Liquor scam | శుక్రవారం ఢిల్లీ అసెంబ్లీ ప్రత్యేక సమావేశం
24 August 2022, 22:42 IST
రాజకీయ ప్రకంపనల నేపథ్యంలో శుక్రవారం ఢిల్లీ అసెంబ్లీ ప్రత్యేకంగా సమావేశం కానుంది. తమ ప్రభుత్వాన్ని కూల్చాలని బీజేపీ ప్రయత్నిస్తోందన్న ఆప్ ఆరోపణలు, లిక్కర్ స్కామ్‌లో ఢిల్లీ డెప్యూటీ సీఎం సిసోడియా పాత్రపై బీజేపీ విమర్శలు సంచలనం సృష్టిస్తున్న సమయంలో ఈ సమావేశాలు జరుగుతున్నాయి.
మనీశ్ సిసోడియా
ఢిల్లీ అసెంబ్లీ ఈ శుక్రవారం ప్రత్యేకంగా సమావేశం కానుంది. ఆగస్ట్ 26 న ఉదయం 11 గంటల నుంచి అసెంబ్లీ ప్రత్యేక సమావేశం ఉంటుంది.
Liquor scam | ఎమ్మెల్యేల కొనుగోలు..
ఆప్ ఎమ్మెల్యేలు నలుగురిని కొనుగోలు చేసేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని ఆప్ విమర్శిస్తోంది. ఒక్కో ఎమ్మెల్యేకు రూ. 25 కోట్ల వరకు ఇవ్వడానికి బీజేపీ నేతలు బేరసారాలు చేశారని ఆప్ నేతలు ఆరోపిస్తున్నారు. ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి, ఢిల్లీలో ఆప్ ప్రభుత్వాన్ని కూలదోయడానికి బీజేపీ కుట్ర చేస్తోందని, అందులో భాగంగానే పార్టీ సీనియర్ నేత మనీశ్ సిసోడియాకు ఆఫర్ ఇచ్చారని ఆప్ ఆరోపిస్తోంది. పార్టీని చీల్చాలని బీజేపీ తనను కోరిందని సిసోడియా కూడా ఆరోపించిన విషయం తెలిసిందే. అయితే, ఈ ఆరోపణలను బీజేపీ తోసిపుచ్చింది. తన ప్రభుత్వాన్ని కూలదోయాలనే కుట్ర చాలా సీరియస్ అంశమని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ వ్యాఖ్యానించారు. బుధవారం ఆయన ఇంట్లో పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశం జరిగింది.
Liquor scam | లిక్కర్ స్కామ్
మరోవైపు 2021 -22 ఢిల్లీ ఎక్సైజ్ పాలసీకి సంబంధించి జరిగిన అవకతవకలపై సీబీఐ పెట్టిన కేసు ఆధారంగా ఈడీ కూడా ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా సహా 15 మందిపై మనీ లాండరింగ్ కేసు నమోదు చేసింది. ఆగస్ట్ 19న ఈ కేసుకు సంబంధించి సీబీఐ సిసోడియా సహా పలువురి ఇళ్లపై దాడులు చేసింది. ఢిల్లీ ప్రభుత్వంలో ఎక్సైజ్ శాఖను సిసోడియానే చూస్తున్నారు.