G20 summit 2023: న్యూఢిల్లీ డిక్లరేషన్ కు ఏకగ్రీవ ఆమోదం; రష్యా-ఉక్రెయిన్ వార్ పై తొలగిన భేదాభిప్రాయాలు
09 September 2023, 17:19 IST
G20 summit 2023: జీ 20 శిఖరాగ్ర సదస్సు సందర్భంగా విడుదల చేసే జాయింట్ డిక్లరేషన్ కు సభ్య దేశాలు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపాయి. ఈ న్యూఢిల్లీ డిక్లరేషన్ లోని మొత్తం 83 పేరాలను ఎలాంటి అభ్యంతరాలు వ్యక్తం చేయకుండా ఆమోదించాయి.
జీ 20 సదస్సులో ప్రధాని మోదీ
G20 summit 2023: జీ 20 సదస్సు సందర్భంగా భారత్ రూపొందించిన న్యూఢిల్లీ డిక్లరేషన్ కు సభ్య దేశాలు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపాయి. జీ 20 అధ్యక్ష దేశంగా భారత్ కు ఇది గొప్ప విజయంగా భావించవచ్చు. అంతకుముందు, రష్యా, ఉక్రెయిన్ యుద్ధానికి సంబంధించిన పేరాపై కొన్ని అభ్యంతరాలు రాగా, ఆ పేరాలో భారత్ పలు మార్పులు చేసింది.
మోదీ హర్షం
జీ 20 సదస్సు జరుగుతున్న భారత్ మండపం లో సభ్య దేశాల ప్రతినిధుల మధ్య రెండో సెషన్ చర్చ జరుగుతున్న సమయంలో న్యూఢిల్లీ డిక్లరేషన్ కు సభ్య దేశాల ఏకగ్రీవ ఆమోదం లభించిన విషయాన్ని భారత ప్రధాని మోదీ వెల్లడించారు. అందరి సహకారం, కృషితో ఇది సాధ్యమైందన్నారు. ‘‘ఇప్పుడే శుభవార్త తెలిసింది. మా టీమ్స్ కృషి, మీ సహకారంతో న్యూ ఢిల్లీ డిక్లరేషన్ కు ఏకగ్రీవ ఆమోదం లభించింది’’ అని మోదీ ప్రకటించారు. ‘‘ఇందుకు సహకరించిన, కృషి చేసిన భారత మంత్రులు, అధికారుల బృందానికి, షేర్పాలకు, ఇతర అధికారులకు ధన్యవాదాలు’’ అన్నారు.
రష్యా ఉక్రెయిన్ యుద్ధంపై భిన్నాభిప్రాయాలు..
జీ 20 సదస్సులో సభ్య దేశాల అధినేతలు సంయుక్తంగా ప్రకటించాల్సిన న్యూఢిల్లీ డిక్లరేషన్ కు ఏకగ్రీవ ఆమోదం లభించడం కొంత సమస్యగా మారింది. రష్యా - ఉక్రెయిన్ యుద్ధానికి సంబంధించిన అంశంపై డిక్లరేషన్ లో పేర్కొన్న లైన్స్ ను కొన్ని సభ్య దేశాలు, ముఖ్యంగా అమెరికా, యూరోప్ దేశాలు వ్యతిరేకించాయి. దాంతో, ఆ పేరాలో భారత్ పలు మార్పులు చేసింది.