Cyclone Sitrang: ఈశాన్య భారతంలో తుపానుతో విలవిల.. పలు ఇళ్లు ధ్వంసం..
26 October 2022, 10:08 IST
Cyclone Sitrang: సిత్రంగ్ తుపాను కారణంగా సోమవారం నుంచి కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఈశాన్య రాష్ట్రాలు విలవిలలాడుతున్నాయి.
సిత్రంగ్ తుపాను కారణంగా వీచిన గాలులకు పడిపోయిన వెదురు బొంగుల తాత్కాలిక నిర్మాణం
ఈశాన్య భారతదేశంలోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షపాతానికి కారణమైన సిత్రాంగ్ తుఫాను మంగళవారం తెల్లవారుజామున అల్పపీడనంగా బలహీనపడింది. అయితే ఈ ప్రాంతంలోని చాలా రాష్ట్రాలు సోమవారం నుండి అతి భారీ వర్షపాతంతో విలవిలలాడుతున్నాయి. అస్సోం, మేఘాలయ, మిజోరాం, త్రిపురలకు వాతావరణ శాఖ మంగళవారం రెడ్ అలర్ట్ జారీ చేసింది.
‘సిత్రంగ్ మంగళవారం ఉదయం 5:30 గంటలకు అల్పపీడనంగా బలహీనపడింది. ఉదయం 8:30 గంటలకు ఈశాన్య బంగ్లాదేశ్, దానిని ఆనుకుని ఉన్న మేఘాలయలో కేంద్రీకృతమై ఉంది..’ అని ఐఎండీ గౌహతి కార్యాలయం విడుదల చేసిన ఒక ప్రకటన పేర్కొంది.
ఈ ప్రాంతంలోని ఏడు రాష్ట్రాల్లో బుధ, గురువారాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని, ఆ తర్వాత రెండు రోజుల్లో పొడి వాతావరణం ఉంటుందని వాతావరణ విభాగం అంచనా వేసింది.
మణిపూర్‌లోని ఉఖ్రుల్ జిల్లాలో సోమవారం ఇద్దరు మహిళలు వాగు దాటుతుండగా గల్లంతయ్యారు.
సోమవారం సాయంత్రం 4.50 గంటల ప్రాంతంలో మహిళలు తమ వరి పొలాల నుంచి ఇంటికి తిరిగి వస్తుండగా చింగై అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని పోయి గ్రామం వద్ద చల్లౌ నది సమీపంలోని తొలిరు వాగు వద్ద గల్లంతయ్యారు.
తప్పిపోయిన ఇద్దరు మహిళలను ఆర్.ఎస్.వారేచుంగ్ భార్య ఆర్.ఎస్.నమ్రేలా (30), పోయి గ్రామానికి చెందిన ఆర్‌కె మాతోత్మిగా గుర్తించారు.
మణిపూర్ ముఖ్యమంత్రి ఎన్.బీరేన్ సింగ్ సెర్చ్ అండ్ రెస్క్యూ కార్యకలాపాలను కొనసాగించడానికి రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన దళం బృందంతో పాటు రాష్ట్ర పోలీసు బృందాన్ని పంపారు. బీరేన్ సింగ్ కూడా గ్రామస్తులతో ఫోన్‌లో మాట్లాడారు.
సిత్రాంగ్ ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో చాలా చోట్ల తేలికపాటి నుండి మోస్తరు వర్షపాతం నమోదైంది.
ఇక్కడ గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాల వల్ల రాష్ట్రంలో మంగళవారం దీపావళి ఉత్సవాలపై ప్రభావం చూపాయి. అక్టోబర్ 27న జరుపుకునే రాష్ట్రంలోని అతిపెద్ద పండుగ అయిన నింగోల్ చకౌబా కార్యక్రమాలపై కూడా ప్రభావం చూపింది.
మంగళవారం సాయంత్రం వరకు 24 గంటల్లో త్రిపురలోని వివిధ ప్రాంతాల్లో 509 ఇళ్లు దెబ్బతిన్నాయని, ఒకరు గాయపడ్డారని రాష్ట్ర అత్యవసర ఆపరేషన్ కేంద్రం వెల్లడించింది.
దక్షిణ త్రిపుర జిల్లాలో తుఫాను కారణంగా 24 గ్రామాలు, 781 హెక్టార్ల పంట నష్టం జరగడంతో 3,700 మంది ప్రభావితమయ్యారు.
మిజోరంలో ఐజ్వాల్, లుంగ్లీ జిల్లాల్లోని అన్ని పాఠశాలలు మంగళవారం మూసివేశారు. భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున సోమ, మంగళ, బుధవారాల్లో ప్రజలు నదుల్లోకి వెళ్లవద్దని పాలనాధికారులు హెచ్చరికలు జారీ చేశారు.