తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Arpita Mukherjee : ఖరీదైన నివాసంలో అర్పితా ముఖర్జీ.. పాడుబడిన ఇంట్లో అమె తల్లి!

Arpita Mukherjee : ఖరీదైన నివాసంలో అర్పితా ముఖర్జీ.. పాడుబడిన ఇంట్లో అమె తల్లి!

Sharath Chitturi HT Telugu

30 July 2022, 11:53 IST

    • Arpita Mukherjee : పార్థా ఛటర్జీ సన్నిహితురాలిగా పేరొందిన అర్పితా ముఖర్జీకి విలాసవంతమై ఇళ్లు ఎన్నో ఉన్నాయి. కానీ ఆమె తల్లి మాత్రం.. ఓ పాడుబడిన ఇంట్లో నివాసముంటున్నారు.
పార్థ ఛటర్జీతో అర్పితా ముఖర్జీ
పార్థ ఛటర్జీతో అర్పితా ముఖర్జీ (ANI)

పార్థ ఛటర్జీతో అర్పితా ముఖర్జీ

Arpita Mukherjee : పార్థా ఛటర్జీ, అర్పితా ముఖర్జీల వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ముఖ్యంగా అర్పితపై ఫోకస్​ ఎక్కువగా ఉంటోంది. ఆమె నివాసాల్లోంచి రోజురోజుకు భారీగా నగదు బయటపడుతుండటం ఇందుకు కారణం. ఆమెకు పశ్చిమ బెంగాల్​లో అనేక ఇళ్లులు ఉన్నాయి. అవన్నీ ఖరీదైన, విలాసవంతమైన ప్రాంతాల్లోనే ఉన్నాయి! కాగా.. ఆమె తల్లి మాత్రం.. ఓ పాడుబడిన ఇంట్లో జీవిస్తోంది.

ఉపాధ్యాయ నియామకాల స్కామ్​లో భాగంగా.. పార్థా ఛటర్జీని ఈడీ అధికారులు గత వారం అరెస్ట్​ చేశారు. ఆయనకు అత్యంత సన్నిహితంగా ఉండే బెంగాల్​ నటి అర్పితా ముఖర్జీ ఇళ్లల్లోనూ సోదాలు నిర్వహించారు. ఈ క్రమంలో ఇప్పటికే రూ. 50కోట్లకుపైగా నగదు, భారీ మొత్తంలో విలువ చేసే ఆభరణాలు బయటపడ్డాయి.

ఫలితంగా అర్పితా ముఖర్జీపై అందరి చూపూ పడింది. అయితే ప్రముఖ వార్తా సంస్థ ఇండియా టుడే.. అర్పితా ముఖర్జీ వ్యక్తిగత జీవితం గురించి మరిన్ని వివరాలను రాబట్టింది. ఈ క్రమంలోనే ఆమె తల్లి.. ఉత్తర 24 పరగణాలోని బెల్ఘోరియాలో జీవిస్తున్నట్టు తెలుసుకుంది. ఆమెను ఇంటర్వ్యూ చేసేందుకు వెళ్లింది.

అర్పితా ముఖర్జీ విలాసవంతమైన ఫ్లాట్​లో జీవిస్తుండగా.. ఆమె తల్లి మినతి ముఖర్జీ.. 50ఏళ్ల నాటి పాడుబడిన ఇంట్లో నివాసముంటున్నారు. ఆ ఇంటిని చూస్తేనే చాలా పాతదిగా తెలిసిపోతుంది.

"వారం రోజుల ముందే అర్పిత ఇక్కడికి వచ్చింది. ఇక్కడికి ఎక్కువగా రాదు. తన ఇంట్లోనే నివాసముంటుంది," అని మినతి చెప్పుకొచ్చింది.

ఈ క్రమంలోనే అర్పితా ముఖర్జీపై ఈడీ చర్యల గురించి ఆమె తల్లి స్పందించారు.

"నేను చెప్పింది అర్పిత విని ఉంటే.. ఈపాటికి తన పెళ్లి చేసేసేదానిని. నా భర్త ఓ ప్రభుత్వ ఉద్యోగి. ఆ ఉద్యోగం తనకి వచ్చేది. కానీ అర్పితకు ఇవేవీ నచ్చవు. ఎన్నోఏళ్ల క్రితమే ఈ ఇంటిని విడిచిపెట్టి వెళ్లిపోయింది. స్కామ్​ గురించి నాకు తెలియదు. అర్పితతో మాట్లాడినప్పుడు కనుక్కుంటాను," అని మినతి వివరించారు.

అనారోగ్యంతో ఉన్న తల్లిని అర్పిత అప్పుడప్పుడు కలిసేవారని, 2-3 గంటలు ఉండి వెళ్లిపోయేవారని స్థానికులు చెప్పారు. మినతిని చూసుకునేందుకు ఇద్దరు సహాయకులను అర్పిత నియమించినట్టు వెల్లడించారు.

తదుపరి వ్యాసం