China love leave : 'ప్రేమలో పడండి'.. విద్యార్థులకు వర్సిటీల నోటీసులు!
03 April 2023, 7:55 IST
China love break : ప్రేమలో పడండి అంటూ మీకు మీ యూనివర్సిటీ చెబితే? అంతేకాకుండా.. ఏకంగా వారం రోజుల పాటు సెలవులు ఇస్తే! ఇక పండగే కదా..! చైనాలో ఇప్పుడు ఇదే జరుగుతోంది. ఎందుకంటే..
'ప్రేమలో పడండి'.. విద్యార్థులకు చైనా వర్సిటీల నోటీసులు!
China love leave : 'ప్రేమలో పడండి' అంటూ విద్యార్థులకు పిలుపునిస్తున్నాయి చైనాలోని కొన్ని యూనివర్సిటీలు. ఇందుకోసం ప్రత్యేకంగా సెలవులు కూడా ఇస్తున్నాయి. అయితే ఇందుకు ఓ పెద్ద కారణమే ఉంది. అదేంటంటే..
జననాల రేటును పెంచేందుకు..!
చైనాలో జననాల రేటు ఇటీవలి కాలంలో దారుణంగా పడిపోతోంది. ఈ నేపథ్యంలో అక్కడి ప్రభుత్వం పలు చర్యలు చేపట్టింది. పిల్లలను కనే విధంగా దంపతులను ప్రోత్సహిస్తోంది.
China birth rate decline : ఈ నేపథ్యంలో చెంగ్డూలోని సిచువాన్ సౌత్‌వెస్ట్ వొకేషనల్ కాలేజ్ ఆఫ్ సివిల్ ఏవియషన్ కీలక నిర్ణయం తీసుకుంది. 1 డే టాంబ్ స్వీపింగ్ డే (పూర్వికులను ప్రార్థించే రోజు) కోసం ఏకంగా వారం రోజుల పాటు సెలవులను ఇచ్చింది. 'స్ప్రింగ్ వెకేషన్‌ను ఎంజాయ్ చేయండి.. ప్రేమలో పడండి,' అంటూ ఓ కాలేజ్ సిబ్బందికి, విద్యార్థులకు నోటీసులు ఇచ్చింది. ఈ విషయాన్ని స్థానిక మీడియా సంస్థ వెల్లడించింది. విద్యార్థులు క్లాస్‌రూమ్‌లను వీడి, క్యాంపస్‌లను వదిలి, ప్రకృతిని ఎంజాయ్ చేస్తూ, ప్రేమలో పడేందుకు సెలవులు ఇస్తున్నట్టు సంబంధిత కాలేజ్ పేర్కొంది.
జియామెన్ యూనివర్సిటీ కూడా ఇదే తరహా చర్యలు చేపట్టింది. విద్యార్థలకు వారం రోజుల పాటు సెలవులు ఇచ్చింది. ప్రేమలో పడండి అంటూ పిలుపునిస్తోంది.
China love break : ఈ వార్త చైనా సామాజిక మాధ్యమాల్లో ఇన్స్టెంట్గా వైరల్ అయ్యింది. ఇతర కాలేజీల్లో చదువుకుంటున్న వారు.. ఈ కళాశాల విద్యార్థులపై అసూయపడుతున్నట్టు ఫన్నీగా కామెంట్లు పెడుతున్నారు. తమ కాలేజ్‌లో కూడా ఇలాంటి వెసులుబాటు ఉంటే బాగుండూ అని అభిప్రాయపడుతున్నారు. దేశవ్యాప్తంగా దీనిని అమలు చేయాలని వేడుకుంటున్నారు!
చైనాలో ఆందోళనకరంగా జననాల రేటు..!
చైనాలో జననాల రేటు అత్యంత ఆందోళనకరంగా ఉంది. 2022లో నేషనల్ బార్త్ రేట్ రికార్డ్ స్థాయిలో పతనమైంది. ఆ దేశంలో ప్రతి 1000మంది జనాభాలో 6.77 జననాలు మాత్రమే నమోదవుతున్నాయి. ఇది 6 దశాబ్దాల కనిష్ఠం.
China birth rate love break news : నేషనల్ బ్యూరో ఆప్ స్టాటిస్టిక్స్ (ఎన్బీఎస్) ప్రకారం.. 2022 చివరి నాటికి చైనా జనాభా 1,41,17,50,000కు దగ్గరగా ఉంది. అంతకుముందు ఏడాదితో పోల్చుకుంటే చైనా జనాభా 8,50,000 తగ్గింది.
ఖర్చులు భారీగా పెరిగిపోతుండటం, పని ప్రదేశాల్లో మహిళల సంఖ్య పెరుగుతుండటం, ఉన్నత చదువుల కోసం సమయం కేటాయిస్తుండటం వంటి కారణాలతో.. జననాల రేటు తగ్గుతోందని చైనాలోని పలువురు నిపుణులు అభిప్రాయపడుతున్నారు. పరిస్థితులు ఇలాగే కొనసాగితే కష్టమని చెబుతున్నారు.