తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Bonus: రైల్వే ఉద్యోగులకు బోనస్ ప్రకటించిన కేంద్రం; బోనస్ మొత్తంపై ఉద్యోగ సంఘాల అసంతృప్తి

Bonus: రైల్వే ఉద్యోగులకు బోనస్ ప్రకటించిన కేంద్రం; బోనస్ మొత్తంపై ఉద్యోగ సంఘాల అసంతృప్తి

Sudarshan V HT Telugu

03 October 2024, 21:51 IST

google News
  • ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన గురువారం సమావేశమైన కేంద్ర కేబినెట్ రైల్వే ఉద్యోగులకు శుభవార్త తెలిపింది. దసరా సందర్భంగా రైల్వే ఉద్యోగులకు బోనస్ చెల్లించనున్నట్లు ప్రకటించింది. లోకో పైలట్లు, గార్డులు, స్టేషన్ మాస్టర్లు సహా పలు కేటగిరీల ఉద్యోగులకు ఈ బోనస్ లభిస్తుంది.

రైల్వే ఉద్యోగులకు బోనస్
రైల్వే ఉద్యోగులకు బోనస్

రైల్వే ఉద్యోగులకు బోనస్

రైల్వే ఉద్యోగులకు దసరా పండుగ సందర్భంగా శుభవార్తను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. దాదాపు 11.72 లక్షల మంది ఉద్యోగులకు బోనస్ ఇవ్వనున్నట్లు వెల్లడించింది. రైల్వే ఉద్యోగులకు 78 రోజుల వేతనానికి సమానమైన పెర్ఫార్మెన్స్ లింక్డ్ బోనస్ (PLB) ఇవ్వడానికి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన గురువారం సమావేశమైన కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది.

ఈ కేటగిరీల ఉద్యోగులకు..

రైల్వేలో ట్రాక్ మెయింటెయినర్లు, లోకో పైలట్లు, స్టేషన్ మాస్టర్లు, సూపర్వైజర్లు, టెక్నీషియన్లతో సహా వివిధ కేటగిరీల రైల్వే సిబ్బందికి ఆర్థిక ప్రోత్సాహాన్ని అందించే ఉద్దేశంతో ఈ బోనస్ నిర్ణయాన్ని తీసుకున్నట్లు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. ఈ బోనస్ పొందే ఉద్యోగుల్లో వివిధ కేటగిరీల నాన్ గెజిటెడ్ రైల్వే సిబ్బంది ఉంటారు. వీరిలో ట్రాక్ మెయింటెయినర్లు, లోకో పైలట్లు, రైలు మేనేజర్లు, స్టేషన్ మాస్టర్లు, ఇతర సాంకేతిక సిబ్బంది, మంత్రిత్వ శాఖ ఉద్యోగులు ఉంటారు.

గరిష్టంగా రూ. రూ.17,951

ఈ బోనస్ ను ఒక్కో ఉద్యోగికి గరిష్టంగా రూ.17,951 చెల్లిస్తారు. సాధారణంగా దుర్గా పూజ, దసరా సెలవులకు ముందు కేంద్రం రైల్వే ఉద్యోగులకు బోనస్ ప్రకటిస్తూ ఉంటుంది. ఈ సంవత్సరం 11.72 లక్షల మంది ఉద్యోగులు ఈ బోనస్ తో ప్రయోజనం పొందనున్నారు. ఈ బోనస్ వల్ల ప్రభుత్వంపై రూ.2,028.57 కోట్ల భారం పడనుంది. అయితే, కేంద్రం అందిస్తున్న బోనస్ పై రైల్వే (railway) యూనియన్లు అసంతృప్తిని వ్యక్తం చేశాయి. ఆరో వేతన సంఘం సిఫార్సుల ఆధారంగా కాకుండా, ఏడో వేతన సంఘం సిఫారసుల ఆధారంగా బోనస్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాయి. ఈ మేరకు గురువారం సోషల్ మీడియా ప్రచారాన్ని ప్రారంభించాయి.

7వ వేతన సంఘం సిఫారసులతో కనీస వేతనం

కనీస వేతనం ఆధారంగా, ఆరో వేతన సంఘం సిఫారసుల ప్రకారం ప్రతి ఏటా ఉత్పాదకత ఆధారిత బోనస్ ను పొందుతున్నామని, ఇది అన్యాయమని ఐఆర్ ఈఎఫ్ జాతీయ ప్రధాన కార్యదర్శి సర్వ్ జీత్ సింగ్ అన్నారు. ‘‘బోనస్ గరిష్ట మొత్తం రూ.17,951. దీనిని రూ.7,000 కనీస వేతనంపై లెక్కిస్తారు. ఏడో వేతన సంఘం కనీస వేతనాన్ని రూ.18,000గా నిర్ణయించింది. అందువల్ల రూ. 18 వేల బేసిక్ పే ఆధారంగా బోనస్ ను ప్రకటించాలి’’ అని ఆయన వివరించారు. కొత్త పే స్కేల్ కు అనుగుణంగా గరిష్ట బోనస్ (bonus) మొత్తం రూ.46,159 ఉంటుందని ఐఆర్ ఎస్ టీఎంయూ ప్రధాన కార్యదర్శి అలోక్ చంద్ర ప్రకాశ్ తెలిపారు.

కేంద్రానికి అభ్యర్థనలు

బోనస్ స్ట్రక్చర్ ను సవరించాలని కోరుతూ రైల్వే ఎంప్లాయీ యూనియన్లు సంయుక్తంగా రెండు వారాల క్రితం రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ కు లేఖ రాసింది, కానీ ఇంకా ప్రతిస్పందన రాలేదు. ఫలితంగా తమ డిమాండ్ల పరిష్కారం కోసం ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు కార్మిక సంఘాలు సోషల్ మీడియా వేదికగా ప్రచారాన్ని ప్రారంభించాయి.

తదుపరి వ్యాసం