Aadhaar update: ఆధార్ వివరాలను ఆన్ లైన్ లో ఉచితంగా మార్చుకోవడానికి గడువు పెంపు; ఎప్పటివరకు అంటే..?
21 June 2023, 15:17 IST
ఆన్ లైన్ లో ఆధార్ కార్డ్ లోని వివరాలను ఉచితంగా మార్చుకోవడానికి గడువును పెంచుతూ యూఐడీఏఐ (UIDAI) నిర్ణయం తీసుకుంది. నిజానికి, జూన్ 14 తోనే ఆ గడువు ముగియగా, తాజాగా, ఆ గడువును మరో మూడు నెలలు పొడిగించింది.
ప్రతీకాత్మక చిత్రం
పౌరులు తమ ఆధార్ కార్డులో అడ్రస్ వంటి వివరాలను మార్చుకోవాలనుకుంటే, సెప్టెంబర్ 14 వరకు ఆన్ లైన్ లో వారు ఉచితంగా ఆ మార్పులు చేసుకోవచ్చు. ఈ మేరకు ఆధార్ కార్డులను జారీ చేసే అథారిటీ యూఐడీఏఐ (UIDAI) వెసులుబాటు కల్పించింది. గతంలో ఈ గడువు జూన్ 14 వరకు మాత్రమే ఉండేది. ఈ మార్చి నెలలో ఈ ఉచిత ఆధార్ అప్ డేట్ డ్రైవ్ ను యూఐడీఏఐ (UIDAI) ప్రారంభించింది.
10 సంవత్సరాల క్రితం తీసుకుంటే..
ఆధార్ కార్డును తీసుకుని 10 సంవత్సరాలు దాటితే, ఆన్ లైన్ లో ఆ కార్డును ఉచితంగా అప్ డేట్ చేసుకోవచ్చు. ఆన్ లైన్ లో అప్ డేట్ చేసుకోవడానికి.. యూఐడీఏఐ (UIDAI) అధికారిక వెబ్ సైట్ లోకి వెళ్లి.. సంబంధిత ఖాళీల్లో వివరాలను నింపి ఐడెంటిటీ ప్రూఫ్ ను, అడ్రస్ ప్రూఫ్ ను నిర్ధారిత విధానంలో అప్ లోడ్ చేయాల్సి ఉంటుంది. సాధారణంగా అయితే, ఈ అప్ డేట్ కు రూ. 50 లను యూఐడీఏఐ (UIDAI) చార్జ్ చేస్తుంది.
అప్ డేట్ చేసుకోవడం ఎలా?
ఆధార్ కార్డును ఆన్ లైన్ లో ఉచితంగా అప్ డేట్ చేసుకోవడానికి ముందుగా..
- యూఐడీఏఐ అధికారిక వెబ్ సైట్ https://myaadhaar.uidai.gov.in లోని ఆధార్ సెల్ఫ్ సర్వీస్ పోర్టల్ లోకి వెళ్లాలి.
- ఆధార్ నెంబర్ లేదా వర్చువల్ ఐడీ, కాప్చాలను ఎంటర్ చేసి, ఆ తరువాత రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ కు వచ్చే ఓటీపీని ఎంటర్ చేసి లాగిన్ అవ్వాలి.
- డాక్యుమెంట్ అప్ డేట్ సెక్షన్ లోకి వెళ్లాలి. ప్రస్తుతం మీ వద్ద ఉన్న ఆధార్ కార్డు వివరాలను చెక్ చేసుకోవాలి.
- డ్రాప్ డౌన్ లిస్ట్ లో నుంచి, మీరు అప్ లోడ్ చేయాలనుకుంటున్న డాక్యుమెంట్ టైప్ ను సెలెక్ట్ చేసుకోవాలి.
- అనంతరం, మీ వద్ద ఉన్న డాక్యుమెంట్ స్కాన్ డ్ కాపీలను అప్ లోడ్ చేయాలి.
- సబ్మిట్ బటన్ పై క్లిక్ చేయాలి. సర్వీస్ రిక్వెస్ట్ నెంబర్ ను రాసి పెట్టుకోవాలి. తద్వారా, భవిష్యత్తులో మన అప్లికేషన్ స్టేటస్ ను తెలుసుకోవచ్చు.
టాపిక్