Rahul Gandhi on security breach: బుల్లెట్ ప్రూఫ్ కార్లో పాదయాత్ర ఎలా చేస్తారు?
31 December 2022, 21:18 IST
Rahul Gandhi on security breach: భారత్ జోడో యాత్ర సందర్భంగా భద్రత నిబంధనల ఉల్లంఘనలపై కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ స్పందించారు. బీజేపీ నేతలకు ఒక రూల్, విపక్ష నాయకులకు ఒక రూల్ పాటిస్తున్నారని విమర్శించారు.
కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ
Rahul Gandhi on security breach: కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర సందర్భంగా ఢిల్లీలో సెక్యూరిటీ ఉల్లంఘనలపై వివాదం కొనసాగుతోంది. యాత్రలో ఢిల్లీ పోలీసులు, సీఆర్ పీఎఫ్ సరిగ్గా విధులు నిర్వర్తించడం లేదని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. బదులుగా, సెక్యూరిటీ ప్రొటోకాల్ ను రాహుల్ గాంధీనే ఉల్లంఘిస్తున్నారని సీఆర్ పీఎఫ్ వాదిస్తోంది. ఈ మేరకు సీఆర్ పీఎఫ్ (Central Reserve Police Force) ఉన్నతాధికారులు రాహుల్ గాంధీకి లేఖ రాశారు.
Rahul Gandhi on security breach: బుల్లెట్ ప్రూఫ్ కారులో..
భారత్ జోడో యాత్రలో సెక్యూరిటీ ప్రొటోకాల్ ను రాహుల్ గాంధీనే ఉల్లంఘిస్తున్నారన్న సీఆర్పీఎఫ్ ఆరోపణలపై రాహుల్ గాంధీ స్పందించారు. తాను చేస్తోంది పాద యాత్ర అని, బుల్లెట్ ప్రూఫ్ కారులో కూర్చుని పాదయాత్ర ఎలా చేస్తారని ప్రశ్నించారు. బీజేపీ నేతలు నిబంధనలు ఉల్లంఘించి చేపడ్తున్న రోడ్ షోలు, ఓపెన్ టాప్ వెహికిల్ రోడ్ షోలపై ఫిర్యాదు ఎందుకు చేయడం లేదన్నారు. వేరు వేరు పార్టీల నేతలకు వేరువేరు నిబంధనలు ఉన్నట్లున్నాయని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. డబ్బుతోనో, అధికారంతోనో నిజాలను అణచివేయడం సాధ్యం కాదని గుర్తుంచుకోవాలన్నారు.
Rahul Gandhi on foot march: పాద యాత్రలో చాలా నేర్చుకున్నా..
భారత్ జోడో యాత్ర పేరుతో పాదయాత్ర ద్వారా తాను ఎంతో నేర్చుకున్నానని రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. పాద యాత్రను ఎలాంటి ముందస్తు అంచనాలు లేకుండా ప్రారంభించానన్నారు. కానీ ఈ పాదయాత్ర తనకు ఎన్నో పాఠాలను నేర్పించిందన్నారు. ఈ పాదయాత్ర భారతీయుల భావోద్వేగాలకు ప్రతీక అని అభివర్ణించారు. భారత్ జోడో యాత్ర సెప్టెంబర్ 7న తమిళనాడులోని కన్యాకుమారిలో ప్రారంభమైంది. డిసెంబర్ 31 నాటికి యాత్ర 150 రోజులకు చేరింది.
Rahul Gandhi onopposition Unity: బీజేపీపై వ్యతిరేకత ఉంది
కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయి ప్రజాస్వామ్య పార్టీ అని, పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో పార్టీ స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకుంటుందని రాహుల్ వివరించారు. రాజస్తాన్ లో పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలన్న నిర్ణయం లాంటివి తీసుకోవాలనుకుంటే, ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు పార్టీ హై కమాండ్ నుంచి అనుమతి తీసుకోవాల్సిన అవసరం ఉండబోదన్నారు. ఇందులో జాతీయ నాయకత్వం జోక్యం చేసుకోబోదన్నారు. విపక్షాల తరఫున ప్రధాని అభ్యర్థిగా ఉండడంపై స్పందిస్తూ.. ప్రస్తుతం తన దృష్టి అంతా విద్వేషంపై, అసహనంపై పోరాటం చేయడంపైననే ఉందన్నారు. అయితే, విపక్షం అంతా ఏకమైతే, బీజేపీ గెలుపు అసాధ్యమవుతుందని వివరించారు. దేశవ్యాప్తంగా బీజేపీ వ్యతిరేకత కనిపిస్తోందన్నారు.