Partha Chatterjee: కేబినెట్ నుంచి పార్థ ఛటర్జీ తొలగింపు-arrested bengal minister partha chatterjee sacked from cabinet ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Partha Chatterjee: కేబినెట్ నుంచి పార్థ ఛటర్జీ తొలగింపు

Partha Chatterjee: కేబినెట్ నుంచి పార్థ ఛటర్జీ తొలగింపు

HT Telugu Desk HT Telugu
Jul 28, 2022 05:05 PM IST

సంచ‌ల‌నం సృష్టించిన ప్రాథ‌మిక‌, ఉన్న‌త పాఠ‌శాల‌ల ఉపాధ్యాయుల నియామ‌క ప‌రీక్ష( School Service Commission - SSC) కుంభ‌కోణంలో నిందితుడిగా తేలిన సీనియ‌ర్ మంత్రి పార్థ ఛటర్జీపై ముఖ్య‌మంత్రి మ‌మ‌త బెన‌ర్జీ వేటు వేశారు.

మంత్రి సన్నిహితురాలు అర్పితా ముఖర్జీ ఫ్లాట్ నుంచి ఈడీ స్వాధీనం చేసుకున్న 27.9 కోట్ల రూపాయల నగదు
మంత్రి సన్నిహితురాలు అర్పితా ముఖర్జీ ఫ్లాట్ నుంచి ఈడీ స్వాధీనం చేసుకున్న 27.9 కోట్ల రూపాయల నగదు (ANI)

ఈ కుంభ‌కోణం దేశ‌వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టించింది. పార్థ చ‌ట‌ర్జీ స‌న్నిహితురాలు అర్పిత ముఖ‌ర్జీ ఇంట్లో దాద‌పు రూ. 50 కోట్ల న‌గ‌దును ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. పార్థ చ‌టర్జీ, ఆర్పిత ముఖ‌ర్జీల‌ను అరెస్ట్ చేశారు.

మంత్రి ప‌ద‌వి నుంచి తొల‌గింపు

ఈ నేప‌థ్యంలో పార్థ చ‌ట‌ర్జీని మ‌మ‌త త‌న మంత్రివ‌ర్గం నుంచి తొల‌గించారు. ఆయ‌న నిర్వ‌హిస్తున్న ప‌రిశ్రమలు, వాణిజ్యం, ఇన్‌ఫర్మేషన్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్, పబ్లిక్ ఎంటర్‌ప్రైజెస్, పారిశ్రామిక పునర్నిర్మాణ శాఖ(ఇన్‌ఛార్జ్) మంత్రిత్వ శాఖ‌ల బాధ్య‌త‌ల‌ నుంచి తొల‌గించారు. ఆ శాఖ‌ల బాధ్య‌త‌ల‌ను తాత్కాలికంగా తానే చేప‌ట్టిన‌ట్లు మ‌మ‌త వెల్ల‌డించారు. గురువారం ఉద‌యం జ‌రిగిన కీల‌క కేబినెట్ భేటీ అనంత‌రం మ‌మ‌త బెన‌ర్జీ ఈ నిర్ణ‌యం తీసుకున్నారు. త‌మ పార్టీ అవినీతిని స‌హించ‌బోద‌ని ఈ సంద‌ర్భంగా మ‌మ‌త స్ప‌ష్టం చేశారు.

క‌ట్ట‌ల కొద్దీ న‌గ‌దు

ప‌శ్చిమ‌బెంగాల్ ప్ర‌భుత్వం ఉపాధ్యాయుల నియామ‌కం కోసం నిర్వ‌హించే స్కూల్ స‌ర్వీసెస్ క‌మిష‌న్‌( School Service Commission - SSC)ఎస్ఎస్‌సీ) ప‌రీక్షలో పెద్ద ఎత్తున అవినీతి చోటు చేసుకుంద‌న్న ఆరోప‌ణ‌ల‌పై ఈడీ విచార‌ణ ప్రారంభించింది. ఈ స్కామ్‌లో మంత్రి పార్థ చ‌ట‌ర్జీ పాత్రపై ఈడీకి క‌చ్చిత‌మైన ఆధారాలు ల‌భించాయి. దాంతో, క‌చ్చితమైన స‌మాచారంతో గ‌త‌వారం పార్థ చ‌ట‌ర్జీ స‌న్నిహితురాలైన అర్పిత ముఖ‌ర్జీ ఇంటిపై దాడి చేసి, ఒక గ‌దిలో దాచిన దాదాపు రూ. 20 కోట్ల న‌గ‌దును స్వాధీనం చేసుకుంది. దాంతో, ఆమెను, మంత్రి పార్థ చ‌ట‌ర్జీని ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. అలాగే, అర్పిత ముఖ‌ర్జీకి సంబంధించిన మరో ఇంట్లో బుధ‌వారం చేసిన దాడుల్లో మ‌రో రూ. 28.90 కోట్ల న‌గ‌దు, 5 కేజీల బంగారం, ఇత‌ర కీల‌క డాక్యుమెంట్లు ఈడీకి ల‌భ్య‌మ‌య్యాయి.

పార్టీ నుంచి కూడా..!

మ‌మ‌త మంత్రివ‌ర్గంలో సీనియ‌ర్ మంత్రిగా ఉన్న పార్థ చ‌ట‌ర్జీని ప‌ద‌వి నుంచి తొల‌గించ‌డం రాష్ట్రంలో సంచ‌ల‌నం సృష్టించింది. ప్ర‌భుత్వంలో మ‌మ‌త‌కు స‌న్నిహితుడైన మంత్రిగా పార్థ చ‌ట‌ర్జీకి పేరుంది. అనేక కీల‌క శాఖ‌ల‌ను ఆయ‌న నిర్వ‌హించారు. కాగా, మంత్రి ప‌ద‌వితో పాటు పార్టీ నుంచి కూడా ఆయ‌న‌ను సస్పెండ్ చేయాల‌ని మ‌మ‌త యోచిస్తున్న‌ట్లు స‌మాచారం. ఈ స్కామ్‌తో పార్టీ ప‌రువు పోయింద‌ని, పార్థ చ‌ట‌ర్జీని పార్టీ నంచి స‌స్పెండ్ చేయ‌డం ద్వారా కొంతైన ప‌రువును కాపాడుకోవ‌చ్చ‌ని మ‌మ‌త ఆలోచిస్తోంద‌ని పార్టీ వ‌ర్గాల స‌మాచారం.ఇప్ప‌టికే పార్థ చ‌ట‌ర్జీని పార్టీ నుంచి తొల‌గించాల‌ని తృణ‌మూల్ పార్టీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి కునాల్ ఘోష్ బ‌హిరంగంగానే డిమాండ్ చేశారు. త‌న డిమాండ్ త‌ప్పైతే త‌న‌నే స‌స్పెండ్ చేయాల‌ని స‌వాలు చేశారు. ప్ర‌స్తుతం పార్థ చ‌ట‌ర్జీ కూడా టీఎంసీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శిగా ఉన్నారు.

<p>అర్పితా ముఖర్జీ ఫ్లాట్ నుంచి స్వాధీనం చేసుకున్న 4.31 కోట్ల విలువైన బంగారు ఆభరణాలు</p>
అర్పితా ముఖర్జీ ఫ్లాట్ నుంచి స్వాధీనం చేసుకున్న 4.31 కోట్ల విలువైన బంగారు ఆభరణాలు (ANI)
IPL_Entry_Point