అయోధ్య రామమందిరం: గర్భగుడిలోని 18 ద్వారాలకు బంగారు పూత
17 December 2023, 7:08 IST
అయోధ్య రామ జన్మభూమిలోని రామ మందిరంలో భాగంగా నిర్మాణంలోఉన్న గర్భగుడిలో తలుపులకు బంగారు పూత పూయనున్నారు.
రామ మందిరంలోని గర్భగుడి (FILE PHOTO)
రామాలయ గర్భగుడిలో ఏర్పాటు చేసిన తలుపులకు బంగారు పూత పూయనున్నారు. జనవరి మొదటి వారంలో రామ్ లల్లా విగ్రహ ప్రతిష్ఠకు ముందు ఈ పని పూర్తవుతుంది. రామ మందిర గర్భగుడిలో 46 ద్వారాలు ఉండగా, గ్రౌండ్ ఫ్లోర్ లో 18 గేట్లను గోల్డ్ ప్లేట్ చేయనున్నారు. గర్భగుడిలో రామ్ లల్లా విగ్రహాన్ని ప్రతిష్ఠించి, ప్రాణ ప్రతిష్ఠ (ప్రతిష్ఠా కార్యక్రమం)లో చివరి ఆచారాన్ని జనవరి 22న ప్రధాని నరేంద్ర మోదీ నిర్వహించనున్నారు.
ఈ తలుపులన్నీ మహారాష్ట్రలోని చంద్రాపూర్ కు చెందిన ప్రత్యేక టేకు చెక్కలతో తయారు చేశారు. వీటిని హైదరాబాద్ కు చెందిన కళాకారులు చెక్కారు. గ్రౌండ్ ఫ్లోర్ లో ఏర్పాటు చేసిన తలుపులపై చక్కటి రాగి పొరను పూసి ఆ తర్వాత వాటిని గోల్డ్ ప్లేట్ చేస్తారు.
శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ సభ్యుడు అనిల్ మిశ్రా మాట్లాడుతూ, "తలుపులకు ఉపయోగించే బంగారం ఆలయానికి భక్తులు సమర్పించిన దాని నుండే ఉంటుంది" అని చెప్పారు. తలుపులకు ఎంత మొత్తంలో బంగారం పూస్తున్నారన్న ప్రశ్నకు మిశ్రా సమాధానమిస్తూ.. 'నా వద్ద ఆ వివరాలు లేవు' అని సమాధానమిచ్చారు.
అయోధ్య తీర్పు తర్వాత భక్తుల సంఖ్య క్రమంగా పెరుగుతోందని, పెద్ద మొత్తంలో నగదుతో పాటు, భక్తులు బంగారం, వెండి, ఇతర విలువైన వస్తువులను కూడా సమర్పిస్తున్నారని తెలిపారు. జనవరి మొదటి వారం నాటికి ఈ బంగారు పూత తలుపులు సిద్ధమవుతాయని శ్రీ రామజన్మభూమి తీర్థ క్షేత్ర కార్యాలయ ఇంచార్జ్ ప్రకాశ్ గుప్తా తెలిపారు.
గర్భగుడి తలుపులకు బంగారు ప్లేట్లు పూసే బాధ్యతను ఘజియాబాద్ కు చెందిన జువెలర్స్ సంస్థకు అప్పగించామని, ఏడు తలుపులు పూర్తయ్యాయని, మిగిలినవి పక్షం రోజుల్లో పూర్తవుతాయని సంబంధిత వర్గాలు తెలిపాయి.