Fake IT job offers : విదేశాల్లో 'ఫేక్’ ఐటీ జాబ్స్‌తో తస్మాత్ జాగ్రత్త..!
24 September 2022, 13:44 IST
- Beware of fake IT job offers : మయన్మార్, థాయ్‌లాండ్ నుంచి ఐటీ ఉద్యోగాల ఆఫర్లు వస్తున్నాయని, అవి ఫేక్ అని కేంద్రం వెల్లడించింది. ఇలా అనేకమంది భారతీయులు మోసపోయారని, అందరు జాగ్రత్తగా ఉండాలని సూచించింది.
ఫేక్ ఐటీ జాబ్ ఆఫర్లపై తస్మాత్ జాగ్రత్త..!
Centre advisory on fake IT job offers : ఫేక్ ఐటీ జాబ్ ఆఫర్లతో జాగ్రత్తగా ఉండాలని భారతీయులకు కేంద్ర ప్రభుత్వం సూచనలు జారీ చేసింది. తప్పుడు సంస్థల పేరుతో థాయ్‌లాండ్, మయన్మార్‌లలో ఐటీ ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పి కొందరు భారీగా మోసం చేస్తున్నారని హెచ్చరించింది.
వాస్తవానికి విదేశాల్లో ఫేక్ ఐటీ జాబ్ ఆఫర్స్ వ్యవహారం గత కొంతకాలంగా ఇండియాలో సమస్యగా మారింది. ఉద్యోగానికి ఆశ పడి చాలా మంది ముందు వెనక చూసుకోకుండా.. లక్షల కొద్ది డబ్బులు అప్పజెబుతున్నారు. అలా డబ్బులు కట్టిన వారిని మయన్మార్‌కు తీసుకెళ్లి కూలీల కింద వాడుకుంటున్న ఉదంతాలు బయటకొచ్చాయి. ఈ విధంగా మోసపోతున్నారు. ఈ విషయంపై రెండు రోజుల క్రితమే.. విదేశాంగశాఖ ప్రతినిధి ఆరిందమ్ బగ్చి సైతం స్పందించారు. థాయ్‌లాండ్, మయన్మార్‌లో ఉద్యోగాల విషయంలో జ్రాగత్తగా ఉండాలని భారత యువతకు సూచించారు.
Fake IT jobs Myanmar : "ఈ విధంగా చాలా మంది థాయ్‌లాండ్, మయన్మార్‌కు వెళుతున్నారు. మయన్మార్‌లో ఇది చాలా ఎక్కువగా ఉంది. కూలీలుగా ఉన్న 30మందిని మేము రక్షించాము. ఇంకో 80-90మంది అక్కడే ఉండొచ్చు. మా ప్రయత్నాలు మేము చేస్తున్నాము. భద్రతా పరమైన సమస్యలు ఉండటంతో పరిస్థితులు మరింత ప్రతికూలంగా ఉన్నాయి. అందరు జాగ్రత్తగా ఉండాలి. ఫేక్ ఐటీ జాబ్‌లను నమ్మకూడదు," అని విదేశాంగశాఖ ప్రతినిధి వెల్లడించారు.
ఇక తాజాగా శనివారం కేంద్రం విడుదల చేసిన అడ్వైజరీ సైతం.. ఆయా జాబ్ రాకెట్లతో జాగ్రత్తగా ఉండాలని స్పష్టం చేసింది. ముఖ్యంగా ఐటీ రంగంలో నైపుణ్యం ఉన్న యువతను ఆకర్షించి, మోసం చేస్తున్నారని పేర్కొంది. సోషల్ మీడియాలో వస్తున్న పోస్టులను చూసి మోసపోకూడదని, వాటిని నమ్మవద్దని సూచించింది.
Fake IT jobs Thailand : "ఉద్యోగాల కోసం టూరిస్ట్ వీసాల మీద వెళ్లాలని అనుకుంటున్న భారతీయులకు అలర్ట్. ఆ విదేశీ యాజమాన్యంపై పక్కా సమాచారం తీసుకోవాలి. ఏజెంట్లకు సంబంధించిన పూర్తి వివరాలను కూడా సేకరించాలి," అని ప్రభుత్వం స్పష్టం చేసింది.
మయన్మార్‌లోని భారత రాయబార కార్యాలయం కూడా ఈ విషయంపై అడ్వైజరీని జారీ చేసింది. మయన్మార్‌లోని తూర్పు సరిహద్దు కేంద్రంగా డిజిటల్ స్కామింగ్కు పాల్పడుతున్న పలు కంపెనీల పేర్లను బయటపెట్టింది.