Cyclone Mandous landfall : తీరం దాటిన మాండూస్.. అల్లకల్లోలంగా చెన్నై!
10 December 2022, 8:46 IST
Cyclone Mandous landfall : తీరం దాటుతూనే.. మాండూస్ తుపాను చెన్నై వీధుల్లో బీభత్సం సృష్టించింది. భారీ వర్షాల కారణంగా చెన్నై సహా తమిళనాడులోని అనేక ప్రాంతాలు జలమయమయ్యాయి.
చెన్నై వీధుల్లో మాండూస్ ఎఫెక్ట్..
Cyclone Mandous landfall : మాండూస్ తుపాను ధాటికి తమిళనాడు విలవిలలాడుతోంది. ముఖ్యంగా చెన్నై వీధుల్లో తుపాను అల్లకల్లోలాన్ని సృష్టించింది! 200కుపైగా చెట్లు కూలాయి. విద్యుత్ సరఫరాకు ఆటంకం ఏర్పడింది. అనేక ప్రాంతాలు జలమయమయ్యాయి. ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలకు ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
శుక్రవారం రాత్రి 10:30 గంటల ప్రాంతంలో మాండూస్ తుపాను.. మహాబలిపురం వద్ద తీరాన్ని దాటింది. అర్ధరాత్రి 1:30 సమయంలో పుదుచ్చేరి- శ్రీహరికోట సమీపంలో తీరాన్ని తాకింది. ఆ సమయంలో గంటకు 75 కి.మీల వేగంతో గాలులు వీచాయి. ఆ తర్వాత తుపాను చెన్నైని తాకింది. మాండూస్ ధాటికి.. శనివారం తెల్లవారుజామున 5:30 గంటల వరకు చెన్నైలో 115.1ఎంఎం వర్షపాతం నమోదైంది.
Cyclone Mandous live updates : భారీ వర్షాల కారణంగా చెన్నై రోడ్లన్నీ జలమయమయ్యాయి. ఈస్ట్ కోస్ట్ రోడ్, జీఎస్టీ రోడ్ తదితర ప్రాంతాల్లో చెట్లు నేలకొరిగాయి. అయితే.. ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపట్టడంతో భారీ ముప్పు తప్పింది.
తుపాను తీరాన్ని తాకకముందే.. 13 దేశీయ, 3 విదేశీ విమానాలను రద్దు చేస్తున్నట్టు చెన్నై విమానాశ్రయం ప్రకటించింది. ప్యాసింజర్లు.. విమానాశ్రయం నుంచి అప్డేట్స్ పొందాలని సూచించింది.
Cyclone Mandous tracker : అయితే.. తీరాన్ని దాటి చెన్నైని తాకిన తర్వాత.. మాండూస్ తుపాను బలహీనపడినట్టు తెలుస్తోంది. ఇంకొన్ని గంటల్లో ఇది వాయుగుండంగా మారి, మరింత బలహీన పడుతుందని సమాచారం. బలహీన పడినప్పటికీ.. చెంగల్పట్టు, కాంచీపూరం, విలుపురం వంటి ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఫలితంగా ఆయా ప్రాంతాలు రెడ్ అలర్ట్ లిస్ట్‌లో ఉన్నాయి. ఈ నేపథ్యంలో 12 జిల్లాల్లోని పాఠశాలలు, కళాశాలలకు సెలవులు ప్రకటించారు అధికారులు.
10 జిల్లాల్లో ఎన్డీఆర్ఎఫ్ బృందాలను మోహరించిన తమిళనాడు ప్రభుత్వం.. రాష్ట్రవ్యాప్తంగా 5వేలకుపైగా సహాయక శిబిరాలను ఏర్పాటు చేసింది. తుపాను తీవ్రత అధికంగా ఉన్న చెంగల్పట్టులోనే 1,058 కుటుంబాలు 28 శిబిరాలకు తరలివెళ్లిపోయారు. అదే సమయంలో 16వేల మంది పోలీసు సిబ్బంది, 1500 మంది హోం గార్డులు, 40మంది సభ్యులతో కూడిన తమిళనాడు డిసాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్‌ను.. ప్రజల భద్రత కోసం వివిధ ప్రాంతాల్లో మోహరించింది. ప్రజలు బయటకు రావద్దని అధికారులు ఆదేశించారు. ప్రజలు నిత్యం అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ సూచించారు.
Cyclone Mandous Chennai news : 1891 నుంచి 2021 వరకు చెన్నై- పుదుచ్చేరి మధ్య 12 తుపానులు తీరాన్ని తాకాయి. మాండూస్ తుపాను 13వది అని భారత వాతావరణశాఖ ప్రాంతీయ కేంద్రం హెడ్ ఎస్ బాలచంద్రన్ పేర్కొన్నారు.
మాండూస్ తుపాను కారణంగా అటు ఆంధ్రప్రదేశ్‌లోని పలు జిల్లాల్లో వర్షాలు పడుతున్నాయి.