Dasara Bonus: సింగరేణి కార్మికులకు దసరా కానుక.. ఒక్కొక్కరికి రూ.లక్షా 90 వేలు బోనస్‌-revanth reddy announced dussehra bonus for singareni workers ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Dasara Bonus: సింగరేణి కార్మికులకు దసరా కానుక.. ఒక్కొక్కరికి రూ.లక్షా 90 వేలు బోనస్‌

Dasara Bonus: సింగరేణి కార్మికులకు దసరా కానుక.. ఒక్కొక్కరికి రూ.లక్షా 90 వేలు బోనస్‌

Basani Shiva Kumar HT Telugu
Sep 20, 2024 05:50 PM IST

Dasara Bonus: సింగరేణి కార్మికులకు సీఎం రేవంత్ రెడ్డి బోనస్‌ ప్రకటించారు. ఒక్కొక్కరికి రూ.లక్షా 90 వేలు బోనస్ ఇవ్వనున్నట్టు వెల్లడించారు. తెలంగాణ సాధనలో సింగరేణి కార్మికుల పాత్ర మరువలేనిదని కొనియాడారు. సింగరేణిలో ఉద్యోగులతో పాటు.. కాంట్రాక్టు కార్మికులకు లాభాల్లో వాటా పంచుతామని స్పష్టం చేశారు.

సింగరేణి కార్మికులకు బోనస్
సింగరేణి కార్మికులకు బోనస్

సింగరేణి కార్మికులకు దసరా బోనస్‌ ప్రకటించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. దసరాకు ముందుగానే బోనస్‌ ఇస్తున్నామని చెప్పారు. సింగరేణిలో 33 శాతం లాభాలు పంచుతామన్న ముఖ్యమంత్రి.. ఒక్కొక్కరికి రూ.లక్షా 90 వేలు బోనస్‌ ఇస్తున్నట్టు వెల్లడించారు. రూ.796 కోట్లు బోనస్‌గా అందిస్తామని వివరించారు. గతేడాది కంటే రూ.20 వేలు అధికంగా ఇస్తామని చెప్పారు. సింగరేణి లాభాల్లో కార్మికులకు వాటా ఇస్తామని ప్రకటించారు. తెలంగాణ సాధనలో సింగరేణి కార్మికుల పాత్ర మరువలేనిదని కొనియాడారు.

'తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమాన్ని పతాక స్థాయికి తీసుకెళ్లడంలో.. సింగరేణి కార్మికులు అత్యంత క్రియాశీలక పాత్ర పోషించారు. దసరా ముందు సింగరేణిలో లాభాల వాటా పంచడం ద్వారా.. కార్మికుల కుటుంబాల్లో ఆనందాన్ని నింపుతున్నాం. సింగరేణి కాంట్రాక్టు కార్మికులకూ లాభాల్లో వాటా ఇస్తాం. కాంట్రాక్టు కార్మికులకు మొదటిసారి దసరా బోనస్ రూ.5 వేలు ఇస్తున్నాం' అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు.

'సింగరేణి ఉత్పత్తిని పెంచుతూ ఇతర రాష్ట్రాలకు కూడా బొగ్గు ఎగుమతి చేస్తున్నాం. సింగరేణిని విస్తరిస్తూ కొంత పెట్టుబడి పెట్టే నిర్ణయాన్ని కూడా తీసుకున్నాం. రూ.796 కోట్లు కార్మికులకు, ఉద్యోగులకు బోనస్‌ రూపంలో అందజేస్తాం. ఒక్కొక్క కార్మికుడికి లక్షా 90 వేలు అందజేస్తున్నాం. గతేడాది కంటే రూ.20 వేలు అధికం. సింగరేణిలో 25 వేల మంది కాంట్రాక్ట్‌ కార్మికులు ఉన్నారు. తొలిసారిగా కాంట్రాక్ట్‌ కార్మికులకు కూడా బోనస్‌ ఇస్తున్నాం' అని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క వ్యాఖ్యానించారు.

'సింగరేణిలో 25 వేల కాంట్రాక్ట్ ఉద్యోగులు ఉన్నారు. మానవతా దృక్పథంతో కాంట్రాక్టు కార్మికులకు లాభాల్లో వాటా ఇవ్వాలని నిర్ణయించాం. ఈ నిర్ణయం ద్వారా వారి కుటుంబాల్లో ఆనందం నింపుతున్నాం. తెలంగాణ ప్రభుత్వం అన్ని వర్గాల సంక్షేమం, అభివృద్ధి దిశగా అడుగులు వేస్తోంది' అని భట్టి విక్రమార్క స్పష్టం చేశారు.

అటు వరద బాధితుల సహాయార్థం ముఖ్యమంత్రి సహాయ నిధికి సింగరేణి కాలరీస్ సంస్థ 10 కోట్ల 25 లక్షల 65 వేల 273 రూపాయల భారీ విరాళాన్ని అందించింది. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతో కలిసి సింగరేణి ప్రాంత ఎమ్మెల్యేలు, సంస్థ సీఎండీ, ప్రజా ప్రతినిధులు, కార్మిక సంఘాల నేతలు సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి ఈ విరాళం చెక్కును అందజేశారు. సహాయ కార్యక్రమాల్లో ప్రభుత్వానికి అండగా నిలుస్తూ.. విరాళం ఇచ్చిన సింగరేణి కుటుంబీకులు అందరికీ ముఖ్యమంత్రి కృతజ్ఞతలు తెలిపారు.