Donald Trump: ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా పోటీ చేయగలరా?.. కొలరాడో కోర్టు తీర్పు ప్రభావమేంటి?
20 December 2023, 13:53 IST
- Donald Trump: 2024 అమెరికా అధ్యక్ష ఎన్నికలలో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిగా బరిలో నిలవాలన్న అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆశలను కొలరాడో కోర్టు తీర్పు నీరు గార్చిందా? ఇంతకూ అధ్యక్ష ఎన్నికలలో ట్రంప్ పోటీ చేయడం వీలు అవుతుందా?
అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్
Donald Trump: 2021 లో క్యాపిటోల్ పై జరిగిన దాడికి బాధ్యుడిగా నిర్ధారిస్తూ, అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయడానికి డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) అనర్హుడని కొలరాడో సుప్రీంకోర్టు సంచలన తీర్పును ఇచ్చింది. అయితే, ఈ తీర్పుతో 2024 అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేసే అర్హతను ట్రంప్ కోల్పోతారా? అన్న ప్రశ్న ఇప్పుడు అందరినీ వేధిస్తోంది.
ఆ సెక్షన్ కింద చరిత్రలోనే తొలి తీర్పు..
రాజ్యాంగంలోని 14వ సవరణకు సంబంధించిన సెక్షన్ 3 కింద కొలరాడో సుప్రీంకోర్టు ఈ తీర్పును ఇచ్చింది. అమెరికా చరిత్రలో ఒక వ్యక్తి అధ్యక్ష ఎన్నికలలో పాల్గొనడానికి అనర్హుడని ఈ సెక్షన్ ఆధారంగా ఒక కోర్టు తీర్పును ఇవ్వడం ఇదే ప్రథమం. 2021లో క్యాపిటోల్ బిల్డింగ్ పై ట్రంప్ (Donald Trump) మద్ధతుదారుల దాడికి సంబంధించి ట్రంప్ ను బాధ్యుడిని చేస్తూ, ఈ తీర్పును కోర్టు వెలువరించింది.
అపీల్ కు అవకాశం..
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో (US Presidential polls 2024) పోటీ చేయడానికి అనర్హుడని తాము ఇచ్చిన తీర్పుపై డొనాల్డ్ ట్రంప్ అమెరికా సుప్రీంకోర్టులో అపీల్ చేసుకోవచ్చని కొలరాడో సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అందుకు జనవరి 4వ తేదీ వరకు వీలు కల్పించింది. ఒకవేళ, ట్రంప్ అపీల్ కు వెళ్తే, ఈ విషయంపై అమెరికా సుప్రీంకోర్టు తీర్పు వెలువరించేవరకు కొలరాడో ప్రెసిడెన్షియల్ ప్రైమరీ బ్యాలట్ లో ట్రంప్ పేరును తీసివేయవద్దని సంబంధిత అధికారులను ఆదేశించింది. కొలరాడో కోర్టు తీర్పుపై అపీల్ కు వెళ్తామని ఇప్పటికే ట్రంప్ లీగల్ టీమ్ ప్రకటించింది.
మిగతా రాష్ట్రాల్లోనూ..
అయితే, కొలరాడో కోర్టు తీర్పు వల్ల ట్రంప్ అమెరికా అధ్యక్ష ఎన్నికల బరి నుంచి వైదొలగాల్సిన అవసరం లేదు. మిగతా రాష్ట్రాల్లో అభ్యర్థిగా కొనసాగి, మెజారిటీ సాధించవచ్చు. నిజానికి గతంలో కూడా ట్రంప్ నకు కొలరాడోలో పెద్దగా ఓట్లు రాలేదు. కొలరాడో డెమొక్రాట్ల ఆధిపత్యం ఉన్న రాష్ట్రం. కానీ, ట్రంప్ ను అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయకుండా అనర్హుడిగా ప్రకటించాలని కోరుతూ, మినెసోటా, మిషిగన్, ఆరెగాన్ తదితర చాలా రాష్ట్రాల్లోని కోర్టుల్లో పిటిషన్లు దాఖలై ఉన్నాయి. ఆ రాష్ట్రాల్లో కొన్ని ట్రంప్ నకు గట్టి పట్టు ఉన్న రాష్ట్రాలు. ఒక వేళ ఆ రాష్ట్రాల్లోని కోర్టులు సైతం కొలరాడో సుప్రీంకోర్టు తీర్పును ఆధారంగా తీసుకుని ట్రంప్ ను అనర్హుడిగా ప్రకటిస్తే, అప్పుడు సమస్య ఎదురవుతుంది.