Bhagavad Gita park vandalised : కెనడాలోని శ్రీ భగవద్ గీతా పార్కు ధ్వంసం
02 October 2022, 14:08 IST
- Canada Bhagavad Gita park vandalised : కెనడాలో ఇటీవలి కాలంలో హిందువులే టార్గెట్గా విధ్వంసాలు జరుగుతున్నాయి. తాజాగా.. శ్రీ భగవద్ గీతా పార్కును దుండగులు ధ్వంసం చేశారు.
కెనడాలోని శ్రీ భగవద్ గీతా పార్కు ధ్వంసం
Canada Bhagavad Gita park vandalised : కెనడాలో ఇటీవలే ఆవిష్కరించిన శ్రీ భగవద్ గీతా పార్కును కొందరు దుండగులు ధ్వంసం చేశారు. ఈ వార్తను అక్టోబర్ 1న బ్రామ్ప్టన్ మేయర్ పాట్రిక్ బ్రౌన్ ధ్రువీకరించారు.
ఘటనపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు మేయర్ పాట్రిక్ బ్రౌన్. ఇలాంటి వాటిని అస్సలు సహించబోమని అంటూ.. భగవ్ గీతా పార్కు ధ్వంసం ఘటనపై దర్యాప్తునకు ఆదేశించారు. అసలేం జరిగింది? అన్న విషయాన్ని తెలుసుకునేందుకు పీల్ రీజనల్ పోలీస్ అధికారులు రంగంలోకి దిగారు.
Canada Bhagavad Gita park : గత నెల 28వ తేదీన.. ఈ భగవద్ గీతా పార్కును ఆవిష్కరించారు. అంతకుముందు దాని పేరు ట్రోయర్స్ పార్కుగా ఉండేది. ఆవిష్కరణ కోసం దాని పేరు మార్చారు. ఆవిష్కరించిన రెండు రోజులకే కెనడా భగవద్ గీతా పార్కు ధ్వంసం అవ్వడం వార్తలకెక్కింది.
"శ్రీ భగవద్ గీతా పార్కు ధ్వంసమైందన్న విషయం మాకు తెలిసింది. ఇలాంటి వాటిని మేము సహించము. ఘటనపై దర్యాప్తునకు ఆదేశించారు. పార్కు సిబ్బంది.. పరిస్థితిని చక్కదిద్దేందుకు ప్రయత్నిస్తున్నారు," అని మేయర్ ట్వీట్ చేశారు.
3.75ఎకరాల విస్తీర్ణంలో ఈ భగవద్ గీతా పార్కు ఉంది. రంథంపై ఉన్న కృష్ణుడు, అర్జునుడి విగ్రహాలను పెట్టేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇతర హిందూ దేవుళ్ల విగ్రహాలను కూడా ప్రతిష్టించేందుకు చర్యలు చేపడుతున్నారు. నగరం అభివృద్ధి కోసం హిందూ సమాజం చేసిన కృషికి చిహ్నంగా పార్కును ఈ విధంగా తీర్చిదిద్దాలని నిర్ణయించినట్టు.. ఆవిష్కరణ సమయంలో మేయర్ పాట్రిక్ బ్రౌన్ వెల్లడించారు.
కెనడాలో పెరుగుతున్న నేరాలు..
Hate crime on Hindus in Canada : కెనడాలో ఇటీవలి కాలంలో హేట్ క్రైమ్ పెరుగుతోంది! ముఖ్యంగా హిందూ ఆలయాలను టార్గెట్గా చేసుకుని దుండగులు రెచ్చిపోతున్నారు. ఈ విషయం భారత ప్రభుత్వం దృష్టికి కూడా వచ్చింది. కెనడాకి వెళ్లేవారు జాగ్రత్తగా ఉండాలని భారతీయులకు సూచనలు కూడా జారీ చేసింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
నేరాలకు పాల్పడుతున్న వారిని అక్కడి ప్రభుత్వం ఇంకా శిక్షించకపోవడం ఆందోళనకర విషయం అని భారత విదేశాంగ శాఖ వ్యాఖ్యనించింది.
హిందూ ఆలయాలపై జరుగుతున్న ఘటనలపై కెనడా ఎంపీలు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ సమస్యకు పరిష్కారాన్ని త్వరగా వెతకాలని డిమాండ్లు చేస్తున్నారు.
కెనడాలో ఇటీవలి కాలంలో ఉద్యోగ అవకాశాలు భారీగా పెరుగుతున్నాయి. ఫలితంగా అక్కడికి వలసలు కూడా పెరుగుతున్నాయి. వారిలో భారతీయులు కూడా ఉంటున్నారు. ఈ నేపథ్యంలో.. కెనడాలో పరిస్థితులు ఆవేదనకు గురిచేస్తున్నాయి.