Indonesia Football Match Stampede : ఫుట్‌బాల్ మ్యాచ్ ఘటనలో 174కి చేరిన మృతులు!
02 October 2022, 13:35 IST
- Indonesia Football Match Stampede death toll : ప్రపంచాన్ని షాక్‌కు గురిచేసిన ఇండోనేషియా హింసాకాండ ఘటనలో మృతుల సంఖ్య 174కి చేరింది. మరో 180కిపైగా ప్రజలు గాయపడ్డారు.
ఫుట్‌బాల్ మ్యాచ్ ఘటనలో గాయపడిన వ్యక్తిని తరలిస్తున్న సహాయక సిబ్బంది
Indonesia Football Match Stampede death toll : ఇండోనేషియా ఫుట్‌బాల్ మ్యాచ్ హింసాకాండలో మృతుల సంఖ్య 174కి చేరింది. ఈ ఘటనలో మరో 180మంది గాయపడ్డారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని సమాచారం.
"ఉదయం 9:30 గంటలకు మృతుల సంఖ్య 158గా ఉంది.. 10:30కి 174కి చేరింది. మరణాలు ఇంకా పెరగవచ్చు," అని తూర్పు జావా డిప్యూటీ గవర్నర్ ఎమిల్ డార్డట్.. స్థానిక మీడియాకు వెల్లడించారు.
ఇండోనేషియా ఫుట్‌బాల్ మ్యాచ్ రక్తపాతం.. శనివారం రాత్రి మలంగ్ నగరంలో చోటుచేసుకుంది. ప్రపంచవ్యాప్తంగా స్టేడియాల్లో జరిగిన ఘోరమైన ఘటనల్లో ఒకటిగా ఇది నిలిచింది.
ఘటనాస్థలంలో విషాదకర సన్నివేశాలు దర్శనమిచ్చాయి. కాలిపోయిన పోలీసు వ్యాన్, గాయలతో పడి ఉన్న క్షతగాత్రులు, సాయం కోసం ఎదురుచూస్తున్న ప్రజలకు సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. ఆసుపత్రుల్లో సైతం ఇదే పరిస్థితులు కొనసాగుతున్నాయి. బాధితుల్లో ఓ ఐదేళ్ల చిన్నారి కూడా ఉందని వైద్యులు చెప్పారు.
Indonesia football match riot : అసలేం జరిగింది..?
పోలీసుల కథనం ప్రకారం.. స్టేడియంలో మ్యాచ్ జరుగుతున్న సమయంలో 42వేల మంది ఉన్నారు. ఓ 3000వేల మంది ఒక్కసారిగా పిచ్‌పైకి దూసుకొచ్చారు. వారిని అడ్డుకునేందుకు పోలీసులు చర్యలు చేపట్టారు. బాష్పవాయువును ప్రయోగించి, పరిస్థితిని అదుపుచేసేందుకు ప్రయత్నించారు. ఈ పరిస్థితులు తొక్కిసలాటకు దారి తీశాయి. ఏం జరుగుతోందో అర్థమయ్యే లోపే.. అనేకమంది ప్రాణాలు కోల్పోయారు.
స్టేడియంలో ఉన్న వారి కథనం మాత్రం భిన్నంగా ఉంది. తొలుత హింసాకాండ ఏమీ లేదని, పోలీసులు బాష్పవాయువును ఎందుకు ప్రయోగించారో తమకు అర్థం కాలేదని అంటున్నారు. ఆ పరిస్థితుల్లో ప్రజలు బయటకు పరుగులు తీసేందుకు ప్రయత్నించడంతో.. తొక్కిసలాట జరిగిందని చెబుతున్నారు.
Indonesia Football Match Stampede : ఇండోనేషియా ఫుట్‌బాల్ మ్యాచ్ హింసాకాండపై అధ్యక్షుడు జోకో విడోడో దర్యాప్తునకు ఆదేశించారు. ఫుట్‌బాల్ మ్యాచ్‌ల్లో భద్రతా ప్రమాణాలపై సమీక్ష నిర్వహించాలని నిర్ణయించారు. పరిస్థితులు చక్కబడేంత వరకు దేశంలో ఫుట్‌బాల్ మ్యాచ్‌లు నిలిపివేయాలని ఆదేశించారు.
ఇండోనేషియాలో సాధారణమే..!
ఫుట్‌బాల్ మ్యాచ్‌లో హింసాకాండ జరగడం ఇండోనేషియాలో సర్వసాధారణమైన విషయంగా మారిపోయింది! మ్యాచ్‌ని ఓ క్రీడా గా చూడకుండా.. శత్రుత్వాన్ని పెంచుకుంటున్నారు అక్కడి అభిమానులు. అరేమా ఎఫ్‌సీ, పెర్సెబాయ సురబాయ జట్ల మధ్య దీర్ఘకాలంగా తీవ్ర పోటీ నడుస్తోంది. అదే సమయంలో ఆ జట్ల అభిమానుల మధ్య తీవ్ర శత్రుత్వం కొనసాగుతోంది.
Indonesia Football Match news : ఇండోనేషియా ఫుట్‌బాల్ మ్యాచ్ హింసాకాండలో అధికారుల తప్పు కూడా ఉన్నట్టు తెలుస్తోంది. కేవలం 38000 టికెట్లే అమ్మాలని ఆదేశాలు అందినా.. 42వేల టికెట్లు అమ్మేశారు. అంతేకాకుండా.. హింస జరుగుతుందన్న అనుమానంతో పెర్సెబాయ జట్టు అభిమానులను లోపలికి అనుమతించకూడందని తీసుకున్న నిర్ణయాన్ని సైతం పక్కన పడేశారు.