప్పారు.
టాపిక్