Ayodhya Ram Temple: జనవరి 22న అంగరంగ వైభవంగా అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం; ఆహ్వాన పత్రాలు సిద్ధం
Ayodhya Ram Temple: అయోధ్యలోని రామ మందిర ప్రతిష్ఠాపనకు సంబంధించిన ఆహ్వాన పత్రాల పంపిణీ ప్రారంభమైంది. అయోధ్య లో రామ మందిర ప్రారంభోత్సవ కార్యక్రమం జనవరి 22, 2024న ఘనంగా జరగనుంది.
Ayodhya Ram Temple: అయోధ్యలో జనవరి 22, 2024న జరిగే రామ మందిర ప్రారంభోత్సవ కార్యక్రమంలో ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్య నాథ్ సహా పలువురు ప్రముఖులు పాల్గొంటున్నారు.
మూడేళ్ల తరువాత..
అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి 2020 ఆగస్టులో ప్రధాని మోదీ శంకుస్థాపన చేశారు. మూడేళ్ల అనంతరం, రామమందిరం (Ayodhya Ram Temple) ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. ఉత్తరప్రదేశ్‌లోని పవిత్ర పట్టణం అయోధ్యలో జరిగే ప్రారంభోత్సవ వేడుక కోసం ఆహ్వాన పత్రాలు సిద్ధమయ్యాయి. దేశవ్యాప్తంగా సాధు సంతులు, స్వామీజీలు, మఠాధిపతులు, పూజారులు, దాతలు, పలువురు రాజకీయ నాయకులతో సహా మొత్తం 6,000 మంది అతిథులకు ఆహ్వానం పంపిస్తున్నారు.
రాష్ట్రవ్యాప్తంగా కార్యక్రమాలు..
అయోధ్యలో రామాలయ ప్రారంభోత్సవం సందర్భంగా ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా పలు కార్యక్రమాలు చేపట్టింది. జనవరి నెలలో 14వ తేదీ నుంచి 22వ తేదీ వరకు రాష్ట్రంలోని ప్రధాన ఆలయాల్లో అఖండ రామాయణం, హనుమాన్ చాలీసా పారాయణం కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. జనవరి 22న నూతనంగా నిర్మించిన రామమందిరంలో శ్రీరాముని విగ్రహాన్ని అంగరంగ వైభవంగా ప్రతిష్టించనున్నారు. ఆ రోజు అనేక ఉత్సవాలు నిర్వహించనున్నారు.
సుప్రీంకోర్టు తీర్పు..
దశాబ్దాలుగా కొనసాగిన బాబ్రీ మసీదు - రామ మందిరం వివాదం 2019 లో సుప్రీంకోర్టు ఇచ్చిన చరిత్రాత్మక తీర్పుతో ముగిసింది. సుప్రీంకోర్టు తీర్పుతో రామ మందిర నిర్మాణానికి అన్ని అడ్డంకులు ముగిశాయి. సుప్రీంకోర్టు తీర్పును అనుసరించి, ఆలయ నిర్మాణంపై అన్ని నిర్ణయాలు తీసుకోవడానికి కేంద్రం శ్రీరామ జన్మ భూమి తీర్థ క్షేత్ర' ట్రస్ట్‌ను ఏర్పాటు చేసింది.
ఆగస్ట్ 5, 2020 నుంచి..
ఆలయ నిర్మాణానికి ప్రధాని మోదీ శంకుస్థాపన చేయడంతో నిర్మాణ పనులు ఆగస్ట్ 5వ తేదీ నుంచి ప్రారంభమయ్యాయి. 1998లో అహ్మదాబాద్‌లోని సోంపురా కుటుంబం రూపొందించిన డిజైన్ ఆధారంగా రామమందిర నిర్మాణం చేపట్టారు. ఆ తరువాత ఆ డిజైన్ కు 2020లో కొన్ని మార్పులు చేశారు. ఇది కాకుండా, రామ మందిర ప్రారంభోత్సవానికి ముందు రామజన్మభూమికి థాయ్‌లాండ్ ప్రభుత్వం ప్రత్యేకంగా పవిత్ర మట్టిని పంపిస్తోంది. గతంలో, థాయ్‌లాండ్‌లోని రెండు నదుల నుండి రాముని ఆలయానికి నీటిని కూడా పంపించింది.